పాట్నా: 'మద్యపాన నిషేధ బిల్లు-2022 బిల్లు(సవరణ)'కు బుధవారం బిహార్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే బిహార్లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. కాగా, ఆ చట్టానికి తాజాగా కొన్ని సవరణలు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం.. ఇక నుంచి ఎవరైనా మద్యం సేవిస్తున్నట్లు, అమ్ముతున్నట్లు కనిపిస్తే వారిని సాధారణ కోర్టుకు కాకుండా ఎక్సైజ్ కోర్టుకు పంపనున్నట్లు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సునీల్ కుమార్ తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మద్యం సేవించినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని తీసుకువచ్చాం. ఇక నుంచి ఎవరైనా అలా కనిపిస్తే జరిమానా విధించడంతో పాటు వారిని ఎక్సైజ్ కోర్టుకు పంపిస్తాం. అయితే జరిమానా ఎంతనేది ఇంకా నిర్ణయించలేదు. తొందరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 66,000 వాహనాలను జప్తు చేశాం. ఆ వాహనాలను ఇంకా వేలం వేయలేదు. అయితే మద్యం వినియోగించని వాహనాలను జప్తు చేయకుండా జరిమానాలతో విడిచిపెట్టాలని నిర్ణయించాం. ఇకపోతే.. డ్రోన్ల ద్వారా పొలిమేరల్లో పట్టుకున్న మద్యాన్ని అక్కడే ధ్వంసం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం’’ అని అన్నారు.