విద్యుత్తు బిల్లుపై భగ్గు

ABN , First Publish Date - 2022-08-09T08:47:49+05:30 IST

విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలు తెలిపారు.

విద్యుత్తు బిల్లుపై భగ్గు

దేశవ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె.. నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు

లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. తీవ్రస్థాయిలో విపక్షాల నిరసన 

ప్రైవేటీకరణకు కుట్ర అని ధ్వజం.. ప్రతిపక్షాల నిరసనతో స్టాండింగ్‌ కమిటీకి బిల్లు

శాంతించిన ఉద్యోగ సంఘాలు.. నిరసన విరమణ

‘ప్రభుత్వ రంగం’ లేకుండా చేయడమే బీజేపీ సిద్ధాంతం: వినోద్‌


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలు తెలిపారు. నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజనీర్స్‌ ఆధ్వర్యంలో మెరుపు సమ్మె చేపట్టారు. ప్రభుత్వ విద్యుత్తు పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలంటూ నల్లబ్యాడ్జీలు, నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలియజేశారు. ఉద్యోగులంతా విధులు బహిష్కరించడంతో విద్యుత్తు సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని, గ్రిడ్‌ కుప్పకూలుతుందని భయపడగా అలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు సోమవారం విద్యుత్తు సవరణ బిల్లును కేంద్రప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌, లెఫ్ట్‌, టీఎంసీ, డీఎంకేతో సహా విపక్షాల సభ్యులు ఈ బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. విద్యుత్తు చట్ట (సవరణ) బిల్లు- 2022ను ప్రవేశపెట్టే ముందు అన్ని రాష్ట్రాలతో సమగ్రంగా చర్చించాలని, అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే బిల్లును తీసుకొస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర అని ధ్వజమెత్తారు. ఈ చట్టం వల్ల ‘లాభాల ప్రైవేటీకరణ.. నష్టాల జాతీయీకరణ’ జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి ఆర్కే సింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో బిల్లుపై సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. ఇది ప్రజలు, రైతుల అనుకూల బిల్లు అని చెప్పారు. అదేసమయంలో బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపించాలని మంత్రి లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. స్పందించిన ఓం బిర్లా.. బిల్లును స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపించారు.


అదానీ, అంబానీ పరం చేయడానికే..

నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజనీర్స్‌ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 27 లక్షల మంది ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గొన్నట్లు కమిటీ ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్తు సౌధతో పాటు ఉత్పత్తి కేంద్రాలు (జెన్‌కో), కార్పొరేట్‌ కార్యాలయం సహా రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నాలు చేశారు. విద్యుత్తు సౌధలో జరిగిన మహాధర్నాకు ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్‌ బోయిన్‌పల్లి వినోద్‌ కుమార్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ట్రాన్స్‌కో/జెన్‌కో సీఎండీ దేవులపల్లిప్రభాకర్‌రావు సంఘీభావం ప్రకటించారు. దేశంలో ప్రభుత్వరంగం లేకుండా చేయడమే బీజేపీ సిద్ధాంతం అని, విద్యుత్తు రంగాన్ని అదానీ, అంబానీల పరం చేయడానికే ఈ బిల్లు తెస్తున్నారని వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. దేశంలో 75 ఏళ్లుగా నిర్మించుకున్న ప్రభుత్వ రంగాన్ని కుప్పకూల్చడం, అమ్మేయడమే కేంద్రప్రభుత్వం పనిగా పెట్టుకుందని, చివరికి రైల్వేలనూ వదలడం లేదని ఆక్షేపించారు. విద్యుత్తు సవరణ బిల్లు ప్రజలు, రైతులకు ప్రమాదకరమని చెప్పారు. ఉద్యోగుల పోరాటానికి టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. విద్యుత్తు ఉద్యోగుల పోరాటం జీతభత్యాల కోసం కాదని తమ్మినేని వీరభద్రం అన్నారు. 


మళ్లీ బిల్లు పెడితే సమ్మే..

బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు విధులు బహిష్కరించి, నిరసనలు చేపట్టారు. విద్యుత్తు సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగించకూడదని, అంతరాయం ఏర్పడితే మాత్రం పునరుద్ధరణ చర్యల్లో పాల్గొనరాదని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. అయితే భారీ వర్షాలు కురుస్తున్నా విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకపోవడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక బిల్లును స్టాండింగ్‌ కమిటీకి సిఫారసు చేయడంతో నిరసనలను విరమించుకుంటున్నామని, మళ్లీ బిల్లు పెడితే మెరుపు సమ్మెకు దిగుతామని పవర్‌ జేఏసీ ఛైర్మన్‌ సాయిబాబు హెచ్చరించారు. విద్యుత్తు బిల్లును స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపించిన నేపథ్యంలో ఉద్యోగులంతా ఆందోళనలు విరమించాలని  దేవులపల్లి ప్రభాకర్‌రావు కోరారు. 


చట్టం అమలైతే 24 గంటల కరెంటు కష్టమే

కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా ప్రవేశపెడుతున్న విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. విద్యుత్తు బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనివ్వబోమన్నారు. విద్యుత్తు చట్టాలు అమలైతే రైతులకు 24 గంటల కరెంటు అందని పరిస్థితులు నెలకొంటాయన్నారు. బ్యాంకులను ముంచుతున్న వ్యాపారులకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం.. ప్రజలకు తక్కువ చార్జీలతో కరెంటు అందిస్తున్న డిస్కంల నష్టాలను ఎందుకు భర్తీ చేయదని ప్రశ్నించారు. 



Updated Date - 2022-08-09T08:47:49+05:30 IST