పరిహారం.. పలహారం!

ABN , First Publish Date - 2021-08-19T05:38:11+05:30 IST

అతివృష్టి, అనావృష్టి సమయాల్లో రైతులను ఆదుకునేందుకు అమలు చేసే పంటల బీమా పథకంలో జిల్లాలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయి.

పరిహారం.. పలహారం!
నీటిలో మునిగిన వరి ఓదెలు (పాచిత్రం)

బీమా సొమ్ము స్వాహా!

ఎంఏవోల లాగిన్‌తో అవకతవకలకు పాల్పడిన ఆర్‌బీకే సిబ్బంది!

ఒక్కో రైతుకు రెండు మూడు మండలాల్లో బీమా సొమ్ము జమ

గతంలో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన రైతులు

తాజాగా హోమంత్రికి ఫిర్యాదు.. 


                   (గుంటూరు - ఆంధ్రజ్యోతి)

 అతివృష్టి, అనావృష్టి సమయాల్లో రైతులను ఆదుకునేందుకు అమలు చేసే పంటల బీమా పథకంలో జిల్లాలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయి. పంటల బీమా పథకంలో బోగస్‌ లబ్ధిదారులు ఉన్నారని వట్టిచెరుకూరు మండలం రైతులు రెండువారాల కిందట కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.  అదేవిధంగా వ్యవసాయ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌కు సోమవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జేడీ విజయభారతి దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. జిల్లాలో సుమారు 30 మండలాల్లో అధికారులు, సిబ్బంది కుమ్మక్కు కావటంతో ఈ కుంభకోణం జరిగినట్లు జిల్లా అధికారులు తెలిపారు.


కుంభకోణం జరిగిందిలా..

ఆర్‌బీకేల్లో ఈ-పంటలో నమోదైన రైతుల జాబితాలపై వ్యవసాయశాఖ అధికారులు సామాజిక తనిఖీ చేయాలి. ఈ జాబితా సక్రమంగా ఉంటే దానిని నిర్ధారించి పంట బీమా సంస్థలకు పంపాలి. 2020-21 ఖరీఫ్‌లో మొదటి విడత జాబితాలను ఏవోల అనుమతితోనే పంపారు. రెండో విడతలో ఆర్‌బీకే సిబ్బంది ఈ-పంట నమోదు జాబితాను ఎంఏవోల అనుమతి లేకుండా నేరుగా బీమా కంపెనీలకు పంపినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఎంఏవోల లాగిన్‌ తెలిసిన ఆర్‌బీకే సిబ్బంది ఈ కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం.  ఇతర మండలాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల లాగిన్లు తెలుసుకొని, ఆ మండలాల్లోని భూముల సర్వేనంబర్లు, ఈ-పంట నమోదు జాబితాకు వట్టిచెరుకూరు, చేబ్రోలు, కాకుమాను మండలాల రైతుల ఆధార్‌, బ్యాంక్‌ఖాతా నంబర్లను లింక్‌ చేశారు. ఆ సర్వేనంబరు ఆధారంగా బీమా విడుదలైంది. ఆ డబ్బు లాగిన్‌లో లింకైన ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాలలో జమ అయింది. బోగస్‌ బీమా సొమ్ము పంపిణీలో తేడాలు రావటంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. జిల్లాలో జరిగిన ఈ కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 2020-21 ఖరీఫ్‌లో పంటల బీమా లబ్ధిదారుల జాబితాలపై దర్యాప్తు చేయాలని వ్యవసాయఖాఖ కమిషనర్‌ సీహెచ్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు. ఈ కుంభకోణంపై డీడీ మురళిని దర్యాప్తు అధికారిగా నియమించారు.


హోమంత్రి సుచరితకు ఫిర్యాదు 

వట్టిచెరుకూరు మండల రైతులు బుధవారం గుంటూరులో హోమంత్రి సుచరితను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీ విజయభారతిని ఆదేశించారు.   

 

దోషులను గుర్తిస్తాం.. 

2020-21 ఖరీఫ్‌లో పంటల బీమా సొమ్ము జమఅయిన రైతుల పేర్లను ఆర్‌బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. ఆ రైతులు ఆ గ్రామాల్లో ఉన్నారా..? భూమి సర్వే నంబరు ఎవరిపేరుతో ఉంది. పరిహారం ఎవరికి వచ్చింది అనే వివరాలు సేకరిస్తున్నాం. బ్యాంక్‌ ఖాతా ప్రకారం పరిహారం వచ్చిన రైతుల చిరునామాలు సేకరించి దోషులను గుర్తిస్తాం. 

 - విజయభారతి, వ్యవసాయ శాఖ జేడీ   


Updated Date - 2021-08-19T05:38:11+05:30 IST