బిహార్‌లో ఈ నెల 31న పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (బీఎస్ఈబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి సంబంధించి పాస్ మార్కులను 30గా నిర్ణయించింది. అంటే ప్రతి సబ్జెక్టులో 100 మార్కులకుగాను 30 మార్కులు తెచ్చుకుంటే చాలు... పాసైనట్లే. సాధారణంగా 35 మార్కులకు పాస్‌గా పరిగణిస్తారనే సంగతి తెలిసిందే. బిహార్‌లో గత ఫిబ్రవరి 17 నుంచి 24 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఎగ్జామ్స్ సందర్భంగా మ్యాథ్స్ పేపర్ లీక్ అవ్వగా, ఒక్క జిల్లాలో తిరిగి పరీక్ష నిర్వహించారు. గత ఏడాది పదో తరగతికి సంబంధించి 78.17 శాతం మంది పాసయ్యారు. ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. 80.15 శాతం మంది పాసయ్యారు.