భూమిచ్చి.. పదవి ‘కొట్టే’శారు!

ABN , First Publish Date - 2022-04-13T09:44:40+05:30 IST

విశాఖలోని ఎన్‌సీసీ భూములు ఆగమేఘాలపై చేతులు మారడం వెనుక పెద్ద తతంగమే నడిచిందనే చర్చ జరుగుతోంది.

భూమిచ్చి.. పదవి ‘కొట్టే’శారు!

  • తమ్ముడితో డీల్‌... అన్నకు పదవీయోగం
  • ఆఘమేఘాలపై భూమి చేతులు మారింది అందుకే!
  • ఎన్‌సీసీ వ్యవహారంలో జగన్‌, విజయసాయికి భారీ లబ్ధి: బండారు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖలోని ఎన్‌సీసీ భూములు ఆగమేఘాలపై చేతులు మారడం వెనుక పెద్ద తతంగమే నడిచిందనే చర్చ జరుగుతోంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు మంత్రి పదవి లభించడం వెనుక ఆయన తమ్ముడి వ్యాపార లావాదేవీలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. విశాఖపట్నంలోని మధురవాడలో 97.3 ఎకరాల భూమిని ప్రభుత్వం 2005లో హౌసింగ్‌ ప్రాజెక్టు నిమిత్తం ఎన్‌సీసీ సంస్థకు కేటాయించింది. వివిధ కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదు. దానిని సెటిల్‌మెంట్‌ చేయాలని ఆ సంస్థ గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరితే... రిజిస్ట్రేషన్‌ విలువకు 20 శాతం ఎక్కువ చెల్లిస్తే... స్టాంపు డ్యూటీ మినహాయిస్తామని చెప్పింది. ఇందుకు ఎన్‌సీసీ ముందుకు రాలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొత్తం భూమిని రూ.187 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు గత అక్టోబరులో రిజిష్టర్‌ చేసింది. ఆరు నెలలు కూడా గడవకముందే ఆ భూమిని బెంగళూరులోని జీఆర్‌పీఎల్‌ సంస్థకు రూ.200 కోట్లకు ఇవ్వడానికి ఎన్‌సీసీ ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి మధురవాడలో ప్రభుత్వ రిజిస్ర్టేషన్‌ విలువ గజం రూ.22 వేలు ఉంది. అంటే ఎకరా రూ.10 కోట్లు. ఆ లెక్కన 97.39 ఎకరాల భూమి ధర ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారుగా వేయి రూ.వెయ్యి కోట్లు. బహిరంగ మార్కెట్‌లో అంతకు రెట్టింపు (రూ.1,700 కోట్ల వరకూ) ధర ఉంది. అంత విలువైన స్థలాన్ని అతి తక్కువ ధరకు ఇవ్వడం వెనుక ‘బిగ్‌ డీల్‌’ ఉందని తెలుగుదేశం నాయకులు ముందు నుంచీ ఆరోపిస్తున్నారు.


బెంగళూరు నుంచే సంబంధాలు

బెంగళూరులోని జీఆర్‌పీఎల్‌ సంస్థ యజమాని కొట్టు మురళీకృష్ణ. ఆయన తాజాగా మంత్రి పదవి లభించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు స్వయానా సోదరుడు. కొట్టు మురళీకృష్ణ చాలాకాలంగా విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. రూ.2 వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం ఎన్‌సీసీకి అతి తక్కువ ధరకు ఇస్తే... వారు కేవలం రూ.200 కోట్లకు జీఆర్‌పీఎల్‌కు అప్పగించారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఇది జగన్‌ అండ్‌ కో బినామీ కంపెనీ అని, అందుకే తక్కువ ధరకు ఆ భూమి కొట్టేశారని, అందుకు ప్రతిఫలంగానే మురళీ సోదరుడైన కొట్టు సత్యనారాయణకు మంత్రి పదవితోపాటు డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారని చెప్పారు. విశాఖలో కొట్టు మురళీకృష్ణకు శ్రీరామ్‌ ప్రాపర్టీ్‌సలో కూడా వాటా ఉందని, అందులో రెండు ఎకరాలు విజయసాయిరెడ్డికి ఇచ్చారని, అక్కడ భారీ భవనం నిర్మిస్తున్నారని బండారు ఆరోపించారు. అటు జగన్‌కు, ఇటు విజయసాయిరెడ్డికి ఇద్దరికీ ఎన్‌సీసీ వ్యవహారంలో భారీగానే లబ్ధి చేకూరిందన్నారు. పదవుల పందేరానికి ప్రభుత్వ భూములను వినియోగించుకోవడం ఇదే మొదటిసారి అని బండారు వ్యాఖ్యానించారు. 


ఎన్‌సీసీపై సింగపూర్‌ కంపెనీ కేసు?

విశాఖలో 97.3 ఎకరాల భూ వివాదంపై నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌సీసీ) అనుబంధ సంస్థపై సింగపూర్‌కు చెందిన మత్సడో ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ కేసు వేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లో కేసు వేయగా, భూ లావాదేవీలపై స్టే విధించినట్టు సమాచారం. ఎన్‌సీసీ, మత్సడో కన్సార్టియంగా ఏర్పడి ఏపీ ప్రభుత్వం నుంచి జాయింట్‌ వెంచర్‌ కింద హౌసింగ్‌ ప్రాజెక్టు కోసం మధురవాడలో 97.3 ఎకరాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు మత్సడో చెబుతోంది. అదే విషయాన్ని తన పిటిషిన్‌లో పేర్కొనగా, ఆ మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని ఎన్‌సీసీని ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఆదేశించినట్టు తెలిసింది.

Updated Date - 2022-04-13T09:44:40+05:30 IST