ప్రధాని కావాలన్న ఆశ లేదు

ABN , First Publish Date - 2022-08-13T08:55:56+05:30 IST

ప్రధాన మంత్రి కావాలన్న ఆశ తనకు ఎంత మాత్రం లేదని బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ అన్నారు. అయితే, ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడానికి తన వంతు

ప్రధాని కావాలన్న ఆశ లేదు

 విపక్షాల ఐక్యతకు కృషి చేస్తా: నితీశ్‌ కుమార్‌


పట్నా, ఆగస్టు 12: ప్రధాన మంత్రి కావాలన్న ఆశ తనకు ఎంత మాత్రం లేదని బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ అన్నారు. అయితే, ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. శుక్రవారం నితీశ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీతో విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో జేడీయూ నేతలపై సీబీఐ, ఈడీ దాడులు జరుగుతాయని మీరు భయపడుతున్నారా’ అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదన్నారు. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు అంతా చూస్తున్నారని, బీజేపీ చర్యలను హర్షించరని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం తేజస్వికి జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పించాలన్న నిర్ణయాన్ని నితీశ్‌ సమర్థించుకొన్నారు.


10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కొత్త ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా, జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వ ఏర్పాటుతో బిహార్‌లో మళ్లీ జంగిల్‌ రాజ్‌ వచ్చిందని బీజేపీ విమర్శించింది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత.. జేడీయూకు నాలుగు మంత్రి పదవులు కేటాయించాలని బీజేపీని అడిగినట్లు నితీశ్‌ శుక్రవారం చెప్పారు. అయితే, బీజేపీ అందుకు నిరాకరించిందని తెలిపారు. అందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో జేడీయూ భాగస్వామి కాలేదన్నారు. 

Updated Date - 2022-08-13T08:55:56+05:30 IST