మూడు దశల్లో బిహార్‌ ఎన్నికలు

ABN , First Publish Date - 2020-09-26T07:28:16+05:30 IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ శుక్రవారంనాడు ప్రకటించింది...

మూడు దశల్లో బిహార్‌ ఎన్నికలు

  • అక్టోబరు 28, నవంబరు 3, 7 తేదీల్లో పోలింగ్‌
  • నవంబరు 10వ తేదీన కౌంటింగ్‌ 
  • కొవిడ్‌ సమయంలో 
  • ప్రపంచంలోనే తొలి భారీ ఎన్నికలు
  • పకడ్బందీగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు
  • ఎన్డీఏ కూటమికే విజయావకాశాలు!


న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ శుక్రవారంనాడు ప్రకటించింది. 243 స్థానాలున్న శాసనసభకు అక్టోబరు 28, నవంబరు 3, నవంబరు 7 వ తేదీల్లో పోలింగ్‌ జరుపుతామని, ఓట్ల లెక్కింపు నవంబరు 10వ తేదీన ఉంటుందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోరా చెప్పారు. నక్సల్‌ ప్రభావ జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్లా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఓటింగ్‌ జరుగుతుందనీ, అవసరమైతే మరో గంట పొడిగిస్తామని తెలిపారు. కొవిడ్‌ రోగులు ఆఖరి గంటలో ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్నారు. తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్‌ అక్టోబరు 1న విడుదల అవుతుందనీ, 8 వరకూ నామినేషన్లు స్వీకరిస్తామని, ఉపసంహరణ గడువు అక్టోబరు 12 అనీ తెలిపారు. రెండో దశ ప్రక్రియ అక్టోబరు 9-19 మధ్య, మూడో దశ ప్రక్రియ అక్టోబరు 13-23 మధ్య ఉంటాయన్నారు. కాగా- కొవిడ్‌ సమయంలో ఎన్నికల నిర్వహణను సవాల్‌ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ - ప్రపంచంలోనే ఇవి అతిపెద్ద ఎన్నికలని, మన తరువాతే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌ ఉధృతి దృష్ట్యా 7.2 కోట్ల సింగిల్‌ యూజ్‌ గ్లోవ్స్‌, 7 లక్షల శానిటైజర్లు, 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. సామాజిక దూరం పాటించడం, పోలింగ్‌ కేంద్రాల పెంపు... మొదలైన అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1500 నుంచి 1000కి తగ్గించారు. కాగా, ఎన్‌డీఏ- మహాకూటమి మధ్య ప్రధానంగా జరిగే ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ మళ్లీ విజయభేరి మోగించవచ్చనీ, నితీశ్‌ కుమారే మళ్లీ సీఎం కావొచ్చని సర్వేలు చెబుతున్నాయి. జేడీయూ-బీజేపీ- ఎల్‌జేపీలతో కూడిన ఎన్‌డీఏలో సీట్ల సర్దుబాటు ఇబ్బందికరంగా మారే సూచనలున్నాయి. ఆర్జేడీ-కాంగ్రెస్‌- ఎన్సీపీ, ఆర్‌ఎల్‌ఎస్పీ-లె్‌ఫ్ట-మరికొన్ని చిన్న పార్టీలతో మహాకూటమి బరిలో దిగుతోంది. నితీశ్‌కు దీటైన నేత ఈ కూటమి పార్టీల్లో లేకపోవడం పెద్ద మైనస్‌ కాగలదంటున్నారు. 

Updated Date - 2020-09-26T07:28:16+05:30 IST