హాప్‌షూట్.. అంతా తూచ్!

ABN , First Publish Date - 2021-04-04T03:18:50+05:30 IST

హాప్ షూట్.. ఇటీవల ఈ పంట గురించి వైరల్ అయినంతగా ఇంకే వార్తా కాలేదు. బీహార్‌లోని ఔరంగాబాద్ ‌జిల్లాలో

హాప్‌షూట్.. అంతా తూచ్!

న్యూఢిల్లీ: హాప్ షూట్.. ఇటీవల ఈ పంట గురించి వైరల్ అయినంతగా ఇంకే వార్తా కాలేదు. బీహార్‌లోని ఔరంగాబాద్ ‌జిల్లాలో ఓ రైతు వీటిని పండిస్తున్నాడని, వాటి విలువ కిలో లక్ష రూపాయలంటూ అటూ ప్రధాన మీడియాలోను, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వార్త హల్‌చల్ చేసింది. అయితే, ఇప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ వార్త శుద్ధ అబద్ధమని తేలింది. వార్తలో పేర్కొన్న రైతు అలాంటిదేమీ పండించడం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. హాప్‌షూట్ పంటతో రైతు లక్షలాది రూపాయలు పండిస్తున్నాడంటూ ఐఏఎస్ అధికారి ఒకరు ట్వీట్ చేయడంతో ఈ వార్త దేశం మొత్తం పాకిపోయింది.  


ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే పంట ఇదే ఇదేనని, కిలో లక్షరూపాయల ధర పలికే దీనిని అమ్రేశ్ సింగ్ అనే రైతు పండిస్తున్నాడని ఆ ట్వీట్‌లో ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు పేర్కొన్నారు. దేశంలో తొలిసారి పండిస్తున్న రైతు అమ్రేశ్ సింగేనని పేర్కొంటూ మార్చి 31న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను 24 వేల మంది లైక్ చేయగా, 5 వేల మంది రీ ట్వీట్ చేశారు. దీంతో ఆ రైతు కాస్తా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయాడు. 


ఒక్క పంటతో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న అమ్రేశ్ గురించి తెలుసుకునేందుకు శుక్రవారం ‘దైనిక్ జాగరణ్’ దినపత్రిక అమ్రేశ్ సింగ్ గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ అలాంటి పంట లేకపోవడంతో ఆ పత్రిక ప్రతినిధులు నోరెళ్లబెట్టారు. స్థానిక రైతులు కూడా అలాంటి పంట గురించి తామెప్పుడూ వినలేదని చెప్పారు.


దీంతో విస్తుపోయిన రిపోర్టర్లు.. అమ్రేశ్‌ను సంప్రదించగా, ఆ పంట ఉన్నది ఇక్కడ కాదని, 172 కిలోమీటర్ల దూరంలోని నలంద జిల్లాలో పండిస్తున్నట్టు చెప్పాడు. దీంతో పత్రిక ప్రతినిధి బృందం అక్కడకు వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక, ఇక్కడ కాదు ఔరంగాబాద్‌లో అంటూ రైతు మాట మార్చాడు.


అక్కడ కూడా అలాంటి పంట పండిస్తున్న దాఖలాలు లేవని ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్ సౌరభ్ జోర్వాల్ చెప్పారు. అమ్రేశ్ సింగ్ గతంలో బ్లాక్ రైస్, గోధుమలు పండించేవాడని, హాప్ షూట్స్ కాదని తేలింది. అమ్రేశ్ చెప్పిందంతా అబద్ధమని స్పష్టమైంది. హాప్ షూట్స్‌తో అమ్రేశ్ లక్షలు గడిస్తున్నాడంటూ ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని తేలడంతో సోషల్ మీడియా విస్తుపోయింది.


అయితే, హాప్ షూట్స్ పంట ఉన్నది మాత్రం వాస్తవమే. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో వీటిని పండిస్తారు. సువాసన, చేదు తదితర ఫ్లేవర్స్ కోసం బీరు తయారీలో వీటిని ఉపయోగిస్తారు. కాగా, ఐఏఎస్ అధికారి అయి ఉండీ వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ట్వీట్లు ఏంటంటూ సుప్రియా సాహుపై మండిపడుతున్నారు.

Updated Date - 2021-04-04T03:18:50+05:30 IST