ఇది ప్రజాస్వామ్య విజయం: బైడెన్

ABN , First Publish Date - 2021-01-21T13:05:36+05:30 IST

46 వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బైడెన్‌ తన మనోగతాన్ని, లక్ష్యాలను వివరిస్తూ.. సవాళ్లను సమైక్యంగా ఎదుర్కొందామని పిలుపిస్తూ తొలి ప్రసంగం చేశారు! ‘‘ఈరోజు అమెరికాది. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.

ఇది ప్రజాస్వామ్య విజయం: బైడెన్

వాషింగ్టన్: 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బైడెన్‌ తన మనోగతాన్ని, లక్ష్యాలను వివరిస్తూ.. సవాళ్లను సమైక్యంగా ఎదుర్కొందామని పిలుపిస్తూ తొలి ప్రసంగం చేశారు! ‘‘ఈరోజు అమెరికాది. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. చరిత్రాత్మకమైన రోజు. ఆశావహమైన రోజుల కోసం సంకల్పం తీసుకోవాల్సిన రోజు. తరతరాలుగా అమెరికా పరీక్షలకు గురయ్యింది.. కొత్త సవాళ్లను స్వీకరించి సాధించింది. ఇది ప్రజా విజయం.ప్రజాస్వామ్యం విలువైనది, అదే సమయంలో బలహీనమైనది కూడా. కానీ ఆ ప్రజాస్వామ్యమే నేడు గెలుపొందింది. ఈ రోజు ఓ అభ్యర్థి గెలవలేదు.. ప్రజాస్వామ్యమే విజయం సాధించిందని మనం చూశాం. కొద్ది రోజుల కిందటే ఇక్కడే కేపిటల్‌ భవన పునాదులను పెకలించే హింస ప్రబలింది. కానీ దేశమంతా ఒక్కటై నిలిచింది. దేవుడి దయ వల్ల అవిచ్ఛిన్నంగా నిలదొక్కుకుంది. అధికార మార్పిడి సజావుగా జరిగింది. అలసిపోకుండా, ధైర్యంగా, ఆశావహంగా ఇక దేశంపై దృష్టిపెట్టాలి. అమెరికా కథ నాదో, ఏ ఒక్కరిదో లేక ఏ కొద్దిమందిదో కాదు, అందరిదీ. ఓ సమైక్య దేశంగా అడుగెయ్యాలి. ఈ దేశం చాలా గొప్పది. మనం మంచివాళ్లం.


అనేక ఆటుపోట్లనీ, అశాంతినీ, యుద్ధాల్నీ ఎదుర్కొన్నాం. చాలా దూరం వచ్చాం. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ శీతాకాలం ఓ పెద్ద విపత్తునీ, ఆపదనూ తీసుకొచ్చింది. మనం చాలా వేగంగా అడుగెయ్యాలి. అత్యవసరంగా కదలాలి. ఓ మహమ్మారి దేశాన్ని కమ్మేసింది. రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువమందిని పొట్టనపెట్టుకుంది. అందుచేత చేయాల్సింది చాలా ఉంది. నిర్మించాల్సినదీ, పోగొట్టుకున్నదాన్ని పొందాల్సినదీ ఎంతో ఉంది. వేల ఉద్యోగాలు పోయాయి. వేల కోట్ల డాలర్ల  వ్యాపార నష్టం జరిగింది. ఇది నిజంగా సంక్షోభ పరిస్థితి.. దీన్నుంచి సత్వరం బయటపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘వర్ణ వివక్ష లేని సమాజం, అందరికీ న్యాయం ఇక వాయిదా వేసే అంశాలు కావు. వెంటనే ఈ దిశగా చర్యలు చేపడతాం. రాజకీయ అతివాదం, శ్వేత జాత్యహంకారం, దేశీయ ఉగ్రవాదం.. వీటన్నింటినీ తుదముట్టిస్తాం. సవాళ్లను ఎదర్కొనాలంటే మాటలు కాదు, చేతలు ముఖ్యం. మనస్ఫూర్తిగా, నా అంతరాత్మ సాక్షిగా ఈ పనిలో ఉంటా. నా అంతరాత్మ కోరుకుంటున్నదొక్కటే. అమెరికా ఏకం కావాలి. ప్రజలంతా ఏకం కావాలి. యునైటెడ్‌ అమెరికా.. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కలిసిరావాలి.


ఆగ్రహం, అసంతృప్తి, ద్వేషం, అరాచకం, తీవ్రవాదం, హింస, నిరాశా నిస్పృహలు, నిరుద్యోగం ... ఇవన్నీ మన ఉమ్మడి శత్రువులు. వీటికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రండి... సమైక్యంగా ఉంటే ఎంతో సాధించవచ్చు. ఎన్నో తప్పుల్ని సరిదిద్దవచ్చు.. మరెన్నో మంచిపనులు చేయవచ్చు. వైర్‌సను తుదముట్టించవచ్చు. అమెరికాను ప్రపంచ క్షేమం కోరే శక్తిగా మళ్లీ తీర్చిదిద్దవచ్చు. సమైక్యత అన్నది ఓ భ్రాంతిగా, ఫాంటసీగా చాలా మందికి తోచవచ్చు. కానీ ఇది మనకి కొత్త కాదు. ఎన్నోమార్లు చూశాం. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు పొంచే ఉన్నాయని మనకి తెలుసు. ఇది నిరంతర పోరాటం’’ అని బైడెన్‌ అన్నారు. ‘‘మనం ఒకర్నొకరం ప్రత్యర్థులుగా కాకుండా, పొరుగువారిగా చూసుకుందాం. ఒకర్నొకరం గౌరవించుకుంటూ హుందాగా మసలుదాం. విద్వేషాలొద్దు... ఐక్యత లేనిదే ప్రశాంతత లేదు. ఇది నిజం. దీన్ని సాధించిననాడు మనం విఫలం కాబోము. కలిసికట్టుగా ఉన్నన్నాళ్లూ ఎన్నడూ అమెరికా విఫలం కాలేదు. ఫలానాది సాఽధ్యం కాదనో, పరిస్థితులు మారవనో నాకు చెప్పొద్దు. ఓ మహిళ దేశ ఉపాద్యక్షురాలైంది. ఇది చరిత్ర’’ అని బైడెన్‌ ఉద్ఘాటించారు. ‘‘భవిష్యత్‌ గురించి చాలా మంది ప్రజల్లో బెంగ, భయాలు ఉన్నాయి. ఉద్యోగం ఉంటుందా,  పన్నులెలా కట్టాలి, కుటుంబాన్నెలా పోషించాలి... ఇలా! రేపేం జరుగుతుందోనన్న ఆందోళన అనేకమందిని వెన్నాడుతోంది. భయపడవద్దు.. మీలో మీరు కుమిలిపోకండి. పోటీపడండి. మిమ్మల్ని నమ్మని వారిని దూరం పెట్టండి’ అని ఆయన పిలుపునిచ్చారు.


‘ఈ అనాగరిక, అమర్యాదపూర్వక యుద్ధానికి చరమగీతం పాడాలి. మన ఆత్మలను, హృదయాలను తెరిచి, సామరస్యానికి తావిస్తే ఇది సాధ్యమే. ఇతరుల కోణంలో నుంచి కూడా చూడాలి’ అని ఆయన హితవు పలికారు. ‘‘ఈ ఆపత్సమయంలో ఒకరికొకరి సాయం కావాలి. శతాబ్దిలో ఒకసారి వచ్చే మహమ్మారిని ఎదుర్కొనడానికి కలిసిరండి. ప్రాణాంతకమైన ఈ శీతాకాలాన్ని మనం దాటేయాలి. రాజకీయాల్ని పక్కనపెట్టి దేశమంతా ఒకే తీరుగా కదలాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘విజృంభించిన మహమ్మారి, ప్రజాస్వామ్యంపై దాడి, పర్యావరణ సంక్షోభం, వర్ణవివక్ష, అసమానతలు... ఇవన్నీ విడివిడిగా కాదు, అన్ని సంక్షోభాలూ ఒక్కసారే వచ్చిపడ్డాయి.. ధైర్యంగా ఎదుర్కొందాం’’ అని ఆయన కోరారు.

Updated Date - 2021-01-21T13:05:36+05:30 IST