జేడీయూలో చేరిన బీహార్ మాజీ డీజీపీ పాండే

ABN , First Publish Date - 2020-09-27T23:14:39+05:30 IST

రాజకీయాల్లోకి వస్తారంటూ కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ..

జేడీయూలో చేరిన బీహార్ మాజీ డీజీపీ పాండే

పాట్నా: రాజకీయాల్లోకి వస్తారంటూ కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఎట్టకేలకు తెరదించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీ(యూ)లో ఆదివారంనాడు ఆయన చేరారు. నితీష్ కుమార్ నివాసంలో లాంఛనంగా ఆయన పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు.


గుప్తేశ్వర్ పాండే ఇటీవల తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన రాజీనామా చేయడంతో రాజకీయాల్లోకి వచ్చి జేడీయూ నుంచి పోటీ చేయనున్నారనే ఊహాగానాలు కొద్దిరోజులుగా వినిపిస్తూ వచ్చాయి. ఎట్టకేలకు నితీష్‌ సమక్షంలోనే ఆయన జేడీయూలో చేరారు.


అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్వయంగా పిలిపించి పార్టీలో చేరమని కోరారని, అందుకు తాను సమ్మతించానని చెప్పారు. పార్టీ ఏ పని అప్పగిస్తే ఆ పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాలపై తనకు అవగాహన లేదన్నారు. తాను ఒక సాధారణ వ్యక్తినని, సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం పనిచేసేందుకు తాను ఇష్టపడతానని పాండే తెలిపారు. ఆయన తన సొంత నియోజకవర్గమైన బక్సర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పాండే పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.


కాగా, 243 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలను ఈసీ ఇటీవల ప్రకటించింది. అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

Updated Date - 2020-09-27T23:14:39+05:30 IST