శ్రవణ్ షిప్పింగ్‌కు షాక్.. అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలకు సంబంధించి ఎన్‌ఓసీ రద్దు

ABN , First Publish Date - 2020-09-22T18:16:46+05:30 IST

అమ్మోనియం నైట్రేట్‌ నిల్వ, రవాణా సందర్భంగా నిబంధనలు పాటించనందుకు శ్రవణ్‌ షిప్పింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు గతంలో తమ కార్యాలయం జారీచేసిన

శ్రవణ్ షిప్పింగ్‌కు షాక్.. అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలకు సంబంధించి ఎన్‌ఓసీ రద్దు

నిబంధనలు ఉల్లంఘించారని అభియోగం

ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం: సీపీ


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): అమ్మోనియం నైట్రేట్‌ నిల్వ, రవాణా సందర్భంగా నిబంధనలు పాటించనందుకు శ్రవణ్‌ షిప్పింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు గతంలో తమ కార్యాలయం జారీచేసిన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని (ఎన్‌ఓసీ) రద్దు చేస్తున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌సిన్హా తెలిపారు. లెబనాన్‌ రాజధాని బీరూట్‌లోని పోర్టులో నిల్వ వుంచిన అమ్మోనియం నైట్రేట్‌ గోదాములో పేలుడు నేపథ్యంలో నగరంలో అమ్మోనియం నైట్రేట్‌ నిల్వ చేసే గొడౌన్లపై పోలీసులు దృష్టి సారించారు. అందులో భాగంగా చుక్కవానిపాలెంలో గల శ్రవణ్‌ షిప్పింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన గొడౌన్లను గాజువాక సీఐ, సౌత్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీలు తనిఖీ చేశారు. సదరు సంస్థ అమ్మోనియం నైట్రేట్‌ రూల్స్‌-2012 నిబంధనలను పాటించడం లేదని, పైగా తప్పుడు సమాచారంతో అనుమతులు పొందిందని తేల్చారు. 


గొడౌన్లలో బ్లాక్‌ల మధ్య నిబంధనల ప్రకారం ఖాళీ స్థలం వుంచకపోవడం, నిర్మాణ సమయంలో భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, నిల్వకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించక పోవడం, ప్రతినెలా పోలీస్‌, ఇతర శాఖలకు నివేదికలు అందజేయకపోవడం వంటి ఉల్లంఘనలపై సీపీకి నివేదిక అందజేశారు. దీనిని పరిశీలించిన సీపీ మనీష్‌కుమార్‌ సంస్థకు గతంలో జారీచేసిన ఎన్‌ఓసీని ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా చెప్పాలంటూ ఈ నెల పదిన సంస్థ ఎండీకి సీపీ నోటీసు పంపించారు. ఈ విషయాన్ని నగరంలోని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి, డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ శాఖలతోపాటు నాగపూర్‌లోని చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కార్యాలయానికి పంపించారు. అయితే కొవిడ్‌ కారణంగా పూర్తిసమాచారం అందజేసేందుకు వీల్లేకుండా పోయిందని, కొంత సమయం ఇవ్వాలంటూ సంస్థ ఎండీ సాంబశివరావు...సీపీకి సమాధానం ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని సీపీ గతంలో తమ కార్యాలయం జారీ చేసిన ఎన్‌ఓసీని రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2020-09-22T18:16:46+05:30 IST