Abn logo
Aug 2 2021 @ 00:59AM

పోలీసుల అదుపులో బడా ‘ఎర్ర’ స్మగ్లర్లు!

మగ్లర్ల వివరాలు తెలియజేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుందరరావు

 తమిళనాడు డంప్‌లో రూ.పది కోట్ల దుంగలు స్వాధీనం 

భాకరాపేటలో టీ తాగేందుకు దిగి పోలీసు వలలో చిక్కిన స్మగ్లర్లు 

 పట్టించిన భోజనం ప్యాకెట్లు 

 మూడు పోలీసు బృందాలతో ఫలించిన వేట 


ఎర్రావారిపాళెం, ఆగస్టు 1: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించే బడా స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. తమిళనాడులోని ఎర్రచందనం డంప్‌ను భాకరాపేట సర్కిల్‌లోని మూడు పోలీసు బృందాలు చాకచక్యంగా వ్యవహరించి వారి ఆటకట్టించినట్లు సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రెండు రోజుల కిందట తలకోన అడవుల వైపు వెళ్తున్న ఓ వాహనం భాకరాపేట చెక్‌పోస్టు సమీపంలో ఆగింది. ఆ వాహనంలోని ఓ బడా ఎర్రచందనం స్మగ్లర్‌ టీ తాగేందుకు ఆగాడు. ఆ వాహన డ్రైవర్‌, స్థానికుడు గతంలో ఎర్రచందనం కేసులో నిందితుడు. దీంతో అతడిని పోలీసులు అనుమానించి వాహనాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అప్పటికే వాహనంలో ఉన్న బడా స్మగ్లర్‌ చాకచక్యంగా అక్కడ జనాల్లో కలిసి కనుమరుగయ్యాడు. వాహనాన్ని పరిశీలించగా అందులో 50 ఆహార ప్యాకెట్లు ఉన్నాయి. స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ను విచారించారు. అతడిచ్చిన సమాచారం మేరకు చిత్తూరు -తమిళనాడు సరిహద్దు సమీపం.. తమిళనాడు భూ భాగంలో ఉన్న ఓ ఎర్రచందనం డంప్‌ వివరాలను తెలియజేశాడు. ఎర్రావారిపాళెం, భాకరాపేట, రొంపిచెర్ల ఎస్‌ఐలు వెంకటమోహన్‌, శ్వేత, హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలను పీలేరు రూరల్‌ సీఐ మురళీకృష్ణ ఏర్పాటు చేసి బడా స్మగ్లర్లు పట్టుకునేందుకు రంగంలోకి దింపారు. జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆదేశాల మేరకు తమిళనాడు రాష్ట్రంలోని డంప్‌లో పోలీసులు దాడులు చేశారు. డంప్‌ వద్ద వాచ్‌మెన్‌, ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని అక్కడ పరిశీలించగా సుమారు 13 టన్నులున్న 324 ఎర్రచందనం దుంగలు పట్టుబడినట్లు సమాచారం. దీనివిలువ రూ.పది కోట్లు ఉండొచ్చని అంచనా. 


ఆరుగురు ‘ఎర్ర’ దొంగల అరెస్టు ... రూ.80లక్షల విలువైన 14 దుంగల స్వాధీనం

 శేషాచలం అడవుల్లో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.80లక్షల విలువైన 14 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఆదివారం టాస్క్‌ఫోర్సు ఎస్పీ సుందరరావు మీడియాకు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో ఆర్‌ఎ్‌సఐలు లింగాధర్‌, సురే్‌షబాబు, ఎఫ్‌బీవో కోదండన్‌ బృందం శ్రీవారి మెట్టు రోడ్డు నుంచి చీకటీగలకోన, సచ్చినోడిబండ, చామలరేంజ్‌ నాగపట్లబీట్‌ వరకు శనివారం కూంబింగ్‌ నిర్వహించారు. ఈతగుంట ప్రాంతంలో దుంగలు మోసుకొస్తున్న కొందరు స్మగ్లర్లు.. పోలీసులను చూసి పరారయ్యారు. వీరిని ఆరుగురిని పట్టుకున్నారు. 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారు తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా చెందిన అర్జున్‌, ప్రకాష్‌, దక్షణామూర్తి, అచ్యుతన్‌తోపాటు మరో ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. ఎస్పీ సుందరరావు, సీఐలు వెంకటరవి, సుబ్రహ్మణ్యం, ఎఫ్‌ఆర్వోలు ప్రసాద్‌, ప్రేమ, ఆర్‌ఎ్‌సఐ విశ్వనాథ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మైనర్లను జువైనల్‌ హోంకు తరలించారు. మిగిలిన నలుగురిని విచారించగా.. తాము 16మంది ఆరు రోజుల కిందటే అడవిలోకి ప్రవేశించినట్లు చెప్పారు. పరారీలోని పది మంది కోసం గాలిస్తున్నారు. స్మగ్లర్లను సాహసోపేతంగా పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ, రివార్డులు ప్రకటించారు. ఎస్‌ఐ మోహన్‌నాయక్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.