చుక్‌..చుక్‌కు చుక్కెదురు

ABN , First Publish Date - 2020-08-07T11:52:55+05:30 IST

డబ్లింగ్‌ పనులు.. చూసి చూసి జనాలకు విసుగు పుట్టింది.. పదేళ్లుగా ఇవి సాగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ పూర్తవుతాయో ..

చుక్‌..చుక్‌కు చుక్కెదురు

భీమవరం - నరసాపురం - నిడదవోలు మధ్య బ్రేక్‌

ఐదు నెలల కిందటే తరలిపోయిన కార్మికులు

మరో ఆరు నెలల్లోపే పూర్తి కావాలనేది లక్ష్యం

అసాధ్యం అంటున్న కాంట్రాక్టర్లు, అధికారులు


(ఏలూరు-ఆంధ్రజ్యోతి):డబ్లింగ్‌ పనులు.. చూసి చూసి జనాలకు విసుగు పుట్టింది.. పదేళ్లుగా ఇవి సాగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ పూర్తవుతాయో తెలియదు. పనులు ప్రారంభ మైనా నేటికీ ముందుకు సాగడంలేదు. కరోనా కారణంగా ఐదు నెలల కిందట కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపో యాయి. అన్ని రైల్వే లైన్లపై విద్యుత్‌ రైళ్లు చకచకా పరుగులు తీస్తుంటే ఆ లైన్‌లో మాత్రం చానాళ్లపాటు బొగ్గు ఇంజన్లే తిరిగాయి. రానురాను డీజిల్‌ ఇంజన్లు నడవడం ప్రారంభించాయి. దశాబ్ద కాలం కిందట మిగతా రైల్వే లైన్ల మాదిరిగానే డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించింది. గుడివాడ-భీమవరం, భీమవరం-నిడదవోలు, భీమవరం-నరసాపురం మార్గంలో ట్రాక్‌ పనుల విస్తరణకు సంకల్పించారు. దశాబ్దం కిందటే పునాది పడినా ఇప్పటికీ ఈ లైన్‌కు మోక్షం లభించలేదు. అప్పట్లో కాంగ్రెస్‌ ఆ తరువాత అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీపై స్థానిక ఎంపీల ఒత్తిళ్ల ఫలితం కొంత కలి సొచ్చినట్టు అనిపించినా తాజాగా కరోనా దెబ్బ రైల్వే డబ్లింగ్‌ పనులపై తీవ్ర ప్రభావం చూపింది. ఐదు మాసాలుగా పనులు ఎక్కడకక్కడే నిలిచాయి. కాం ట్రాక్టర్లకు కూలీల కొరత, నిర్మాణ పనుల్లో వేగం తగ్గడానికి ఒకింత కారణ మైంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ పనుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పెద్దగా ప్రయత్నించకపోవడం మరో కారణం. 


కార్మికుల కొరత.. ముందుకు సాగని పనులు

ఒకప్పుడు రైల్వే పనులంటే నిర్ధిష్ట కాల పరిమితిలో పూర్తయ్యేవి. ఇప్పటి వరకూ రైల్వే చరిత్రలో అనుకున్న సమయానికే ఎలాంటి పనినైనా పూర్తి చేయగలిగారు. కానీ రైల్వే డబ్లింగ్‌ పనుల్లో ఆ అంచనాలను అందుకోలేకపో యారు. నేటికీ ఆగుతూ సాగుతూనే ఉన్నాయి. పదేళ్ల కిందట 2011-12 బడ్జెట్‌ లో డబ్లింగ్‌ పనులకు రూ.1428 కోట్లు కేటాయించారు.  ఈ పనులను ఐదింటి గా విభజించి 2019-20 నాటికే సింహభాగం పూర్తి చేయాలని నిర్ణయించారు. విజయవాడ-గుడివాడ, గుడివాడ-మచిలీపట్నం, గుడివాడ-భీమవరం, భీమవ రం-నిడదవోలు, భీమవరం-నరసాపురం ఈ మార్గం 221 కిలోమీటర్ల నిడివి ఉంటుందని అంచనా వేశారు. ప్రత్యేకించి విజయవాడ-గుడివాడ పనులన్నిం టినీ దాదాపు పూర్తిచేశారు. గుడివాడ-మచిలీపట్నం, గుడివాడ-భీమవరం ఈ రెండింటి పనులు శరవేగంగా ముందుకు సాగేలా లక్ష్యాలు నిర్ధేశించుకున్నారు. గుడివాడ-భీమవరం మధ్యన ఉన్న 60 కిలోమీటర్ల  డబ్లింగ్‌ పనులను ఎట్టకే లకు పూర్తిచేశారు. సమాంతరంగా విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రత్యేకించి భీమవరం నుంచి నిడదవోలు డబ్లింగ్‌ పనులు దాదాపు 42 కిలో మీటర్లు మేర పనులు చేయాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి భీమవ రం-నిడదవోలు మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులను పూర్తి చేయాల్సి ఉంది.


లాక్‌డౌన్‌ కాస్తా భీమవరం-నిడదవోలు, భీమవరం- నరసాపురం రైల్వే డబ్లింగ్‌ పనులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. భీమవరం -నరసాపురం మధ్యన 31 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణ పనులకు వీలుగా కొంతమేర ఎర్త్‌ వర్క్‌ పనులు పూర్తి చేయగలిగారు. ఎలాంటి కుంగిపాటు లేకుండా ఉండేందుకు అన్ని పరీక్ష లు పూర్తిచేశారు. మధ్యమధ్యలో వచ్చే స్టేషన్ల ప్లాట్‌ ఫాంల ఎత్తు పెంచడం, విస్తరించడం వంటి పనులూ చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా పాలకొల్లులో రైల్వే ప్లాట్‌ ఫాం పనులు, ప్లాట్‌ ఫాం మీదకు వచ్చేందుకు వంతెన నిర్మాణ పనులన్నీ గడిచిన కొంత కాలంగా నిలిచిపోయాయి. కార్మికుల కొరత కారణం గా పనులు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితే నిడదవోలు రైల్వే మార్గం పనుల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి లంకలకోడేరు వద్ద కార్మికులు, యంత్రాలు ఉండేందుకు తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేశారు. ఇప్పుడవన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తిరిగి కార్మికులు అనుకున్న సంఖ్యలో తిరిగి వస్తే తప్ప డబ్లింగ్‌ పనులు మొదలయ్యే అవకాశం లేదు.2021 మార్చి నాటికి  పనులన్నీ పూర్తిచేయాలన్న లక్ష్యం అంత సులభంగా నెరవేరేటట్టు కనిపిం చడం లేదు. అనుకున్న లక్ష్యం మేర పనులు పూర్తి చేసేందుకు మరో ఆరు నెలల గడువు పట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు కూడా అదే చెబుతున్నారు. 

Updated Date - 2020-08-07T11:52:55+05:30 IST