అఖిలపక్ష సమావేశానికి బీజేపీ రాలేదు: ఛత్తీస్‌గఢ్ సీఎం

ABN , First Publish Date - 2021-04-16T22:35:42+05:30 IST

బీజేపీ నేతలు, కార్యకర్తలు ముందు చప్పట్లు కొట్టారు, తర్వాత కొవ్వొత్తులు వెలిగించారు, ఆ తర్వాత పటాకులు పేల్చారు, ఇప్పుడు ఇంకో ఆట ఆడుతున్నారు. పుకార్ల వ్యాప్తిని ఆపే సమయం కాదిది

అఖిలపక్ష సమావేశానికి బీజేపీ రాలేదు: ఛత్తీస్‌గఢ్ సీఎం

రాయ్‌పూర్: రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి భారతీయ జనతా పార్టీ నేతలు హాజరు కాలేదని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ శుక్రవారం విమర్శించారు. దేశవ్యాప్తంగా టీకా ఉత్సవం నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును కూడా బీజేపీ నేతలు పాటించకుండా సమావేశానికి డుమ్మా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని బీజేపీకి చెందిన వారే పట్టించుకోవడం లేదని ఎద్దేవా ఎద్దేవా చేశారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా బీజేపీ నేతల తీరుపై బాఘేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


‘‘బీజేపీ నేతలు, కార్యకర్తలు ముందు చప్పట్లు కొట్టారు, తర్వాత కొవ్వొత్తులు వెలిగించారు, ఆ తర్వాత పటాకులు పేల్చారు, ఇప్పుడు ఇంకో ఆట ఆడుతున్నారు. పుకార్ల వ్యాప్తిని ఆపే సమయం కాదిది. ఆరోపణలు చేసే ముందు గణాంకాలు ఇవ్వండి. ఛత్తీస్‌గఢ్ కంటే ఉత్తమంగా ఏ బీజేపీ పాలిత రాష్ట్రం పని చేస్తుందో చూపించండి. టీకా ఉత్సవ్ జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కానీ చప్పట్లు కొట్టిన వారెవరూ టీకా ఉత్సవ్ కోసం బయటికి రాలేదు. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలెవరూ రాలేదు. మోదీ మాటు బీజేపీ నేతలు వినడం మానేశారు’’ అని తనదైన శైలిలో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సీఎం బాఘేల్ స్పందించారు.

Updated Date - 2021-04-16T22:35:42+05:30 IST