సైకిల్‌‌పై గస్తీ మళ్లీ మొదలైంది

ABN , First Publish Date - 2021-12-10T00:04:06+05:30 IST

నేరాలను నిరోధించేందుకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు

సైకిల్‌‌పై గస్తీ మళ్లీ మొదలైంది

చెన్నై : నేరాలను నిరోధించేందుకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గ్రేటర్ చెన్నై పోలీసులు సైకిల్‌పై గస్తీని మళ్ళీ ప్రారంభించారు. క్రమం తప్పకుండా సైకిల్‌పై గస్తీ తిరగాలని అధికారులను చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జీవల్ ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. 


శంకర్ ఆదేశాల మేరకు 12 మంది డిప్యూటీ పోలీసు కమిషనర్లు, ఇతర అధికారులు సైకిల్ గస్తీని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీ నగర్ డీసీపీ హరి కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ, సైకిల్ గస్తీని నిరంతరం వ్యవస్థాగత కార్యక్రమంగా నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాము వివిధ రూపాల్లో గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో నడుచుకుంటూ మారుమూల ప్రాంతాలకు, బస్టాండ్లకు వెళ్లేవారమని, ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకునేవారమని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్తేనే వారి సమస్యలు తెలుస్తాయని చెప్పారు. బైక్ పెట్రోలింగ్ కూడా నిర్వహించేవారమని, దానివల్ల ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించడం సాధ్యమయ్యేది కాదని చెప్పారు. సైకిల్‌పై గస్తీ తిరగడం వల్ల ఎక్కువ మందికి చేరువ కావచ్చునని భావించామని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్‌పై గస్తీ తిరుగుతూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వేగంగా పరిష్కరించాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. టీ నగర్లో 11 స్టేషన్లు ఉన్నాయని, ఒక్కొక్క స్టేషన్ నుంచి నలుగురు చొప్పున ప్రతి రోజూ సైకిల్ గస్తీ నిర్వహిస్తారని చెప్పారు. 


Updated Date - 2021-12-10T00:04:06+05:30 IST