భారీగా కోత

ABN , First Publish Date - 2022-06-26T07:07:42+05:30 IST

జిల్లాలో అమ్మఒడి పథకం లబ్ధిదారులకు జగన్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. గతేడాది ఖాతాలో డబ్బులు జమచేయకుండా తప్పించుకున్న సర్కార్‌ ఈసారి అర్హులను అడ్డంగా కోసేసింది.

భారీగా కోత
తాడికోన మండల పరిషత్‌ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు (ఫైల్‌ ఫొటో)

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మఒడి పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక ఎట్టకేలకు పూర్తయింది. సవాలక్ష నిబంధనలను ఛేదించుకుని ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడికి అతికష్టంపై లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఇప్పటివరకు నిబంధనల సుడిలో లబ్ధిదారుల కుటుంబాలు విలవిల్లాడిపోయాయి. రోజుకో విధంగా నిబంధనలు పెడుతుండడంతో గందగోళ పరిస్థితి ఏర్పడింది. జిల్లాల వ్యాప్తంగా అమ్మఒడికి అర్హత సాధించిన లబ్ధిదారుల జాబితాలను శనివారం రాత్రి విడుదల చేశారు. దీనిలో భాగంగా కోనసీమ జిల్లా పరిధిలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 1,23,709 మంది, ఇంటర్మీడియట్‌కు చెందిన విద్యార్థులు 21,754 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 1,45,463 మంది విద్యార్థులు మాత్రమే అమ్మఒడి పథకానికి అర్హత సాధించారు. వీరికి ఈనెల 27న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతుల   మీదుగా నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వం అనుసరించి  విధానాలతో లబ్ధిదారుల ఎంపికలో వేలాది మందిపై అనర్హత వేటు పడింది.  

అమ్మఒడి అర్హుల జాబితాల్లో వేలల్లో పేర్లు గల్లంతు

ఇదేం అన్యాయమంటూ విద్యార్థుల తల్లిదండ్రుల గగ్గోలు

 జిల్లాలో 1,45,463 విద్యార్థులు మాత్రమే ఎంపిక

 ఆంక్షల సుడిలో అమ్మఒడికి తల్లులెందరో దూరం

అదే ఇల్లు.. అవే కరెంటు బిల్లు.. అయినా అనర్హత వేటు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అమ్మఒడి పథకం లబ్ధిదారులకు జగన్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. గతేడాది ఖాతాలో డబ్బులు జమచేయకుండా తప్పించుకున్న సర్కార్‌ ఈసారి అర్హులను అడ్డంగా కోసేసింది. చిన్న చిన్న కారణాలను చూపించి లబ్ధి నుంచి మినహాయించింది. దీంతో లక్షలాది మంది తల్లులు ప్రభు త్వం నుంచి అందే అమ్మఒడి సాయానికి దూరమయ్యారు. ఈ ఏడాది అమలవుతున్న విద్యా సంవ త్సరానికి సంబంధించి జూన్‌ 27న అమ్మఒడి పథకాన్ని వర్తింపచేయనున్న దృష్ట్యా అర్హుల జాబితా ప్రకటించారు. కానీ సవాలక్ష ఆంక్షలు విధించడంతో వేలాది మంది అర్హత కోల్పోయి అమ్మఒడికి దూరమయ్యారు. విద్యార్థుల హాజరు నుంచి వారి కుటుంబ సభ్యులకు చెందిన విద్యుత్‌ వినియోగం వరకు అన్నిటిపైనా విధించిన ఆంక్షల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు తప్పనిసరిగా విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు కచ్చితంగా ఉండాలన్నది ఒక నిబంధన. హాజరు తగ్గితే ఆ విద్యార్థికి అమ్మఒడి బంద్‌. అదేవిధంగా కుటుంబానికి సంబంధించి విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటినా పథకం కట్‌. విద్యుత్‌ మీటర్లకు ఆఽధార్‌ను అనుసంధానం చేయడం వల్ల ఆ కుటుంబ యజమాని పేరిట ఎన్ని విద్యుత్‌ సర్వీసులైతే ఉన్నాయో ఆ మొత్తం బిల్లులు కలిపినా 300 యూనిట్ల మించి విద్యుత్‌ వాడకం ఉండ కూడదు. ఆ యజమాని పేరిట ఎక్కడ మీటర్లు ఉన్నా ఆ యూనిట్లను కోట్‌ చేయడం వల్ల ఎక్కువ మంది పథకానికి అనర్హులయ్యారు. అలాగే పట్టణంలో వెయ్యి చదరపు అడుగులు స్థలంలో ఇల్లు ఉన్నా అనర్హులే. ఇక విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాను ఆధార్‌కు లింక్‌ చేయించుకోవాల్సిందే. ఈ విధానం అక్కౌంటు కలిగిన ఆయా బ్యాంకుల్లో మాత్రమే ఆధార్‌ను లింక్‌ చేయించుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ లింక్‌ జరగదు. బ్యాంకు ఖాతాకు ఫోన్‌ నంబరు లింక్‌చేయించుకుంటే సమాచారం నేరుగా చేరుతుంది కాబట్టి లబ్ధిదారులు బ్యాంకు ఖాతాతో ఫోన్‌ నంబరు లింక్‌ చేయిం చుకోవచ్చు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ వివరాలు ఖచ్చితంగా సరిచూసుకోవాలి. లబ్ధిదారుడైన విద్యార్థి, ఆమె తల్లి ఇద్దరూ ఒకే మ్యాపింగ్‌లో వారి వ్యక్తిగత వివరాలతో నమోదై ఉన్న విద్యార్థులను అర్హు లుగా పరిగణించారు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ వివరాలు లేకపోతే ఈకేవైసీ చేయించుకోవాలని అధి కారులు సూచిస్తున్నారు. ఇక విద్యార్థి అమ్మఒడి పథకం పొందాలంటే 75 హాజరు, రైస్‌కార్డు, కుటుంబం మెట్టభూమి పది ఎకరాలలోపు ఉండాలి. మాగాణి అయితే ఐదెకరాలలోపు ఉండాలి. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ కట్టరాదు. విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు మించరాదు. పట్టణ ప్రాంతంలో వెయ్యి ఎస్‌ఎఫ్‌టీ మించి నివాసం ఉండకూడదు అనే నిబంధనతోపాటు ఫోర్స్‌ వీలర్స్‌ వాహనం కలిగి ఉండకూడదు వంటి అనేక నిబంధనలు అమలులోకి తీసుకురావడంతో ఈ ఏడాది అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత పడింది. అయితే గత రెండేళ్లుగా అవే ఇళ్లు, అదే విద్యుత్‌ బిల్లు, అవే నిబంధనలు లబ్ధిదారులకు వర్తించినప్పటికీ ఇప్పుడు కొత్తగా ఆ నిబంధనల అమలు పేరిట అర్హులను అనర్హులుగా ప్రభుత్వం ప్రకటిస్తున్న తీరు వారిలో తీవ్ర ఆవేదన, ఆందో ళనకు గురి చేస్తోంది. గత రెండేళ్లుగా అర్హులైన తాము ఇప్పుడు ఎందుకు కాలేదో చెప్పాలంటూ సచివాలయ ఉద్యోగులపై ఎదురు దాడికి దిగుతున్నారు. ప్రభుత్వం అమ్మఒడి పథకం విడుదల చేసిన తరువాత లబ్ధిదారుల్లో మరింత ఆగ్రహావేశాలు పెల్లుబికే అవకాశాలు ఉన్నాయి. 

కొత్త జిల్లాల తికమకల మధ్య అంకెల గారడీ..

అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో పది హేను వేలు జమ చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ తీరా సీఎం అయ్యాక పథకం అమల్లో అడుగడుగునా మాట తప్పుతూ వస్తున్నారు. ఏదొక నిబంధన పేరుతో లబ్ధిదారులను క్రమక్రమంగా ఏరిపారేస్తున్నారు. గతేడాది ఏకంగా పథకమే అమలు చేయలేదు. అంతకు ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019-2020లో 6,85,748 మంది విద్యార్థులు పథకానికి అర్హులుగా తేలితే 4,57,222 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.685 కోట్లు జమ చేశారు. ఆ తర్వాత 2020-2021లో 7,47,596 మంది అర్హులకు 4,83,622 మందికి రూ.725 కోట్లు ఖాతాలో డబ్బులు వేశారు. గతేడాది ఏకంగా కొవిడ్‌ కారణంతో బోధన జరగలేదనే సాకుతో పథకాన్ని అటకెక్కించి ఈ ఏడాది జమ చేస్తున్నారు. అయితే మొన్న ఏప్రిల్‌లో జిల్లాల విభజన జరగడంతో జిల్లాల వారీగా లెక్కలు ప్రకటించారు. కొత్తల జిల్లాల స్వరూపంలో ఏజెన్సీ అల్లూరి జిల్లాకు వెళ్లినా అక్కడ విద్యార్థుల సంఖ్య స్పల్వం. కానీ కొత్త తూర్పుగోదావరి జిల్లాలోకి పూర్వపు పశ్చిమగోదావరి నుంచి రెండు మున్సిపాలిటీలతో కూడిన తొమ్మిది మండలాలు వచ్చి చేరాయి. అంటే ప్రస్తుత మూడు జిల్లాల వారీగా చూస్తే భారీగా పెరగాల్సిన లబ్ధిదారులు పెరగలేదు. వేలల్లో లబ్ధిదారులు తగ్గిపోయారనే విషయాన్ని ఈ కొత్త గణాంకాలే తేల్చి చెబుతున్నాయని భావించాల్సి వస్తోంది.




Updated Date - 2022-06-26T07:07:42+05:30 IST