బైడెన్‌ భరోసా

ABN , First Publish Date - 2021-01-21T06:53:51+05:30 IST

అమెరికా సంయుక్త రాష్ట్రాల నలభైఆరవ అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌ ప్రమాణస్వీకారంతో ఆ దేశం కొత్త శకంలోకి అడుగుపెట్టింది...

బైడెన్‌ భరోసా

అమెరికా సంయుక్త రాష్ట్రాల నలభైఆరవ అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌ ప్రమాణస్వీకారంతో ఆ దేశం కొత్త శకంలోకి అడుగుపెట్టింది. సర్వసాధారణంగా అధ్యక్ష ఉపాధ్యక్షుల ప్రమాణస్వీకార ఘట్టం చుట్టూ అల్లుకొని ఉండే వెలుగుజిలుగులూ కోలాహలాలను ఈ మారు కరోనాతో పాటు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా కమ్మేశారు. మాజీ అధ్యక్షుడు పోతూ పోతూ ఇంకెన్ని మంటలు పెట్టిపోతారోనన్న భయంతో రాజధాని యావత్తూ దిగ్బంధంలోకి పోయింది. ప్రమాణస్వీకారోత్సవ సమయం సమీపిస్తున్న కొద్దీ బందోబస్తు చాలదేమోనన్న భయంతో బలగాల మోహరింపులు హెచ్చుతూ వచ్చాయి. కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం సందర్భంగా అనుసరించాల్సిన నియమాలనూ, పాటించాల్సిన సంప్రదాయాలను ట్రంప్‌ బేఖాతరు చేస్తారని ఎలాగూ ఊహించిందే. ఇక, కొత్తగా బాధ్యతలు చేపట్టిన మరే అమెరికా అధ్యక్షుడికీ లేనన్ని సమస్యలూ సవాళ్ళూ బైడెన్‌కు తప్పడం లేదు.


జో ఎజెండా ఏమిటన్నది దాదాపుగా తెలిసిందే. చేయదల్చుకున్నదేమిటో ఆయనా చెప్పారు, మీడియా కూడా ఊహిస్తున్నది. నాలుగేళ్ళ పాలనలో ట్రంప్‌ తీసుకున్న దాదాపు అన్ని వివాదాస్పద నిర్ణయాలనూ బైడెన్‌ తిరగదోడవచ్చు. తొలిరోజునే డజనుకుపైగా ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలు వెలువడవచ్చునంటున్నారు. పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకోవడం ద్వారా మిగతా ప్రపంచం దృష్టిలో అమెరికా చాలా పలుచనైంది. ట్రంప్‌ నిర్ణయాన్ని తిరగదోడి, ఉద్గారాల కట్టడి, పర్యావరణ పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉంటుందని బైడెన్‌ చాటబోతున్నారు. ‘చైనా వైరస్‌’ విషయంలో ఆ దేశంతో అంటకాగి, మిగతా ప్రపంచాన్ని ముంచిందన్న ఆరోపణతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపేసిన ఘనుడు ట్రంప్‌. కరోనా వైరస్‌ విషయంలో తమ పాలకులు అసత్యాలు, రహస్యాలతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని చైనీయులే గట్టిగా నమ్ముతున్న కాలంలో, బయటి ప్రపంచంలో మిగతావారెవ్వరూ నోరెత్తనిదశలో ఘాటైన విమర్శలతో చైనాను ఇరుకునబెట్టి ఉక్కిరిబిక్కిరి చేసిన ఘనుడు ట్రంప్‌. కానీ, కరోనా కష్టకాలంలో యావత్ ప్రపంచాన్ని ఒకతాటిపైకి తెచ్చి నాయకత్వస్థానంలో నడవాల్సిన ఆరోగ్య సంస్థను ఇలా నిందలూ నిష్టూరాలతో బలహీనపరచడం, నిధులు ఆపేసి నీరసపరచడం, తద్వారా నిరుపేద దేశాలకు అన్యాయం చేయడం సముచితం కాదు. ఆరోగ్యసంస్థను ఆదుకోవడంతో పాటు, కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యవైఖరికి స్వస్తిపలకాలన్నది బైడెన్‌ సంకల్పం. ప్రపంచంలోనే అత్యధికంగా రెండున్నరకోట్లమంది అమెరికన్లు కొవిడ్‌ బారిన పడ్డారు. నాలుగులక్షలమంది చనిపోయారు. దేశమంతటా కఠినమైన నియమనిబంధనలు అమలు చేయాలన్న ఆలోచనకు రాష్ట్రాలు ఏమేరకు సహకరిస్తాయో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తలెగరేసినా స్థానిక ప్రభుత్వాలను నిధులతో ఆకట్టుకోవడం ద్వారా కరోనాను కంట్రోల్‌ చేయగలమని బైడెన్‌ బృందం నమ్మకం. ఇక తన పాలనాకాలంలో ట్రంప్‌ ప్రదర్శించిన మత, వర్ణ వివక్షలకు అడ్డు లేకపోయింది. జార్జి ఫ్లాయిడ్‌ ఘటనను, అనంతర ఉద్యమాన్ని సైతం ఆయన శ్వేతజాత్యహంకారాన్ని రెచ్చగొట్టడానికి వాడుకున్నాడు. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ ముస్లిం మెజారిటీ దేశాలనుంచి సాగే వలసలను నిషేధించాడు. ఈ ఆంక్షలను ఎత్తివేయడమే కాక, దేశంలో ఇప్పటివరకూ సాగిన అక్రమ వలసలన్నింటినీ ఒక క్రమపద్ధతిన సక్రమం చేసే ఆలోచనలో బైడెన్‌ ప్రభుత్వం ఉన్నది. అమెరికా మెక్సికో మధ్య ట్రంప్‌ ప్రేమగా కడుతున్న అడ్డుగోడను సైతం కూల్చివేసి మిగతా ప్రపంచానికి సానుకూల సందేశం ఇవ్వాలని బైడెన్‌ ఆలోచన. ఈ గోడనిర్మాణం కోసం వసూలు చేసిన విరాళాల్లో మిలియన్‌ డాలర్లు స్వాహా చేసిన స్టీవ్‌ బానన్‌ కూడా ట్రంప్‌ తన పదవీకాలం చివరిరోజున క్షమాబిక్ష పెట్టిన వారిలో ఉన్నాడు. చీలిన సమాజాన్ని సంఘటితం చేయడం, దూరమైన మిత్రదేశాలను దగ్గరచేసుకోవడం బైడెన్‌కు పరీక్ష. ఇరాన్‌, చైనా, ఉత్తరకొరియా తదితర దేశాల విషయంలో ట్రంప్‌ దుస్సాహసాలు చేశారు. మధ్యప్రాచ్యంలో కొత్త ఎత్తులు వేశారు. తన అధ్యక్ష ప్రసంగంలో నేను అమెరికన్లందరికీ అధ్యక్షుడిని అన్న ఆశ్వాసన ఇస్తూ, పరిస్థితులు కచ్చితంగా మారతాయన్న భరోసా కల్పిస్తున్న కొత్త అధ్యక్షుడు అమెరికాను ఉన్నంతంగా నిలబెడతారని ఆశిద్దాం.

Updated Date - 2021-01-21T06:53:51+05:30 IST