భోపాల్ డాక్టర్ భళా...

ABN , First Publish Date - 2020-04-08T10:23:10+05:30 IST

కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ఓ డాక్టర్ తన కారునే తాత్కాలిక గృహంగా మార్చుకున్న ఆదర్శ ఘటన....

భోపాల్ డాక్టర్ భళా...

కారునే తాత్కాలిక గృహంగా మార్చుకున్న వైనం...అందులోనే నిద్రిస్తున్నారు

భోపాల్(మధ్యప్రదేశ్): కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ఓ డాక్టర్ తన కారునే తాత్కాలిక గృహంగా మార్చుకున్న ఆదర్శ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది. భోపాల్ నగరానికి చెందిన డాక్టర్ సచిన్ నాయక్ కరోనా రోగుల వార్డులో వైద్యసేవలందిస్తున్నారు. కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్న డాక్టర్ సచిన్ ముందుజాగ్రత్తగా కారులోనే ఐసోలేషన్‌లో ఉంటూ అందులోనే నిద్రిస్తున్నారు. ‘‘నేను కరోనా రోగులకు చికిత్స చేస్తున్నందు వల్ల ముందుజాగ్రత్తగా నా కుటుంబసభ్యులకు దూరంగా కారునే తాత్కాలిక నివాసంగా మార్చుకొని, గత ఏడు రోజులుగా అందులోనే ఐసోలేషన్‌లో ఉంటున్నాను’’ అని డాక్టర్ సచిన్ నాయక్ చెప్పారు. కాగా వైద్యులను హోటళ్లలో వసతి సౌకర్యాలు కల్పిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించి, దాని కోసం సన్నాహాలు చేస్తోంది. హోటల్ గదులను శానిటైజ్ చేసి రూం కేటాయిస్తే తాను అక్కడికి వెళతానని డాక్టర్ సచిన్ చెప్పారు. హోటల్ గది కేటాయించే వరకూ తాను కారులోనే నిద్రిస్తున్నానని డాక్టర్ వివరించారు. కారులోనే నిద్రిస్తూ అంకితభావంతో కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్న డాక్టర్ సచిన్‌ను అందరూ అభినందిస్తున్నారు.

Updated Date - 2020-04-08T10:23:10+05:30 IST