NRI అల్లుళ్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ కేసుల్లో ఉంటే పాస్‌పోర్ట్ రద్దు..

ABN , First Publish Date - 2021-11-11T13:05:31+05:30 IST

రాష్ట్రంలో గృహహింస కేసులు ఎదుర్కొంటూ విదేశాల్లో విలాసంగా గడుపుతున్న ప్రవాసులకు షాకివ్వాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇలాంటి వారి పాస్‌పోర్టుల రద్దుకు సిఫారసు చేయాలని యోచిస్తోంది. ఇలాంటి కేసులు రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో ఉన్నా.. ఇప్పటివరకు పోలీసులు పెద్దగా పట్టించుకుంది లేదు. దీంతో.. గృహహింస కేసులు ఎదుక్కొంటూ విదేశాల్లో...

NRI అల్లుళ్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ కేసుల్లో ఉంటే పాస్‌పోర్ట్ రద్దు..

పాస్‌పోర్టుల రద్దుకు సిఫారసు చేయాలని పోలీసుల నిర్ణయం

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గృహహింస కేసులు ఎదుర్కొంటూ విదేశాల్లో విలాసంగా గడుపుతున్న ప్రవాసులకు షాకివ్వాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇలాంటి వారి పాస్‌పోర్టుల రద్దుకు సిఫారసు చేయాలని యోచిస్తోంది. ఇలాంటి కేసులు రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో ఉన్నా.. ఇప్పటివరకు పోలీసులు పెద్దగా పట్టించుకుంది లేదు. దీంతో.. గృహహింస కేసులు ఎదుక్కొంటూ విదేశాల్లో ఉంటున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. ఇలాంటి ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్ల ఆగడాలపై పోలీసుశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎక్కువ కేసులు అమెరికాలోని ప్రవాసులపై నమోదవుతుండడంతో.. యుఎస్‌ కాన్సులేట్‌తో ఇటీవలే సమావేశమై సహకారం కోరింది. ఇందుకు యుఎస్‌ కాన్సులేట్‌ కూడా అంగీకరించింది. ఈ విషయంపై సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. దీనికి షీ టీమ్స్‌ అదనపు డీజీ స్వాతి లక్రా, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య, రాష్ట్రవ్యాప్తంగా 25 మహిళా పోలీసుస్టేషన్ల ఇన్స్‌పెక్టర్లు హాజరయ్యారు. తీవ్రమైన కేసుల్లో పాస్‌పోర్టుల రద్దుకు పోలీసు శాఖ నుంచి సిఫారసు అందితే.. పరిశీలిస్తామని ఆ కార్యాలయ అధికారి బాలయ్య హామీ ఇచ్చారు. కాగా, గృహహింసతో పాటు ప్రవాసులపై నమోదైన ఇతర కేసుల్లో ఇప్పటివరకు 15 మంది పాస్‌పోర్టులు మాత్రమే రద్దు చేశారు.

Updated Date - 2021-11-11T13:05:31+05:30 IST