చిన్న పరిశ్రమకు పెద్ద కష్టం..!

ABN , First Publish Date - 2022-06-27T08:33:04+05:30 IST

బాలానగర్‌లో వెల్డింగ్‌ పరిశ్రమను నడిపిస్తూ.. ముగ్గురికి ఉపాధి కల్పించే రామకృష్ణ కొవిడ్‌ సమయంలో తీవ్ర నష్టాల పాలయ్యారు...

చిన్న పరిశ్రమకు పెద్ద కష్టం..!

నేడు ఎంఎస్‌ఎంఈ దినోత్సవం

తీవ్ర నష్టాల్లో ఎంఎస్‌ఎంఈలు

ఏడాదిలోనే 5 వేలకుపైగా మూత

అలంకారప్రాయంగా టీఎస్‌ఐహెచ్‌సీ

పెండింగ్‌లో రూ.3వేల కోట్ల రాయితీలు

నాలుగేళ్లుగా పైసా విదల్చని రాష్ట్ర ప్రభుత్వం

కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా దక్కని ఫలితం

‘కాకతీయ టెక్స్‌టైల్‌’లో క్లస్టర్‌.. కలేనా?

కేంద్రం 10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా రుణాలిచ్చేందుకు నిరాకరిస్తున్న బ్యాంకులు


హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): బాలానగర్‌లో వెల్డింగ్‌ పరిశ్రమను నడిపిస్తూ.. ముగ్గురికి ఉపాధి కల్పించే రామకృష్ణ కొవిడ్‌ సమయంలో తీవ్ర నష్టాల పాలయ్యారు. వ్యాపారం లేకపోయినా అద్దె, కరెంటు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో అప్పుల పాలయ్యారు. అప్పటికే ఉన్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో ఆయన పరిశ్రమను బ్యాంకు ఎన్‌పీఎగా ప్రకటించింది. గతంలో ముగ్గురికి ఉపాధి కల్పించిన రామకృష్ణ.. ఇప్పుడు తన ఉపాధి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఇది ఆయన సమస్యే కాదు.. రాష్ట్రంలోని వేలాది సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల యజమానులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించకపోగా.. నాలుగైదేళ్లుగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలనూ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనా సమయంలో ఎంఎ్‌సఎంఈల కోసం కేంద్రం రూ.10,000 కోట్ల ప్యాకేజీ పకటించినా.. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడం చిన్న పరిశ్రమకు పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. శనివారం (జూన్‌ 27న) ఎంఎ్‌సఎంఈ డే జరుపుకొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని సూక్ష్మ, మధ్య పరిశ్రమల పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో వ్యవసాయం, నిర్మాణ రంగాల తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) రంగమే. పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 26.05 లక్షల ఎంఎ్‌సఎంఈలు ఉండగా.. ఇందులో 25.94 లక్షలు సూక్ష్మ తరహా పరిశ్రమలే. వీటి  ద్వారా 40.16 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఆర్థికాభివృద్ధితో పాటు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపింది. 2020లో కొన్ని నెలలపాటు లాక్‌డౌన్‌ కొనసాగడంతో వ్యాపారం లేకపోయినా అద్దెలు, ఇతర ఖర్చులను భరించాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత పరిస్థితులు సర్దుకుంటున్న తరుణంలో మళ్లీ రెండో విడత కొవిడ్‌తో తీవ్రంగా దెబ్బతీసింది. తమను ఆదుకోవాలని ఎంఎ్‌సఎంఈలు అనేక మార్లు విజ్ఞప్తులు చేసినా.. ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. ఒకవైపు నష్టాలు పెరగడం, రుణాలు చెల్లించాలని బ్యాంకుల ఒత్తిళ్లు పెరగడంతో.. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి.


టీఎస్‍ఐహెచ్‌సీ ఏర్పాటు చేసినా..

పరిశ్రమల స్థాపనకు తీసుకున్న రుణాల వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 90 రోజులపాటు రుణం చెల్లించకుంటే ఆ పరిశ్రమను బ్యాంకు ఎన్‌పీఏ (నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్స్‌)గా ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించాక మొత్తం రుణాన్ని గరిష్ఠంగా 30 రోజుల్లో చెల్లించాలి. విఫలమైన పరిశ్రమలకు బ్యాంకు తాళం వేస్తుంది. ఆదుకుంటామన్న ప్రకటనలు తప్ప.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేకపోవడంతో గత ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 5వేలకు పైగా ఎంఎ్‌సఎంఈలు మూతపడ్డాయి. తీవ్ర నష్టాల్లో ఉండి మూతపడేందుకు సిద్ధంగా ఉన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం తెలంగాణ స్టేట్‌ ఇండస్ర్టియల్‌ హెల్త్‌ క్లినిక్‌ (టీఎ్‌సఐహెచ్‌సీ)ను ప్రారంభించింది. కష్టకాలంలో ఉన్న పరిశ్రమలను గుర్తించి సహకరించాల్సిన సంస్థ.. అలంకారప్రాయంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత ఆశయంతో దీనిని ఏర్పాటుచేసినా.. నిధులు కేటాయించకపోవడంతో పరిశ్రమలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. తమను ఆదుకోవాలంటూ అనేక పరిశ్రమలు ఈ సంస్థను సంప్రదిస్తున్నా.. ప్రయోజనం ఉండడం లేదు. అంతేకాదు.. ఎంఎ్‌సఎంఈలకు నాలుగేళ్లుగా చెల్లించాల్సిన రూ.3వేల కోట్లకుపైగా రాయితీలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ నెల 6వ తేదీన ఇండస్ట్రియల్‌ వార్షిక నివేదిక విడుదల సందర్భంగా ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌ను పరిశ్రమల యజమానులు నిలదీశారు. తమకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు. కానీ, ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇదిలా ఉండగా, కరోనా సమయంలో ఎంఎ్‌సఎంఈల కోసం రూ.10,000 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు కేంద్రం ఘనంగా ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని తెలిపింది. కానీ, క్షేత్రస్థాయిలో ఈ ప్యాకేజీ అమలుకు నోచుకోవడం లేదు. ఎంఎ్‌సఎంఈలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి.


మాటలకే పరిమితమైన ప్రభుత్వం

తమను ఆదుకోవాలని ఎంఎ్‌సఎంఈలు రెండేళ్లుగా కోరుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం హామీలకే పరిమితం అవుతోంది. పాఠశాలలకు సామగ్రి సరఫరాలో స్థానికంగా ఉండే ఎంఎ్‌సఎంఈలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. కానీ, ‘మన ఊరు- మన బడి’ పథకం కింద సుమారు రూ.3500 కోట్ల మేర టెండర్లు పిలిచిన ప్రభుత్వం.. కార్పొరేట్‌ సంస్థలకు అనుగుణంగా నిబంధనలు రూపొందించింది. దీనిపై కొందరు పరిశ్రమల యజమానులు కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో టెండర్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని ఎంఎ్‌సఎంఈలకు మార్గదర్శనం చేసేందుకు ప్రత్యేక కేంద్రాన్ని (మెంటార్‌షిప్‌ సెంటర్‌) ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ గత ఏడాది ఆఖరులో ప్రకటించారు. అయితే, ఏడు నెలలు దాటినా ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూ.వెయ్యి కోట్లతో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో ఎంఎ్‌సఎంఈ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని మూడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. 500 చిన్నతరహా పరిశ్రమలకు స్థలం కేటాయిస్తామని చెప్పినా.. అతీగతీ లేదు. ఉన్న పరిశ్రమలు మూతబడుతుంటే స్పందించని ప్రభుత్వం.. కొత్త పరిశ్రమల కోసం భారీరాయితీలు ప్రకటిస్తోందని ఎంఎ్‌సఎంఈల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌ విమర్శించారు. ఆర్థిక నష్టాలతో ఇప్పటికే వందలాది పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. ఇప్పటికైనా నష్టాల్లో ఉన్న ఎంఎ్‌సఎంఈలను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-27T08:33:04+05:30 IST