Oct 22 2021 @ 20:21PM

ఓటీటీలోనూ దీపావళి పోటీ..!?

కోలీవుడ్: సాధారణంగా దీపావళి, సంక్రాంతి అంటేనే కొత్త సినిమాల పండుగ. తమ చిత్రాలను దీపావళి, సంక్రాంతి పండుగలకు విడుదల చేయాలని ప్రతి హీరో, దర్శకనిర్మాతలు భావిస్తుంటారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది. అనేక కొత్త చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఈ పోటీ గత యేడాది దీపావళి నుంచి అధికమైంది. గత దీపావళికి  హీరో సూర్య నటించిన ‘సూరరైపోట్రు’, నయనతార నటించిన ‘మూక్కుత్తి అమ్మన్‌’ చిత్రాలు ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలాగే, వచ్చే నెలలో రానున్న దీపావళి పండుగకు కూడా కొత్త చిత్రాల మధ్య ఓటీటీలో పోటీ నెలకొంది. 

అయితే, ఈ దఫా కూడా హీరో సూర్య నటించిన ‘జై భీమ్‌’ చిత్రం ఓటీటీలో విడుదలవుతోంది. అలాగే, సీనియర్‌ నటులు శశికుమార్‌, సత్యరాజ్‌లు తండ్రీకొడుకులుగా నటించిన ‘ఎంజీఆర్‌ మగన్‌’ చిత్రం కూడా విడుదల కానుంది. ఇవికాకుండా, మరికొన్ని చిత్రాలు ఓటీటీలో విడుదల చేసేలా ఆయా చిత్ర నిర్మాతలు ప్లాన్‌ చేశారు. అదేసమయంలో దీపావళి పండుగ రోజైన నవంబరు 4వ తేదీన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘అన్నాత్త’, హీరోలు విశాల్‌ - ఆర్యలు నటించిన ‘ఎనిమి’ చిత్రాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. హీరో శింబు నటించిన ‘మానాడు’ చిత్రం దీపావళి రేస్‌ నుంచి తప్పుకుని నవంబరు నెలకు వాయిదాపడింది.