చిన్న పట్టణాలకు పెద్ద ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-09-01T06:26:58+05:30 IST

ఒకవస్తువును గ్రామసీమల్లో ఉత్పత్తి చేయాలా లేక నగరాల్లో ఉత్పత్తి చేయాలా అన్న విషయాన్ని రవాణా సాంకేతికత నిర్ణయిస్తుంది. ఇదొక కఠిన వాస్తవం...

చిన్న పట్టణాలకు పెద్ద ప్రాధాన్యం

అభివృద్ధి సాధనలో గ్రామీణ -నగర ప్రాంతాల మధ్య సమన్వయానికి చిన్న పట్టణాలను పునరుజ్జీవింప చేయాలి. వర్తమాన ఆర్థిక వ్యవస్థలలో సేవల రంగానికి మౌలిక ప్రాధాన్యమున్నదనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌లేషన్స్, ఆన్‌లైన్ ట్యూటోరియల్స్, మ్యూజిక్, కాల్ సెంటర్స్ మొదలైన నవీన సేవల సరఫరా కేంద్రాలుగా చిన్న పట్టణాలను అభివృద్ధి పరచాలి. పర్యావరణాన్ని కాలుష్యరహితంగా కాపాడుకోవడం చిన్న పట్టణాలలోనే మరింత సులువుగా సాధ్యమవుతుంది.


ఒకవస్తువును గ్రామసీమల్లో ఉత్పత్తి చేయాలా లేక నగరాల్లో ఉత్పత్తి చేయాలా అన్న విషయాన్ని రవాణా సాంకేతికత నిర్ణయిస్తుంది. ఇదొక కఠిన వాస్తవం. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని విశదం చేస్తాను. ఒక గ్రామ ప్రజల వినియోగానికి ఉద్దేశించిన బియ్యాన్ని ఆ గ్రామంలోని రైస్ మిల్లులో ధాన్యాన్ని మరపట్టడం ద్వారా సమకూర్చుకుంటారు. నగర ప్రజల వినియోగానికి అవసరమైన బియ్యాన్ని, సదరు నగరానికి సమీపంలోని పెద్ద రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని మరపట్టడం ద్వారా సమకూర్చు్తారు. ఈ ధాన్యాన్ని గ్రామం నుంచి నగరానికి రవాణా చేస్తారు. ఆ ధాన్యాన్ని గ్రామంలోనే మరపట్టి, బియ్యాన్ని నగరానికి రవాణా చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా ధాన్యాన్ని నగరానికి రవాణా చేసి, నగరంలోని మరపట్టి, బియ్యాన్ని నగర ప్రజలకు సరఫరా చేయవచ్చు. ఈ రెండిటిలో మొదటిది, అంటే – గ్రామంలోనే ఆ ధాన్యాన్ని మరపట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే గ్రామంలోని మినీ రైస్ మిల్లుకు గ్రామస్తుల బియ్యం అవసరాలను తీర్చగల సామర్థ్యం మాత్రమే– ఉంటుంది. ఒక చిన్న రైస్‌మిల్లులో ధాన్యాన్ని మరపట్టడానికి చాలా వ్యయమవుతుంది. అంతేగాక బియ్యం నాణ్యత సాపేక్షంగా తక్కువ స్థాయిలో ఉంటుంది . పైగా ఉప ఉత్పత్తి అయిన ఊకను నష్టపోవలసి వస్తుంది. ఈ కారణంగా ధాన్యాన్ని గ్రామాల్లో మరపట్టడమనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. వ్యాపారస్థులు సహజంగానే గ్రామం నుంచి నగరంలోని పెద్ద రైసుమిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసి అక్కడ మరపట్టడానికి ప్రాధాన్యమిస్తున్నారు. 


పంచదార ఫ్యాక్టరీల విషయం బియ్యం మిల్లులకు భిన్నమైనది. చక్కెర మిల్లులను సర్వదా పల్లె సీమల్లోనే ఏర్పాటు చేయడం పరిపాటి. కారణమేమిటి? 1 కిలో పంచదారను ఉత్పత్తి చేసేందుకు 10 కిలోల చెరకుగడలు అవసరమవుతాయి. మరి పది కిలోల చెరకుగడలను గ్రామంలోనే ఉన్న లేదా గ్రామ పరిసరాలలో ఉన్న ఫ్యాక్టరీకి రవాణా చేసేందుకు అయ్యే వ్యయం స్వల్ప స్థాయిలో మాత్రమే ఉంటుంది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసిన చక్కెరను సుదూరంలో ఉన్న నగరానికి రవాణా చేస్తారు. గమనించాల్సిన విషయమేమిటంటే పది కిలోల చెరకుగడలను చాలా దూరంలో ఉన్న ఒక పట్టణ ప్రాంతపు చక్కెర ఫ్యాక్టరీకి రవాణా చేసి, అక్కడ ఉత్పత్తి చేసిన పంచదారను సమీపంలో ఉన్న నగరానికి రవాణా చేసేందుకు అయ్యే వ్యయం చాలా అధికంగా ఉంటుంది. అదే పంచదార ఫ్యాక్టరీ గ్రామీణ ప్రాంతంలో ఉంటే చెరకుగడల, చక్కెర రవాణాకు అయ్యే మొత్తం ఖర్చు తక్కువగా ఉంటుంది. ఉత్పత్తి వ్యయాలలోని ఈ వ్యత్యాసం వల్లే బియ్యం మిల్లులను నగరాలలోనూ, చక్కెర ఫ్యాక్టరీలను పల్లెల్లోనూ నెలకొల్పడం ఒక ఆనవాయితీ అయింది. ఈ కారణంగానే అధిక బరువుతో ఉంటే వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను గ్రామాలలో ఏర్పాటు చేయడం జరగడం లేదు. ఈ విధంగా నవీన రవాణా సాధనాలు పల్లె సీమల అభివృద్ధి అవకాశాలను దెబ్బ తీశాయి. 


పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను వ్యవసాయరంగ మిగులు ఆదాయం నుంచి మాత్రమే తీసుకోవాలని స్వాతంత్ర్యానికి పూర్వం పలువురు నాయకులు గట్టిగా భావించారు. 1940 వ దశకంలో నే పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో రూపొందిన ‘బాంబే ప్లాన్’ సమాలోచనలలో వారీ విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. ఈ ప్రకారం పారిశ్రామికాభివృద్ధి సాధనకు మనకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఆ రెండిటిలో ఒక దాన్ని మనం ఎంచుకోవలసి ఉంది. ఒకటి- వ్యవసాయరంగంలో మనకు సమకూరిన మిగులు ఆదాయాన్ని పారిశ్రామిక రంగంలో మదుపు చేసి, తద్వారా విదేశీ పెట్టుబడులపై ఆధారపడవలసిన అనివార్యతను తప్పించుకోవడం; రెండు- గ్రామీణాభివృద్ధికి తొలి ప్రాధాన్యమిచ్చి మన ఆర్థిక సార్వభౌమత్వాన్ని ప్రపంచ పెట్టుబడి శక్తులకు వదులుకోవడం. 


ఇదొక విషమ సమస్య. దీనికి పరిష్కారంగా మనం ఒక మధ్యే మార్గాన్ని అనుసరించవలసి ఉంటుంది. అభివృద్ధి సాధనలో గ్రామీణ -నగర ప్రాంతాల మధ్య సమన్వయానికి చిన్న పట్టణాలను పునరుజ్జీవింప చేయాలి. అభివృద్ధి కార్యకలాపాలను పూర్తిగా నగరాలలోనే కేంద్రీకరించడం శ్రేయస్కరం కాదు. చిన్న పట్టణాలలో విద్యుత్తు, పైప్‌ల ద్వారా నీటి సరఫరా, బస్ మార్గాలు మొదలైన సేవలను సమృద్ధంగా సమకూర్చేందుకు అయ్యే వ్యయం నగరాలలో ఆ సేవల సరఫరాకు అయ్యే వ్యయం కంటే నామమాత్రంగానే అధికం. అంతేకాదు, ఆ సేవలను అందించేందుకు అయ్యే వ్యయం గ్రామాలలో కంటే చిన్న పట్టణాలలోనే తక్కువ! రెండు దశాబ్దాల క్రితం రాజస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని దస్తావేజులను నేను పరిశీలించడం జరిగింది. గ్రామాలలో పైప్‌ల ద్వారా నీటి సరఫరాకు అవుతున్న వ్యయం అదే సేవకు నగరాలలో అవుతున్న వ్యయం కంటే పది రెట్లు ఎక్కువ! బహుశా, చిన్న పట్టణాలలో పైప్‌ల ద్వారా నీటి సరఫరాకు అయ్యే వ్యయం నగరాలలో అయ్యే ఖర్చుకు కేవలం రెండింతలు మాత్రమే ఉంటుంది. 


వర్తమాన ఆర్థిక వ్యవస్థలలో సేవల రంగానికి మౌలిక ప్రాధాన్యమున్నదనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ట్రాన్స్ లేషన్స్, ఆన్ లైన్ ట్యూటోరియల్స్, మ్యూజిక్, కాల్ సెంటర్స్ మొదలైన సేవల సరఫరా కేంద్రాలుగా చిన్న పట్టణాలను అభివృద్ధి పరచాలి. పర్యావరణాన్ని కాలుష్యరహితంగా కాపాడుకోవడం చిన్న పట్టణాలలోనే మరింత సులువుగా సాధ్యమవుతుంది. ప్రజల మధ్య మానవీయ, పరస్పర ప్రభావశీల సంబంధాలకూ చిన్న పట్టణాలలోనే ఎంతైనా ఆస్కారమున్నది. పట్టణ వాసులకు, వీధి చివర కూరగాయల అమ్మే వ్యక్తులు సుపరిచితులయి ఉంటారు. మానవ సంబంధాలలో మానవీయ వాతావరణం ఉన్నందునే అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పుడు నగరవాసులు అనేక మంది శివారు పట్టణాలలో స్థిరపడడం జరుగుతోంది.


ఆర్థికాభివృద్ధి సాధనలో వ్యవసాయరంగం ప్రాధాన్యం తగ్గిపోతోంది. అయినప్పటికీ నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఇటలీ మొదలైన దేశాలు ఉత్పత్తి చేస్తున్న నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలలో కీలకపాత్ర వహిస్తున్నాయి. నెదర్లాండ్స్ తులిప్ పూవులు, ఫ్రాన్స్ ద్రాక్ష పండ్లు, ఇటలీ ఆలివ్ లకు అంతర్జాతీయ మార్కెట్ పుష్కలంగా ఉన్నది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళలో సుగంధ ద్రవ్యాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆపిల్ పండ్లు మొదలైన వ్యవసాయక ఉత్పత్తులపై సమగ్ర పరిశోధన చేపట్టాలి. చిన్న పట్టణాల, గ్రామాల పునరుజ్జీవానికి ఇది ఎంతైనా అవసరం. ఉత్తరప్రదేశ్ లోని చిన్న పట్టణం చత్మాల్‌ఫూర్ కూరగాయల సరఫరా కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. సమీప గ్రామాల నుంచి ఆ వ్యవసాయక ఉత్పత్తులను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు సరఫరా చేయడంలో చత్మాల్‌పూర్ వ్యాపారులు విశేష శ్రద్ధ చూపి విశేష లబ్ధి పొందుతున్నారు. వ్యవసాయక ఉత్పత్తులనే గాక వివిధ అధునాతన సేవల సరఫరా కేంద్రాలుగా చిన్న పట్టణాలను అభివృద్ధిపరచడం వల్ల దేశ సర్వతోముఖాభివృద్ధికి విశేష దోహదం జరుగుతుందనడంలో సందేహం లేదు.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త,బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-09-01T06:26:58+05:30 IST