భోగి సాక్షిగా భగభగలు

ABN , First Publish Date - 2021-01-14T05:52:21+05:30 IST

భోగి సాక్షిగా భగభగలు

భోగి సాక్షిగా భగభగలు
రైతు వ్యతిరేక జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నమస్కరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక జీవోల దహనం

పరిటాలలో ఘనంగా భోగి సంబరాలు 

ఉత్సవాల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు

కంచికచర్ల, జనవరి 13 : టీడీపీ ఆధ్వర్యంలో పరిటాల గ్రామంలో బుధవారం ఉదయం నిర్వహించిన భోగి సంబరాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భగభగమన్నాయి. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన జరిగిన ఈ సంబరాల్లో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన ఐదు జీవోల ప్రతులను మంటల్లో వేశారు. రుణమాఫీ సొమ్ము రైతులకు అందకుండా చేసిన జీవో, కౌలు రైతులకు అన్యాయం చేసే జీవో, ప్రకృతి వ్యవసాయానికి అందాల్సిన నిధులను పక్కదారి మళ్లించిన జీవో,  సున్నా వడ్డీ కుదింపు జీవో, మోటార్లకు మీటర్లు బిగించే జీవో ప్రతులను టీడీపీ నాయకులు, రైతులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఇది విధ్వంసకర పాలన : ఎంపీ కేశినేని నాని

ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ విధ్వంసంతో పాలన ప్రారంభించిన జగన్‌ అన్ని వర్గాల ప్రజలను హింసిస్తున్నారన్నారు. మాజీమంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ వచ్చే సంక్రాంతికి అంతా మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రజల మధ్య ఉండగా, ఫేక్‌ సీఎం జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమిత మయ్యాడన్నారు. మాజీమంత్రి నెట్టెం రఘురామ్‌ మాట్లాడుతూ రైతులు, ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ దుష్టపాలనను అంతమొందించేందుకు అందరూ నడుం బిగించాలన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, నాయకులు వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ, శ్రీరాం తాతయ్య, నలగట్ల స్వామిదాసు, కోట వీరబాబు, బండారు హనుమంత రావు, ఆచంట సునీత, పరిటాల భాగ్యలక్ష్మి, మన్నె కళావతి, శాఖమూరి స్వర్ణలత, నన్నపనేని లక్ష్మీనారాయణ, మాగంటి బాబు, మాగంటి పుల్లారావు, దాములూరి మధు, కొండ్రు గుంట శ్రీనివాస్‌కుమార్‌, వడ్డెల్లి సాంబశివరావు, జంపాల సీతారామయ్య, రామినేని రాజా, ఉన్నం నరసింహారావు, వసంత సత్యనారాయణ, అల్లడి కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

నగరంలో నిరసన మంటలు

విజయవాడ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : పట్టణ, నగర ప్రజలపై భారాన్ని మోపేలా ఇంటి, నీటి, డ్రెయినేజీ పన్నులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 196, 197, 198  జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, కేశినేని శ్వేత తదితరులు పాల్గొన్నారు.  హనుమాన్‌పేటలో దాసరి భవన్‌ ఎదురుగా వేసిన భోగి మంటల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల కాపీలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ తదితరులు దహనం చేశారు. వాటితో పాటు ఆస్తి పన్ను పెంపు జీవోలను మంటల్లో వేశారు. వాంబేకాలనీలో జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు తదితరులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సుంకర పద్మశ్రీ, శ్రీదేవి, ఐద్వా, పీవోడబ్ల్యూ ప్రతినిధులు కొత్త వ్యవసాయ చట్ట కాపీలను బెంజిసర్కిల్‌ వద్ద భోగి మంటల్లో దహనం చేశారు. 

Updated Date - 2021-01-14T05:52:21+05:30 IST