Bihar Caste Census : కులాలవారీ జన గణనపై అఖిల పక్ష భేటీ : నితీశ్ కుమార్

ABN , First Publish Date - 2022-05-24T01:49:08+05:30 IST

బిహార్‌లో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణపై ఈ వారంలో

Bihar Caste Census : కులాలవారీ జన గణనపై అఖిల పక్ష భేటీ : నితీశ్ కుమార్

పాట్నా : బిహార్‌లో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణపై ఈ వారంలో అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సోమవారం సంకేతాలు ఇచ్చారు. బహుశా ఈ నెల 27న ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ కార్యక్రమానికి హాజరైన నితీశ్ విలేకర్లతో మాట్లాడారు. 


కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ (Caste Census)పై చర్చించేందుకు ఈ నెల 27న అఖిల పక్ష సమావేశం జరగబోతోందని వార్తలు వస్తున్నాయని విలేకర్లు ప్రస్తావించినపుడు నితీశ్ కుమార్ (Nitish Kumar) స్పందిస్తూ, ఈ తేదీన సమావేశం నిర్వహించడానికి చాలా పార్టీలు అంగీకరించాయన్నారు. ఈ సమావేశాన్ని నిర్వహించే తేదీ విషయంలో అన్ని పార్టీల సమ్మతి అవసరమని తెలిపారు. 


బిహార్‌లో జేడీయూ (JDU), బీజేపీ (BJP) కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కులాలవారీ జన గణనపై బీజేపీ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయని నితీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. బిహార్ శాసన సభ, శాసన మండలి రెండుసార్లు దీనికి అనుకూలంగా తీర్మానాలను ఆమోదించాయని, అందువల్ల ఎటువంటి సమస్య ఉండకూడదని అన్నారు. 


జాతీయ స్థాయిలో కులాలవారీ జన గణనకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జేడీ వంటి ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. బీజేపీకి ప్రధానంగా అగ్ర వర్ణాల మద్దతు ఉందని, అందుకే ఓబీసీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నాయి. అయితే తమ పార్టీ కులాలవారీ జన గణనకు వ్యతిరేకం కాదని బిహార్ బీజేపీ నేతలు చెప్తున్నారు. 


Updated Date - 2022-05-24T01:49:08+05:30 IST