Abn logo
Oct 30 2020 @ 00:59AM

బిహార్‌: ఏదీ ఆనాటి స్ఫూర్తి?

Kaakateeya

బిహార్‌లో శాసనసభా ఎన్నికలు భారతీయ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న మార్పులను సూచించేవిగా ఉండేవి. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సంభవిస్తున్న మార్పులను అవి ప్రతిబింబించేవి. సామాజికంగా అణగారిన వర్గాల ప్రజాస్వామిక పురోగమనానికి ప్రాతిపదికలుగా నిలిచేవి. బిహార్ -2020 ఎన్నికలు కేవలం ‘కౌన్ బనేగా సిఎం’ (ఎవరు ముఖ్యమంత్రి అవుతారు?) అన్న విషయాసక్తికి మాత్రమే తావిస్తున్నాయి.


బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతాయా? అవి పథ నిర్ణేతలు అవుతాయని నేను భావించడం లేదు. అసలు బిహార్ -2020 ఎన్నికల గురించి శ్రద్ధాసక్తులు చూపాలన్న ఉత్సాహమే నాకు కలగడం లేదు. నాకు ఇదొక వింత పరిస్థితి. ఎందుకంటే మూడు దశాబ్దాల పాటు వృత్తిగతంగా, రాజకీయంగా, ఒక పౌరధర్మ స్ఫూర్తితో ఎన్నికలను అధ్యయనం చేసిన నేను ప్రస్తుత బిహార్ పోరు విషయంలో నిరాసక్తంగా ఉన్నాను. అలసిపోయానా? లేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ముందస్థుగా నిర్ధారణ అయినందునే నేను తొలుత ఉత్సుకత చూపించలేదు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో కూడా నేను నిరాసక్తంగానే ఉండిపోయాను. 


కొవిడ్ విపత్తు అనంతరం జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవి. పాట్నాలో ఎన్డీఏ మళ్ళీ అధికారానికి రావడం, రాలేకపోవడం అనేది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కొంతకాలం పాటు ప్రభావితం చేస్తుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే విషయం నాకు ఆసక్తిదాయకమే అయినా, ఎన్నికల ప్రక్రియలో ఆసక్తి చూపేందుకు నాకు ప్రేరణ కలగడం లేదు. ఈ ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదనడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి-, ఇటీవలి గతంలో పోలిస్తే మన జాతీయ జీవనంలో బిహార్ పాత్ర ఇప్పుడు గణనీయంగా లేదు. రెండు,-రాష్ట్ర రాజకీయాలు జాతీయ రాజకీయాలకు అంత ముఖ్యం కాదు. మూడు,- యథాప్రకారం ఎన్నికల నిర్వహణ, పార్టీల జయాపజయాలు మన ప్రజాస్వామ్య గమనాన్ని పెద్దగా ప్రభావితం చేసే వ్యవహారాలు కావు. 


ఉత్తర భారతావనిలో హిందీ భాషీయుల రాష్ట్రాలలో బిహార్‌కు ఒక విశిష్టస్థానం ఉంది. ఒక విలక్షణ సాంస్కృతిక, రాజకీయ, భాషాపరమైన అస్తిత్వముంది. ఉత్తర భారతావని రాజకీయాలకు ఒక అధికేంద్రం (ఎపిసెంటర్)గా అది గణుతికెక్కింది. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవ’ ఉద్యమ కాలం నుంచీ తాము పథ నిర్ణేతలమని సగర్వంగా చెప్పుకోవడం బిహారీలకు ఒక పరిపాటిగా ఉంది. సామాజిక, రాజకీయ రంగాలలో మార్పులను సంభావించడంలోనూ, సాధించడంలోనూ తాము మార్గదర్శకులుగా ఉంటున్నామనే భావన వారికి ఉంది. ఇది ఒక విధంగా వాస్తవం కూడా. మిగతా హిందీ భాషీయుల రాష్ట్రాలలో సంభవించే రాజకీయ మార్పులను బిహార్ ఎన్నికలు ముందస్తుగా నిర్దేశిస్తుంటాయి. దేశంలో మండల్‌వాద రాజకీయాల ప్రభవ ప్రాభవాలను 1990, 1995లలో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే సూచించాయి. 2005, 2010 అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు నితీశ్ కుమార్ సాధించిన విజయాలు సుపరిపాలన లోపించిన సామాజిక న్యాయం పట్ల ప్రజల విసుగుదలకు, ఎన్నికల రాజకీయాలలో ‘బిజిలీ, సడక్, పానీ’ (విద్యుత్తు, రోడ్లు, నీరు) దశ ఆరంభానికి తార్కాణాలు. 


పది సంవత్సరాలుగా బిహార్‌లో జయపతాకను ఎగురవేసేందుకు హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తున్నా, మిగతా హిందీ రాష్ట్రాలలో వలే అవి సంపూర్ణంగా సఫలం కాలేదు. అగ్రకులాలు-, కొన్ని ‘కిందిస్థాయి’ ఓబీసీ (ఇతర వెనుకబడిన వర్గాలు)ల సామాజిక సంకీర్ణాన్ని నిర్మించేందుకు బీజేపీ తొలుత ఉత్తరప్రదేశ్‌లో ప్రయత్నించింది. పాత తరహా మండల్ రాజకీయాలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. అయితే వాటి స్థానంలో పొందికైన కొత్త రాజకీయాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రీయ జనతాదళ్ తన ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకుకు అదనంగా కొన్ని అగ్రకులాల వారి ఓట్లను గణనీయంగా సాధించుకునేందుకు ఒక పటిష్ఠ వ్యూహంతో ప్రయత్నిస్తోంది. అయితే అది ఆచరణీయ నమూనాగా కానరావడం లేదు. 


నిరుద్యోగ సమస్య ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో ఒక ప్రధానాంశం కాబోతుందా? మిగతా రాష్ట్రాలు కూడా ఆ సమస్యకు అగ్ర ప్రాధాన్యమిచ్చేందుకు బిహార్ స్ఫూర్తిగా నిలుస్తుందా? ఇలాంటి పరిణామం సంభవించని పక్షంలో ఉత్తర భారతావని రాజకీయాలకు అది ఇంకెంత మాత్రం పథ నిర్ణేత కాదని చెప్పక తప్పదు. ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దేశ రాజకీయాలకు ఒక ప్రధాన రంగస్థలంగా లేవు. నిజానికి ఇది ఇప్పుడు అన్ని రాష్ట్రాల రాజకీయాలకు వర్తిస్తుంది. ఎన్నికల ఫలితాలు ఏ పార్టీ లేదా కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ అవి ‘జాతి మనస్థితి’ని ప్రతిబింబిస్తున్నాయని టీవీ న్యూస్ ఛానెల్స్ చర్చల్లో తప్పక ఊదరగొడతారు. 1990 నుంచి 2013 వరకు రాష్ట్రస్థాయి రాజకీయాలు జాతీయ రాజకీయాలను అర్థంచేసుకునేందుకు కీలకంగా ఉండేవి. 1970, 1980 దశకాలలో రాజకీయాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేవి. ఆ కాలంలో తము ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్నామన్న రీతిలో ప్రజలు రాష్ట్రస్థాయి ఎన్నికలలో ఓటు వేసేవారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలలో, తమ ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకుంటున్నామన్న రీతిలో ఓటు వేయడం పరిపాటి అయింది. ఈ పరిణామాన్నే ‘రాష్ట్రాలు దేశ రాజకీయాల ప్రధానరంగాలుగా ఆవిర్భవించడం’గా సుహాస్ పల్షీకర్, నేను అభివర్ణించాం. 2014లో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి నుంచి రాష్ట్ర స్థాయి ఎన్నికల ధోరణులు, రీతులు జాతీయస్థాయి ఎన్నికలలో ఫలితాలకు సూచనలుగా ఉండడం లేదు. ఇప్పుడు మనం ‘టిక్కెట్ -స్ప్లిట్టింగ్’ (ఒకే ఓటరు వేర్వేరు పదవులకు పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులకు ఓటువేయడం) యుగంలో ఉన్నాం. 2019లో ఒడిషా ఓటర్లు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ వైపు మొగ్గారు. అదే రోజు రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బిజూ జనతాదళ్‌పై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. ఢిల్లీ ఓటర్లు లోక్‌సభ ఎన్నికలలో ఆమ్‌ఆద్మీ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. అయితే కొద్దినెలల అనంతరం అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి ఘన విజయాన్ని సమకూర్చారు. 


బిహార్‌కూ ఇది వర్తిస్తుంది. బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తే ప్రధాని మోదీ పాలనకు ప్రజామోదంగా ఆ పార్టీ వర్గాలు పెద్దఎత్తున ప్రచారం చేస్తాయి. కరోనా మహమ్మారిని అదుపు చేయడంలోనూ, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలోనూ ఆయన నిర్ణయాలు, చర్యలను ప్రజలు సమర్థించారని బీజేపీ శ్రేణులు ఘోషిస్తాయి. ఏమైనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర స్థాయి వ్యవహారాలపై బిహారీ ఓటర్ల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబిస్తాయి. జాతీయ స్థాయిలో వారు ఎవరి వైపు మొగ్గుతున్నారన్న విషయాన్ని (నిజానికి ఇదే ముఖ్యం) అవి సూచించవు. 


అసెంబ్లీ ఎన్నికలు గానీ, సార్వత్రక ఎన్నికలు గానీ ఇప్పుడికి మాత్రం మన రాజకీయ జీవితానికి కీలకంగా లేవు. మన జాతి ప్రజాస్వామిక జీవితంలో అవి, ఇతర దేశాలలో కంటే చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించాయి. మన ప్రభుత్వ వ్యవస్థలు, పౌరసంస్థలు బలహీనమైనవి కావడంతో ప్రజలను అధికారంతో కలిపే ఏకైక వారధిగా ఎన్నికలు ఉన్నాయి. కనుకనే మన ప్రజాస్వామ్యంలో అవి అత్యంత ప్రధానమైనవిగా వర్థిల్లుతున్నాయి. ప్రజలు తమ సార్వభౌమిక హక్కును వినియోగిస్తున్న ఏకైక సందర్భం ఎన్నికలే కదా. 1977, 1980, 1984 సార్వత్రక ఎన్నికలు సృష్టించిన చరిత్రను గుర్తు చేసుకోండి. 1990 దశకంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తరచు కూలిపోవడానికి కారణమైన రాజకీయ ఉపద్రవాలను కూడా ఈ సందర్భంగా తప్పక గుర్తుచేసుకోవాలి. రాజకీయ నాయకుల అదృష్ట దురదృష్టాలను, రాజకీయ పక్షాల జయాపజయాలను, ప్రభుత్వాల ప్రభవ పతనాలను మాత్రమే కాదు సామాజిక అధిక్రమాలను, స్థానిక సంబంధాలను కూడా ఎన్నికలు నిర్ణయిస్తున్నాయి. మన దేశంలో అవి సంబరాల స్వభావాన్ని కలిగి ఉండడం పరిపాటి అయింది. దీంతో ఈ ప్రజాస్వామిక క్రతువు ప్రజలను అమితంగా అలరిస్తోంది. 


2014 తరువాత ఈ ధోరణిలో మార్పు మొదలయింది. ఎన్నికలు సాధారణ కార్యకలాపాలయ్యాయి. అభ్యర్థులు, పార్టీలకు మాత్రమే అవి ముఖ్యంగా ఉన్నాయి గానీ ప్రజా జీవితానికి సంబంధించిన గంభీరమైన అంశాలను ప్రతి బింబించడం లేదు. ఎన్నికల ప్రక్రియ క్రమంగా ప్రజలతో కంటే డబ్బు, మీడియా, నిర్వహణ పద్ధతులు, వ్యూహాలతో ఎక్కువ ప్రమేయమున్న కార్యక్రమంగా మారిపోయింది. ప్రభుత్వమూ, దాని అధినేతపై ప్రజల అభిప్రాయాలు మాత్రం పరిగణనలోకి తీసుకోక తప్పని అంశాలుగా కొనసాగుతున్నాయి. 2014 నుంచి ఈ ధోరణి బాగా ప్రబలమయిపోయింది. ఎలాగైనాసరే ఎన్నికలలో గెలిచి తీరడమే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమైపోవడంతో ఎన్నికలు తమ విశాల, ప్రజాహిత ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. రాజకీయ పార్టీల ఎన్నికల యంత్రాంగాలు, మీడియా వ్యూహాలే ఇప్పుడు ఎన్నికలలో సర్వస్వమైపోయాయి. వివిధ అంశాలపై ప్రజల అభిప్రాయాలు, వైఖరులను అవి ఎంత మాత్రమూ ప్రతిబింబించడం లేదు. ప్రజల సమస్యల పరిష్కారానికి కొత్త ఆలోచనలను పురిగొల్పేవిగా ఎన్నికల తీరు తెన్నులు ఉండడం లేదు. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వారి విధానాలు, పాలనారీతులపై ప్రతిఘటనలకు ఎన్నికలు ఎంతమాత్రం ఆస్కారం కావడం లేదు. 1971 అనంతరం ఇందిరాగాంధీ నిరంకుశ ధోరణులను గుజరాత్, బిహార్ ఉద్యమాలు సవాల్ చేశాయి. ఇప్పుడు కేంద్రంలోని పాలకుల నిరంకుశ పద్ధతులను ఎన్నికల రంగంలో సవాల్ చేయడం అనూహ్యమైపోయింది.


బిహార్‌లో శాసనసభ ఎన్నికలు ఒకప్పుడు భారతీయ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న మార్పులను సూచించేవిగా ఉండేవి. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సంభవిస్తున్న మార్పులను అవి ప్రతిబింబించేవి. సామాజికంగా అణగారిన వర్గాల ప్రజాస్వామిక పురోగమనానికి ప్రాతిపదికలుగా నిలిచేవి. బిహార్ -2020 ఎన్నికలు కేవలం ‘కౌన్ బనేగా సిఎం’ (ఎవరు ముఖ్యమంత్రి అవుతారు?) అన్న విషయాసక్తికి మాత్రమే తావిస్తున్నాయి.

యోగేంద్ర యాదవ్

స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు

Advertisement
Advertisement