చిన్న లక్ష్యాలతో పెద్ద విజయం

ABN , First Publish Date - 2020-09-09T05:30:00+05:30 IST

జీవితాంతం ఏదో ఒకకొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే, రోజూ పది నిమిషాలు చదవడానికి కేటాయించండి. అనుకున్న సమయానికి కట్టుబడి ఉండండి.

చిన్న లక్ష్యాలతో పెద్ద విజయం

జీవితాంతం ఏదో ఒకకొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే, రోజూ పది నిమిషాలు చదవడానికి కేటాయించండి. అనుకున్న సమయానికి కట్టుబడి ఉండండి. ముందుచూపుతో కూడిన ఆలోచన లక్ష్యాన్ని తగ్గిస్తుంది. 


ప్రతి ఒక్కరికీ చిన్నదో, పెద్దదో ఒక లక్ష్యం ఉంటుంది. తమ కలను నిజం చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీరిలో చాలామందికి లక్ష్యం దిశగా సాగేందుకు ప్రణాళికలు వేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఉదాహరణకు బరువు తగ్గడం, స్నేహితులతో కొంత సమయం గడపాలనుకోవడం వంటివి. ఇవి చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి. కానీ జీవితంలో ఏది కూడా చిన్న విషయం కాదు. ‘ఛాలెంజింగ్‌గా ఉండే లక్ష్యం పెట్టుకోవడం కన్నా చిన్నచిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం మంచిది’ అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణురాలు రోవెనా త్సాయ్‌. తన యూట్యూబ్‌ వీడియోలో కొత్తగా ఆలోచించేందకు తోడ్పడే పలు సూచనలు చేస్తున్నారు. లక్ష్యాలు నిర్దేశించుకోవడం, వాటిని చేరుకోవడం గురించి ఆమె ఏం అంటున్నారంటే...

 సిస్టమ్‌, గోల్‌ మధ్య గల తేడాను రోవెనా వివరంగా చెబుతున్నారిలా... ‘‘మీరు ప్రతి రోజూ చేసే కొన్ని పనులు ‘సిస్టమ్‌’ కిందకు వస్తాయి. మీరు భవిష్యత్తులో ఏదోరోజు సాధించేదాని కోసం వేయికళ్లతో ఎదురుచూస్తారు చూడండి అదే ‘గోల్‌’. ప్రస్తుతం ఉన్న స్థితి, అనుకున్న స్థాయికి చేరేందుకు మధ్య ఉన్న అంతరాన్ని క్రమబద్ధంగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి’’అంటారు రోవెనా.


దూరాన్ని గుర్తించాలి

‘‘ముందుగా మీ ప్రస్తుత స్థితి మీద దృష్టి పెట్టి, ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు కోరుకున్న స్థాయి గురించి ఇదే ప్రశ్నను పదేపదే వేసుకోండి. ఇప్పుడు చేయాల్సిందేమంటే ఈ రెండిటి మధ్య ఉన్న దూరాన్ని  తెలుసుకోవాలి. ఆ అంతరం ఎందుకు ఉంది, దాన్ని మీరు ఎందుకు అధిగమించాలి అనుకుంటున్నారు అనేది ఆలోచించుకోవాలి. తర్వాతి అడుగు ఏమంటే ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు చిన్న, పెద్ద ప్రణాళికలు వేసుకోవాలి. మీరు మీ ప్రస్తుత, చేరుకోవాల్సిన స్థాయిని తెలుసుకోవాలి. వీటి మధ్య ఉన్న అంతరాన్ని ఎలా భర్తీ చేయాలో కూడా అవగాహనకు రావాలి. ఇప్పుడు సరైన కార్యచరణతో అనుకున్నది సాధించాలి. అలానే మీరు జీవితాంతం ఏదో ఒకకొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే, రోజూ పది నిమిషాలు చదవడానికి సమయం కేటాయించేలా ప్రణాళిక వేసుకోండి. అనుకున్న సమయానికి కట్టుబడి ఉండండి. రోజూ కొత్త విషయం తెలుసుకోండి. ముందుచూపుతో కూడిన ఆలోచన లక్ష్యాన్ని తగ్గిస్తుంది. అలాగని ఈ ప్రయత్నం అంతా ఏదో చిన్న విజయానికే పరిమితం చేయకూడదు. ఇదంతా మనల్ని మనం మెరుగుపరుచుకొనే నిరంతర ప్రక్రియలా సాగాలి. అంతిమంగా మీ అంకితభావమే మీ పురోగతిని నిర్ణయిస్తుంది’’ అంటున్నారీ యూట్యూబ్‌ స్టార్‌.

Updated Date - 2020-09-09T05:30:00+05:30 IST