తండ్రి కఠినత్వాన్ని చూసి చిన్నతనంలో సంగీతాన్ని అసహ్యించుకున్నాడు.. కానీ జీవితాంతం గాత్రమే భూపీందర్ సింగ్‌కు గుర్తింపుగా మారింది!

ABN , First Publish Date - 2022-07-19T14:06:30+05:30 IST

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, గజల్ రచయిత భూపీందర్...

తండ్రి కఠినత్వాన్ని చూసి చిన్నతనంలో సంగీతాన్ని అసహ్యించుకున్నాడు.. కానీ జీవితాంతం గాత్రమే భూపీందర్ సింగ్‌కు గుర్తింపుగా మారింది!

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, గజల్ రచయిత భూపీందర్ సింగ్ సోమవారం కన్నుమూశారు. 82 ఏళ్ల భూపీందర్ సింగ్ గత కొన్ని రోజులుగా యూరినరీ ఇన్ఫెక్షన్‌తో సహా పలు వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాద వాతావరణం నెలకొంది. భూపీందర్ సింగ్  తన ప్రత్యేకమైన పాటల శైలి కారణంగా బాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. తనదైన స్టైల్‌తో భూపీందర్ సింగ్ తన కెరీర్‌లో ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. ఇందులో "మేరీ ఆవాజ్ హీ పహచాన్ హై, గర్ యాద్ రహే" లాంటి పాటలు ఇప్పటికీ సాధారణ ప్రజల నాలుకపై సైతం కదలాడుతుంటాయి. చిన్నతనంలో తన తండ్రి కఠినత్వం కారణంగా భూపీందర్ సింగ్  సంగీతాన్ని అసహ్యించుకున్నాడు. భూపీందర్ సింగ్ 1939 ఏప్రిల్ 8న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. ఆ సమయంలో దేశం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది. 



ఆ రోజుల్లో అతని తండ్రి ప్రొఫెసర్ నాథ్ సింగ్ పంజాబ్‌లోని ప్రసిద్ధ సంగీతకారులలో ఒకనిగా గుర్తింపు పొందారు. అలాగే అమృత్‌సర్‌లోని ఖల్సా కళాశాలలో సంగీత ప్రొఫెసర్‌గా ఉన్నారు. గిటార్ నేర్పడంలో చాలా స్ట్రిక్ట్ మాస్టర్‌గా పేరు పొందారు. తండ్రి కఠినమైన ప్రవర్తన తీరు చూసి బాలుడైన భూపీందర్ సింగ్ సంగీతాన్ని అసహ్యించుకున్నారు. భూపీందర్ సింగ్ కుటుంబం ఆ తరువాత ఢిల్లీకి మకాం మార్చింది. ఇక్కడి నుంచి భూపీందర్ సింగ్ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో తన ప్రదర్శనతో కెరియర్ ప్రారంభించారు. అక్కడ కూడా గజల్స్ పాడేవారు. సంగీతకారుడు మదన్ మోహన్ అతని ప్రతిభను గుర్తించి బొంబాయికి పిలిపించారు. ఆ తర్వాత మదన్ మోహన్ అతనికి హకీకత్ చిత్రంలో మహమ్మద్ రఫీతో కలిసి “హోకే మజ్బూర్ ముఝే ఉనే బులా హోగా” పాట పాడే అవకాశం ఇచ్చారు. ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. “మౌసమ్”, “సత్తె పె సత్తా”, “అహిస్తా అహిస్తా”, “దూరియన్” తదితర చిత్రాల్లో పాటలు పాడారు. మహ్మద్ రఫీ, ఆర్డీ బర్మన్, మదన్ మోహన్, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, గుల్జార్ నుండి బప్పీలహరి దాకా అందరితోనూ భూపీందర్ సింగ్ పని చేశారు. 1980వ దశకంలో బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ గాయని మిథాలీ సింగ్‌ను భూపీందర్ సింగ్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చాలా సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఇద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది.


భూపీందర్ సింగ్ గళం నుంచి జాలువారిన కొన్ని ప్రసిద్ధ పాటలు ఇవే..

‘‘నామ్ గమ్ జాయేగా, ఏక్ అకేలా ఇస్ షెహెర్ మే, కిసి నజర్ కో తేరా ఇంతెజార్ ఆజ్ భీ హై’’, “దుకీ పే దుకీ హో యా సెట్టే పే సత్తా,” “హోకే మజ్బూర్ ముఝే, ఉస్నే బులాయా హోగా”, (మహ్మద్ రఫీ, తలత్ మెహమూద్ మరియు మన్నా డేతో కలిసి), ‘‘దో దివానే పెహర్ మే’’, ‘‘ఏక్ అకేలా ఈజ్ షెహర్ మే’’, ‘‘తోడిసి జమీన్ తోడా ఆస్మాన్’’, ‘‘దునియా చూట్ యార్ నా చూటే’’ తదితర పాటలతో మంచి గుర్తింపు పొందారు భూపీందర్ సింగ్. ‘‘కరోగే యాద్’’ అనే పాట కూడా సింగ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది ‘‘దమ్ మారో దమ్’’, ‘‘చురా లియా హై’’, ‘‘చింగారి కోయి భడ్కే’’, ‘‘మెహబూబా ఓ మెహబూబా’’ లాంటి ప్రసిద్ధ ట్రాక్ లలో ఆయన స్వరం వినిపిస్తూనే ఉంటుంది. 

Updated Date - 2022-07-19T14:06:30+05:30 IST