TRS : గులాబీ పార్టీలో ‘గుబులు’.. నల్లేరుపై నడకేనని అనుకున్నా.. అనూహ్యంగా ఇలా జరిగిందేంటి..!

ABN , First Publish Date - 2021-11-19T12:24:21+05:30 IST

TRS : గులాబీ పార్టీలో ‘గుబులు’.. నల్లేరుపై నడకేనని అనుకున్నా.. అనూహ్యంగా ఇలా జరిగిందేంటి..!

TRS : గులాబీ పార్టీలో ‘గుబులు’.. నల్లేరుపై నడకేనని అనుకున్నా.. అనూహ్యంగా ఇలా జరిగిందేంటి..!

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి పంచాయతీరాజ్‌ సంఘం ‘సై’
  • సంఘం తరుఫున బరిలో  ‘చింపుల’ 
  • ఒక ఓటు ‘చింపుల’ కే వేయాలని నిర్ణయం 
  • సమావేశానికి టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు హాజరు
  • ప్రతిపక్షాల మద్దతు కోరుతున్నట్లు సంఘం ప్రకటన

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను ఏకపక్షంగా కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో గుబులు మొదలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 80శాతానికి పైగా ఓటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే ఉండడంతో ఆ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా పంచాయతీరాజ్‌ చాంబర్‌ తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఎన్నికల్లో తమ అభ్యర్థులను రంగంలో దింపుతున్నట్లు ప్రకటించింది.


హైదరాబాద్ సిటీ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల సమావేఽశం గురువారం లక్డీకాపూల్‌లోని పంచాయతీరాజ్‌ చాంబర్‌లో నిర్వహించారు. సమావేశంలో సభ్యులంతా రంగారెడ్డి జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డిని బరిలో దింపేందుకు నిర్ణయించారు. సమావేశానికి అన్ని పార్టీల వారు హాజరయ్యారు. ఇందులో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అధికంగా ఉండడం గమనార్హం. తమ ఆత్మాభిమానం కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు విలువ లేకుండా పోయిందని నామమాత్రంగానే ప్రభుత్వం పరిగణిస్తోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి రూ.540 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, వీటిని వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం నుంచి ఇంత వరకు స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తూ ఎన్నికల్లో తమ అభ్యర్థిని రంగంలో దింపుతునట్లు సంఘ సభ్యులు ప్రకటించారు.


ఇదిలా ఉంటే ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో మొత్తం 1,179 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 80శాతానికిపైగా ఓటర్లు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే ఉన్నారు. పంచాయతీరాజ్‌ చాంబర్‌ తరుఫున పోటీ చేస్తున్న చింపుల సత్యనారాయణరెడ్డికి బీజేపీ, కాంగ్రెస్‌ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంఘ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి మద్దతు కోరారు. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని కూడా మద్దతు కోరారు. ఈ రెండు పార్టీలకు కూడా ఇక్కడ గెలిచే అవకాశాలు లేకపోవడంతో చాంబర్‌ తరుఫున బరిలో దిగుతున్న చింపుల సత్యనారాయణరెడ్డికి మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల ముఖ్యనేతలు కూడా ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.


ఒక ఓటు చింపులకే

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఓటు తమ సంఘం తరుఫున పోటీ చేస్తున అభ్యర్థికే వేస్తామని మరో ఓటు తమ తమ పార్టీ తరుఫు అభ్యర్ధులకు వేస్తామని సమావేశంలో పాల్గొన్న సభ్యులు ప్రకటించారు. లక్డీకాపూల్‌లోని పంచాయతీరాజ్‌ చాంబర్‌లో గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీటీసీలు, ఎంపీటీసీల సంఘ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి, రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ, వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు జి.తిరుపతయ్య, మేడ్చల్‌ అధ్యక్షురాలు పి. అనిత, జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు నిర్మల, యాలాల్‌ ఎంపీపీ బాలేశం గుప్తా తదితరులు పాల్గొన్నారు. 


అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సంఘం తరుఫున చింపుల సత్యనారాయణరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. సమావేశానికి కొంత మందే హాజరైనప్పటికీ సమావేశానికి రాలేకపోయిన మిగతా వారి  అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. పార్టీలకతీతంగా సంఘంలోని సభ్యులంతా కలిసి  చింపులకు మద్దుతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు సత్యనారయణరెడ్డినే రంగంలో దింపుతున్నామని, ఒక ఓటు చింపుల సత్యనారాయణకు వేస్తామని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్‌ కూడా తమకే మద్దతు ఇస్తాయని వారు ధీమా వ్యక్తం చేశారు. 


దీంతో ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నిక కొంత రసకందాయకంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక విధంగా అధికార టీఆర్‌ఎ్‌సకు ఇది ఊహించని పరిణామమనే చెప్పాలి. ఒక ఓటు సంఘం తరుఫున బరిలో దిగే అభ్యర్థికి వేయాలని పార్టీలకతీతంగా సభ్యలంతా కలిసి తీర్మానించడంతో ప్రాధాన్యత ఓట్లు చీలే అవకాశం ఉంది. సంఘంలో టీఆర్‌ఎస్‌ సభ్యులే అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే జరిగితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో ఒకరికి నష్టం జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2021-11-19T12:24:21+05:30 IST