Bihar Cabinet: మహిళా ఎమ్మెల్యేకి నితీశ్ కుమార్ షాక్

ABN , First Publish Date - 2022-08-19T00:03:07+05:30 IST

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) తన సొంత పార్టీ ఎమ్మెల్యే

Bihar Cabinet: మహిళా ఎమ్మెల్యేకి నితీశ్ కుమార్ షాక్

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) తన సొంత పార్టీ ఎమ్మెల్యే బీమా భారతి (Bima Bharti)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతివారినీ ప్రతిసారీ మంత్రిని చేయలేనని స్పష్టం చేశారు. ఎన్డీయే (NDA) నుంచి బయటకు వచ్చిన జేడీయూ (JDU) ఇటీవల ఆర్జేడీ (RJD), మరికొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 


జేడీయూ సీనియర్ ఎమ్మెల్యే బీమా భారతి మీడియాతో మాట్లాడుతూ, లేషీ సింగ్‌ (Leshi Singh)ను ప్రతిసారీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని, అదే తనను తలక్రిందులు చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆమెలో ఏం చూస్తున్నారని ప్రశ్నించారు. ఆమె (లేషీ) తన ప్రాంతంలో పదే పదే అనేక సంఘటనలకు పాల్పడుతున్నారన్నారు. పార్టీని అపఖ్యాతిపాలు చేస్తున్నారన్నారు. ‘‘నేను చెప్పే మాటలను ఎందుకు వినడంలేదు? నేను వెనుకబడిన కులానికి చెందినదానిని అనేనా?’’ అని ప్రశ్నించారు. లేషీ సింగ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. లేషీ సింగ్‌పై తాను చేసిన ఆరోపణలు తప్పు అని నిర్థరణ అయితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. 


అర్థం చేసుకుంటే మంచిది : నితీశ్

ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ పాట్నాలో విలేకర్లతో మాట్లాడుతూ, లేషీ సింగ్ 2013, 2014, 2019 సంవత్సరాల్లో మంత్రిగా పని చేశారన్నారు. అప్పట్లో ఆమెపై ఇటువంటి ఆరోపణలేవీ లేవన్నారు. ఇదంతా అర్థం లేనిదని చెప్పారు. తాను ప్రతిసారీ ప్రతి ఒక్కరినీ మంత్రిని చేయలేనని చెప్పారు. బీమా భారతి కూడా రెండుసార్లు మంత్రిగా చేశారన్నారు. ఇలాంటి ప్రవర్తన సరికాదన్నారు. బీమా భారతితో పార్టీ ప్రశాంతంగా మాట్లాడుతుందన్నారు. ఆమె అర్థం చేసుకుంటే మంచిదని, లేదంటే ఆమె అక్కడికి, ఇక్కడికి వెళ్ళాలనుకుంటే, దాని గురించి ఆలోచించుకోవచ్చునని చెప్పారు. ఆమె సక్రమంగా చదవలేకపోయినప్పటికీ ఆమెకు రెండుసార్లు మంత్రి పదవిని ఇచ్చామని, తాము ఆమెకు గొప్ప గౌరవం ఇచ్చామని చెప్పారు. తనను బుధవారం కలవాలని ఆమెకు చెప్పానని, అయితే ఆ అవసరం లేదని ఆమె తన కార్యాలయానికి సమాచారం ఇచ్చారని, అందుకే తాను నేడు ఈ ప్రకటన చేశానని తెలిపారు. 


ఇదిలావుండగా, లేషీ సింగ్ ఈ అంశంపై స్పందించలేదు. ఆర్జేడీకి చెందిన కార్తికేయ సింగ్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆయన కిడ్నాప్ కేసులో నిందితుడు కావడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 


ఆర్జేడీ, జేడీయూ తదితర పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మంగళవారం 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం మీద 36 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. అంటే మూడు పదవులు ఖాళీగా ఉన్నాయి. అందుకే బీమా భారతి పట్టుబడుతున్నట్లు కనిపిస్తోంది.


Updated Date - 2022-08-19T00:03:07+05:30 IST