Bihar political crisis: నితీశ్‌ను నొప్పించిన నాలుగు కారణాలు!

ABN , First Publish Date - 2022-08-09T01:57:13+05:30 IST

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్‌‌, ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటున్నారన్న కథనాలు జాతీయ మీడియాలో

Bihar political crisis: నితీశ్‌ను నొప్పించిన నాలుగు కారణాలు!

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్‌‌, ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటున్నారన్న కథనాలు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. నితీశ్ నొచ్చుకోవడానికి ప్రధానంగా నాలుగు ప్రధాన కారణాలను రాజకీయ పరిశీలకులు చూపిస్తున్నారు.    


1. స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాను తొలగించకపోవడం  


భారతీయ జనతా పార్టీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. తరచూ ఆయన ప్రభుత్వ విధానాలను విమర్శిస్తుండటంతో సీఎం నితీశ్‌కుమార్‌ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. అనేక సందర్భాల్లో శాసనసభలోనే ఆయన స్పీకర్‌పై మండిపడ్డారు. విజయ్ కుమార్ సిన్హాను తొలగించాలని నితీశ్ చాలా కాలంగా అడుగుతున్నా బీజేపీ నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 


2. కేంద్ర మంత్రి వర్గంలో ఒక్కరికే ఛాన్స్ ఇవ్వడం


కేంద్ర మంత్రివర్గంలో జేడియూ తరపున ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వడంపై నితీశ్‌కు నచ్చలేదు. తనకు పెద్దగా ఇష్టంలేని తన పార్టీ రాజ్యసభ ఎంపీ ఆర్సీపీ సింగ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం నితీశ్‌కు చికాకు తెప్పించింది. అందుకే ఆయనకు మళ్లీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు. దీంతో ఆర్సీపీ సింగ్‌ కేంద్ర మంత్రిగా కొనసాగలేకపోయారు. ఆర్సీపీ సింగ్ తనను పెద్దగా పట్టించుకోకపోవడం కూడా నితీశ్ ఆగ్రహానికి కారణమైంది.  


3. బీహార్‌లో షా మాటే చెల్లుబాటు కావడం, జేడియూ మంత్రులు కూడా షా మాటే వినడం


బీహార్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట తన కన్నా ఎక్కువగా చెల్లుబాటు కావడం నితీశ్‌కు నచ్చలేదు. జేడియూ మంత్రులు కూడా షాకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో నితీశ్ అసంతృప్తిగా ఉన్నారు. 


4. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించకపోవడం


బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కూడా పార్లమెంట్ ఎన్నికలతో కలిసి నిర్వహించాలన్న తన డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోకపోవడం నితీశ్‌కు నచ్చలేదు. వాస్తవానికి 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నితీశ్ సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని అమిత్ షా ఇటీవలే స్పష్టం చేశారు కూడా. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడియూ కన్నా బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీకి 77, జేడియూకు 45 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా కూడా బీజేపీ అధిష్టానం నితీశ్‌నే సీఎం చే‌సింది. 


నితీశ్ గతంలోనూ ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నారు. ఆర్జేడీ- కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశారు కూడా. ఆ తర్వాత మళ్లీ యూ టర్న్ తీసుకుని బీజేపీతో సంబంధాలు సరి చేసుకుని బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  

Updated Date - 2022-08-09T01:57:13+05:30 IST