భీం ఆర్మీ యూటర్న్.. అఖిలేష్‌కు మద్దతు ఉపసంహరణ

ABN , First Publish Date - 2022-01-15T17:05:33+05:30 IST

ఐకమత్యంలో పెద్ద బలం ఉంది. బీజేపీ మాయల పార్టీ. ఐకమత్యం సాధించకుండా ఆ పార్టీని ఎదుర్కోవడం చాలా కష్టం. సమస్త సమాజంలోని ప్రజల ప్రాతినిధ్యాన్ని గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి నాయకుడిపై ఉంది..

భీం ఆర్మీ యూటర్న్.. అఖిలేష్‌కు మద్దతు ఉపసంహరణ

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ఎత్తులు, పొత్తులు గంటల వ్యవధిలో మారుతున్నాయి. అఖిలేష్ యాదవ్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన భీం ఆర్మీ 24 గంటలకు గడవక ముందే యూటర్న్ తీసుకుంది. దళితులను అఖిలేష్ కేవలం ఓట్ బ్యాంక్‌గానే చూస్తున్నారని, వారిని ఎన్నికల బరిలోకి ఆహ్వానించడం లేదని భీంఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ శనివారం అన్నారు. దీనికి ముందు బీజేపీని ఓడించాలంటే ఐక్యత చాలా ముఖ్యమని, అందుకు అఖిలేష్‌ కూటమికి తాము మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.


శుక్రవారం చంద్రశేఖర్ ఆజాద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘ఐకమత్యంలో పెద్ద బలం ఉంది. బీజేపీ మాయల పార్టీ. ఐకమత్యం సాధించకుండా ఆ పార్టీని ఎదుర్కోవడం చాలా కష్టం. సమస్త సమాజంలోని ప్రజల ప్రాతినిధ్యాన్ని గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి నాయకుడిపై ఉంది. ఈ కూటమి బాధ్యతలను అఖిలేష్ నిర్వహించాలని దళిత సామాజిక వర్గం కోరుకుంటోంది’’ అని ట్వీట్ చేశారు.


కాగా, శనివారం ఉదయమే తన మద్దతును ఉపసంహరించుకున్నారు. కారణం, దళితులను అఖిలేష్ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆజాద్ విమర్శించారు. ‘‘ఆరు నెలలుగా అఖిలేష్ యాదవ్‌తో ఎన్నికల పొత్తు గురించి ఎదురుచూస్తున్నాను. అయితే అది మంచి ఫలితాలను ఇవ్వలేదు. వారు దళితుల నుంచి నాయకత్వాన్ని ఇష్ట పడడం లేదు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’’ అని చంద్రశేఖర్ అన్నారు.

Updated Date - 2022-01-15T17:05:33+05:30 IST