Target Vs Employees: ఉద్యోగులపై కొరడా ఝళిపిస్తున్న విప్రో

ABN , First Publish Date - 2022-08-18T22:52:51+05:30 IST

ఇచ్చిన టార్గెట్లను విజయవంతంగా పూర్తి చేయని ఉద్యోగులపై విప్రో (Wipro) కొరడా

Target Vs Employees: ఉద్యోగులపై కొరడా ఝళిపిస్తున్న విప్రో

న్యూఢిల్లీ : ఇచ్చిన టార్గెట్లను విజయవంతంగా పూర్తి చేయని ఉద్యోగులపై విప్రో (Wipro) కొరడా ఝళిపించింది. మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు వేరియబుల్ పే (variable pay)ను నిలిపేసింది, ఫ్రెషర్, జూనియర్ లెవెల్ సిబ్బందికి వేరియబుల్ పేలో 30 శాతం కోత విధించింది. ఆపరేటింగ్ మార్జిన్ ప్రెజర్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలిపింది. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, 'C' బ్యాండ్, సీనియర్ ఎంప్లాయీస్‌కు విప్రో పంపించిన ఈ-మెయిల్‌లో ‘‘మీకు వేరియబుల్ పేఅవుట్స్ రావు’’ అని చెప్పినట్లు తెలుస్తోంది. 'A', 'B' బ్యాండ్లలోని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో ‘‘మీకు చెప్పిన టార్గెట్ పేఅవుట్‌లో 70 శాతం మీరు పొందుతారు’’ అని చెప్పినట్లు సమాచారం. ఈ కోతలు ఆగస్టు నెలాఖరుకు జరుగుతాయి. 


అప్పగించిన టార్గెట్లను విజయవంతంగా పూర్తి చేయడంలో విఫలమైనందుకు వేరియబుల్ పేను నిలిపేస్తున్నట్లు విప్రో తెలిపింది. ఉద్యోగుల అసమర్థత వల్ల మొదటి త్రైమాసికంలో చాలా తక్కువగా 15 శాతం మార్జిన్ మాత్రమే వచ్చినట్లు పేర్కొంది. ప్రాజెక్టు మార్జిన్స్, టాలెంట్ టెక్నాలజీ, సొల్యూషన్స్‌‌లో పెట్టుబడులు తగ్గినట్లు తెలిపింది. ఈ త్రైమాసికంలో లాభాలు తగ్గడం వల్ల అమ్మకాల ప్రోత్సాహకాలతో సహా వేరియబుల్ పే దెబ్బతిందని తెలిపింది. సేల్స్ టీమ్ ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై కూడా ప్రభావం పడిందని చెప్పింది. 


జీతం పెరుగుదలలో ఎటువంటి మార్పు లేదని చెప్పింది. సెప్టెంబరు 1 నుంచి జీతాల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. 


Updated Date - 2022-08-18T22:52:51+05:30 IST