Bidarలో ప్రవేశించకుండా ముతాలిక్‌ను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-06-05T16:50:53+05:30 IST

జిల్లా యంత్రాంగం ఆదేశాలను ధిక్కరించి బీదర్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్‌ముతాలిక్‌ను సరిహద్దులోనే

Bidarలో ప్రవేశించకుండా ముతాలిక్‌ను అడ్డుకున్న పోలీసులు

                          - ఈ నెల 14 వరకు నిషేధం


బెంగళూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా యంత్రాంగం ఆదేశాలను ధిక్కరించి బీదర్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్‌ముతాలిక్‌ను సరిహద్దులోనే పోలీసులు అడ్డుకున్నారు. కలబురగితోపాటు బీదర్‌లోనూ శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్‌ ముతాలిక్‌, రాష్ట్ర అధ్యక్షుడు సిద్దలింగస్వామి ప్రవేశానికి నిషేధం ఉంది. దీంతో శనివారం బీదర్‌ సరిహద్దులోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈనెల 12న మూల అనుభవం మండపం రక్షణ కోసం మఠాధిపతుల బసవకల్యాణ సంక్షేమయాత్ర ఏర్పాటు చేశారు. ఈ మేరకు శనివారం నుంచి ఈనెల 14వరకు బీదర్‌ జిల్లా ప్రవేశానికి వారికి నిషేధం విధించారు. ముతాలిక్‌ బసవ కల్యాణలోని రుద్రభూమి అభినవశ్రీ మఠానికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఇదే సందర్భంలో పోలీసులు, శ్రీరామసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాము ఎటువంటి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం లేదని, కేవలం కార్యక్రమ కార్యాచరణపై మాత్రమే చర్చించదలిచామన్నారు. జిల్లా పోలీసులు, అధికారులు చర్చలకు వస్తే అభ్యంతరం లేదని, ఇలా అడ్డుకోవడం సరికాదన్నారు. కాగా కలబురగిలో ముతాలిక్‌ మాట్లాడుతూ శ్రీరంగపట్టణలో టిప్పు సుల్తాన్‌ కాలంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చి జామియా మసీదు నిర్మించారనేందుకు పలు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ వివాదం కోర్టుకు చేరిందన్నారు. అయినా మసీదులో నమాజ్‌లు ఆగలేదన్నారు. ఇక్కడ పురాతత్వశాఖ పలు ఆంక్షలు విధించిందని అయితే అమలు కావడం లేదని ఆరోపించారు. ఆర్‌ఎస్ఎస్‌ ముఖ్యులు మోహన్‌భాగవత్‌ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి మసీదులో శివలింగం ఉందేమోనని వెతకరాదనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇలాగైతే ఆలయాల రక్షణ ఎలాగంటూ ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-05T16:50:53+05:30 IST