నిప్పు కణిక..

ABN , First Publish Date - 2020-10-30T10:54:22+05:30 IST

ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కోసం నిజాంకు వ్యతిరేకంగా సమర భేరి మోగించిన యోధుడు..

నిప్పు కణిక..

‘జల్‌-జంగల్‌-జమీన్‌’ నినాదంతో కుమరం భీం పోరాటం

నిజాంకు వ్యతిరేకంగా తుపాకి పట్టిన వీరుడు

రేపు భీం వర్ధంతి 


ఆసిఫాబాద్‌, అక్టోబరు29: ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కోసం నిజాంకు వ్యతిరేకంగా సమర భేరి మోగించిన యోధుడు.. నిజాం నిరంకుశ పాలనలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై ఎలుగెత్తిన వీరుడు.. జల్‌- జంగల్‌-జమీన్‌ (నీరు, అడవి, భూమి) హక్కుల కోసం చేసిన పోరాటంలో అమరుడైన వీరుడు కుమరం భీం. ఓ పక్క దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటం మహోద్యమంగా కొనసాగుతుంటే.. మరో పక్క తెలంగాణలో నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలపై తిరుగుబాట్లు జరుగుతున్న రోజులవి. ఈ రెండు ఉద్యమాలకు సమాంతరంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో కుమరం భీం నాయకత్వంలో గిరిజనుల స్వాతంత్య్ర పోరాటం కొనసాగింది. అక్టోబరు 31న కుమరం భీం వర్ధంతి సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం... 


ప్రతి యేటా ఆశ్వయుజ పౌర్ణమి రోజున కుమరం భీం  వర్ధంతిని నిర్వహిస్తున్నారు. శిస్తు(పన్నులు) పేరుతో ఆదివాసీలపై నిజాం అనుచరులు చేస్తున్న ఆగడాలను  సహించలేక సాయుధ పోరే సమస్యకు పరిష్కారమని నమ్మి 1940కి ముందే జోడేఘాట్‌ పోరాట గడ్డపై భీం తుపాకీ ఎక్కుపెట్టాడు. తనదైన గెరిల్లా వ్యూహాలతో నిజాం సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి నైజాం అల్లూరిగా నిజాం గుండెల్లో నిద్రపోయాడు. నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేయక ముందే జిల్లాలో కుమరం భీం తుపాకీ చేత పట్టి ఉద్యమానికి సిద్ధమయ్యాడు. జాగీరుదారుల అణచివేత, అత్యాచారాలు, ఆగడాలను తట్టుకోలేక తనతో కలిసి పెరిగిన అడవి బిడ్డలనే అనుచరులుగా మార్చుకుని వారికి సాయుధ శిక్షణ ఇవ్వడం ద్వారా నిజాం సైనికులను ఓడించినంత పని చేశారు. గిరిజనులు ప్రకృతి సంపదను అనుభవించకుండా అడవిలో కట్టెలు కొట్టకూడదని, పశువులు మేపకూడదని, భూములు దున్నకూడదని నిజాం ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని భీం సవాలు చేయడమే కాకుండా వారి ఆదేశాలను ధిక్కరించాడు.  


చిన్నతనం నుంచే తిరుగుబాటు 

భీం స్వగ్రామం ఆసిఫాబాద్‌ మండలం సంకెపల్లి గ్రామం. భీం తండ్రి తన బాల్యంలో మరణించడంతో పదిహేనవ యేట కుటుంబ, గ్రామ పెద్దగా బాధ్యతలు చేపట్టారు. నిజాం పోలీసుల, అటవీ అధికారుల ఆగడాలను సహించలేక పోయాడు. తన చిన్నతనంలో భీం సోదరులు అటవీ శాఖ సిబ్బందితో పడుతున్న గొడవలకు కారణాలను తెలుసుకున్నాడు. వారిని ఎదురించడం ప్రారంభించారు. ఇదే క్రమంలో అక్కడి సమకాలిక సమస్యలు, కారణాలపై అవగాహన పెంపొందించుకున్నాడు. శతాబ్దాలుగా తాము అనుభవిస్తున్న అటవీ, సహజ సంపదలపై నిజాం సర్కారు పన్నులు వసూలు చేయడం, ఈ నెపంతో చౌకీదార్లు, పట్వారీలు గోండు గూడేల పైబడి దోచుకోవడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం భీంను కలచి వేశాయి. దీంతో ఆయన స్థానికంగా ఉన్న జమీందార్లు, చౌకీదార్లపై నిజాం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్‌ వెళ్లాడు. కానీ నిజాం ప్రభువు అతడిని కలవక పోవడంతో ఇక్కడికి తిరిగి వచ్చి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పోరుబాట పట్టారు. 


గెరిల్లా దళం ఏర్పాటు 

ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాడేందుకు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో గిరిజన యువకుడిని చేరదీసి సైన్యాన్ని ఏర్పాటు చేశాడు కుమరం భీం. వెదురు కొట్టడం, విల్లంబులు, బాణాలు తయారు చేయడం వారికి నేర్పించాడు. నైజాం కాలంలో పట్టేదారులు గిరిజన మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడేవారు. ఈ క్రమంలో వారిపై కుమరం భీం దాడులు చేసేవాడు.  భూస్వామి సిద్దిక్‌తో గొడవకు దిగాడు. ఈ గొడవలో సిద్దిక్‌ తీవ్రంగా గాయపడడంతో ఈ వార్త నిజాం ప్రభువు చెవిన పడింది. దాంతో ఆగ్రోహోదగ్రుడైన నిజాం అసబ్‌జాహీ భీంను బంధించి తెమ్మంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారుల ఒత్తిడి మేరకు భీం అజ్ఞాత జీవితంలోకి వెళ్లారు. అక్కడ మొదలైన ఆయన ధిక్కార స్వరం అంతకంతకు పెరుగుతూ నిజాం అధికారాన్ని శాసించే స్థాయికి చేరడమే కాకుండా ఆదివాసీలందరిని ఐక్యం చేసి నిజాం పాలను అంతమొందించేందుకు ఆదివాసీ బిడ్డలను పోరాటం వైపు అగ్రపథాన ఉండి నడిపించారు. 


అనుచరుడి సమాచారంతో..

రజాకార్లు, దళారులు, వ్యాపారులు, అటవీ అధికారులపై కుమరం భీం పోరు సాగించాడు. గిరిజన గూడాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి జరుగుతున్న అన్యాయాలను వివరించి చైతన్యవంతులుగా చేశాడు.   గిరిజనులంతా ఒక్కటై కెరమెరి మండలంలోని జోడేఘాట్‌ కేంద్రంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అక్కడికి వచ్చే పోలీసులు, అటవీ అధికారులను బంధించేవారు. జోడేఘాట్‌ ప్రాంతంలోని 12 గ్రామ పంచాయతీల విముక్తి కోసం తీవ్రంగా సాయుధ పోరాటం సాగించిన భీం నిజాం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారాడు. ఆయన శక్తిని గ్రహించిన నిజాం సర్కారు మొదట దూతలతో రాజీ కోసం ప్రయత్నాలు చేసింది. కానీ భీం ఉక్కు సంకల్పం ముందు నిజాం పాచికలు పారలేదు. దాంతో నిజాం ప్రభువు భీంను అంతమొందించేందుకు ప్రత్యేక దళాన్ని హైదరాబాద్‌ నుంచి జోడేఘాట్‌కు పంపాడు.


అయితే ఆ ప్రయత్నం ఫలించక పోవడంతో కుట్ర చేసైనా కుమరం భీంను చంపాలని ఆయన సహచరులను ప్రలోభపెట్టారు. దీంతో కుమరం భీం అనుచరుడైన మడావి కొద్దు అనే వ్యక్తి 1940 అక్టోబరు6న ఇచ్చిన సమాచారం మేరకు నిజాం ప్రభుత్వం అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున సైనికులను మోహరించి భీం సైన్యం కోసం గాలింపులు చేపట్టింది. అర్ధరాత్రి నిజాం పోలీసులు భీంను చుట్టుముట్టి గుండ్ల వర్షం కురిపించారు. నిజాం పోలీసులను విరోచితంగా ఎదుర్కొని చివరకు మృత్యుదేవత ఒడిలో తుది శ్వాస విడిచారు. భీం నిజాం సైన్యం కాల్పుల్లో మరణించడంతో ఆయన అనుచరులు చెల్లాచెదరయ్యారు. 


2001 నుంచి కళ తప్పిన దర్బార్‌

2001లో జోడేఘాట్‌లో జరిగిన భీం వర్ధంతి దర్బార్‌లో అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సీహెచ్‌ విద్యాసాగర్‌రావు కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో దర్బార్‌లో బీజేపీ కార్యకర్తలు పార్టీ పరమైన నినాదాలు చేశారు. అప్పటి కలెక్టర్‌ రామకృష్ణారావు దర్బార్‌ను వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు. అంతేకాకుండా దర్బార్‌లో గిరిజన సంఘాల నాయకులు అధికారులను ఉద్దేశ్యపూర్వకంగా విమర్శించారని అధికారుల్లో అసహనం చోటు చేసుకుంది. రాజకీయ పార్టీల జోక్యంతో అసలు దర్బార్‌లే అవసరం లేదని అప్పటి ఐటీడీఏ పీవో సిసోడియా ప్రకటించారు. 


2002లో పేలిన మందుపాతర 

2002లో భీం వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు బాబేఝరి ఘాట్‌లో మందుపాతర పేల్చారు. దీంతో దర్బార్‌కు హాజరయ్యేందుకు వెళ్తున్న వ్యవసాయ శాఖ వాహనం మందుపాతరకు గురై బోల్తా పడింది. ఈఘటనలో వాహన డ్రైవర్‌ శంకర్‌ మృతి చెందగా, వ్యవసాయాధికారులు షహీద్‌, బాబురావులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జోడేఘాట్‌లో భీం దర్బార్‌ను నిర్వహించలేక ఉట్నూర్‌లో భీం వర్ధంతిని నిర్వహించారు. అప్పటి నుంచి అధికారులు హట్టి బేస్‌ క్యాంపులోనే కుమరం భీం వర్ధంతి ఉత్సవాలను చేపడుతూ వచ్చారు. దీంతో జోడేఘాట్‌ దర్బార్‌కు కళ తప్పింది. దశాబ్ద కాలం పాటు హట్టిలోనే భీం వర్ధంతి ఉత్సవాలను నిర్వహించగా ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన సంఘాల నాయకులు మాత్రమే జోడేఘాట్‌లో దర్బార్‌ను చేపడుతుండేవారు. 


తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి సారిగా 2014లో కుమరం భీం 74వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా చేపట్టగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. జోడేఘాట్‌ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన దర్బార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో పాటు రూ.25 కోట్లను మంజూరు చేశారు. దీంతో జోడేఘాట్‌ పర్యాటక కేంద్రంగా రూపు దిద్దుకుంది. ఇందులో భాగంగా శనివారం భీం 80వ వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-30T10:54:22+05:30 IST