భూమాయ

ABN , First Publish Date - 2020-05-21T09:29:45+05:30 IST

అధికార పార్టీ నాయకులు, అధికారుల వ్యవహారశైలి కారణంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని

భూమాయ

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : అధికార పార్టీ నాయకులు, అధికారుల వ్యవహారశైలి కారణంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని గిలకలదిండిలో  1,050 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందినట్టే అంది చేజారిపోయేలా ఉన్నాయి. గిలకలదిండి నుంచి హార్బర్‌కు వెళ్లే దారిలో మడ అడవులు ఉన్న  40 ఎకరాలకు పైగా భూమిని గిలకలదిండిలోని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు  ఎంపిక చేశారు. ఈ భూమిలో ఉన్న మడచెట్లను యంత్రాల ద్వారా తొలగించి గుట్టలుగా పెట్టారు. ఎంపిక చేసిన భూమి పక్కనే సముద్రంలో కలిసే కాలువ ఉంది.  సముద్రపు పోటు సమయంలో ఈ కాలువ ద్వారా నీరు ఇళ్ల స్థలాలుగా ఎంపిక చేసిన భూముల్లోకి రాకుండా  రెండు అడుగుల ఎత్తున  గట్టు వేశారు.


ఈ గట్టు పక్కనే రెండు, మూడు మీటర్ల ఎత్తున మడ చెట్లు ఉండటం గమనార్హ.ం. ఎంఫన్‌ తుపాను ప్రభావంతో బుధవారం ఉదయం సముద్రం ఎగతన్నడంతో  ఇళ్ల స్థలాలుగా ఎంపిక చేసిన భూమికి అడ్డుగా వేసిన గట్టు వరకు సముద్రపు నీరు వచ్చేసింది. సముద్రంలో కలిసే కాలువ పక్కన ఉన్న మడ భూములను ఇళ్ల స్థలాలుగా ఎంపిక చేయడం, అధికారులు మారు మాట్లాడకుండా  అంగీకరించడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇళ్ల స్థలాలకు ఎంపిక  చేసిన భూమి నివాసయోగ్యం కాదని తెలిసినా ఎందుకు కేటాయించారనే అంశం ప్రశ్నగా మారింది.


అంతా కక్కుర్తే..

ఇళ్ల స్థలాలుగా ఎంపిక చేసిన  భూమిలో మెరక చేసే పనులు ప్రారంభించారు. ఈ స్థలం ఎదురుగా ఉన్న భూమిలో ఇటీవల మునిసిపల్‌ ట్రాక్టర్ల ద్వారా తెచ్చిన చెత్తను వేశారు. ఈ డంపింగ్‌ యార్డు నుంచే మట్టిని రెండు పొక్లెయిన్లు, 10కిపైగా ట్రాక్టర్లు పెట్టి తరలిస్తున్నారు. మట్టి తరలించే ప్రాంతంలోనూ మడచెట్లు ఉండటం గమనించాల్సిన అంశం. ఈ భూమిని మెరకచేసే పనులు అధికార పార్టీ నాయకులకు అప్పగించడంతో తమ చిత్తానుసారం మట్టిని మడ అడవిలో నుంచే  తరలించడం విశేషం. 


జేసీ ఆరా

గిలకలదిండిలో ఇళ్ల స్థలాల ఎంపిక వ్యవహారం వివాదాస్పదంగా మారి కోర్టుకు వెళ్లడంతో జేసీ కె.మాధవీలత ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రెవెన్యూ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. భూమి ఎంపిక, అక్కడున్న వాస్తవ పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. గిలకలదిండిలో ఇళ్ల స్థలాల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు సరైన  సమాచారం చెప్పకుండా తప్పించుకున్నారు. జూన్‌ 8వ తేదీ నాటికి పేదలకు స్థలాలు అందజేయాల్సి ఉండగా, ఈలోగా అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.  

Updated Date - 2020-05-21T09:29:45+05:30 IST