భిక్షమెత్తి.. సొంతాస్తులన్నీ తెగనమ్మి..

ABN , First Publish Date - 2022-04-17T05:10:39+05:30 IST

ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది వావిలకొలను సుబ్బారావు.

భిక్షమెత్తి.. సొంతాస్తులన్నీ తెగనమ్మి..
వావిలకొలను సుబ్బారావు విగ్రహం

కోదండరామాలయాన్ని పునరుద్ధరణ చేసిన మహనీయుడు 

వావిలకొలను సుబ్బారావును మరిచిన టీటీడీ

రాజంపేట, ఏప్రిల్‌ 16:  ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది వావిలకొలను సుబ్బారావు. చిప్ప చేత పట్టుకుని ఊరూరా కాలినడకన తిరిగి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో కోదండరామాలయాన్ని సర్వాంగసుందరంగా పునర్‌ నిర్మించిన మహనీయుడు. తన ఆస్తులన్నింటినీ ఆనాడే తెగనమ్మి సర్వస్వం కోదండరాముడికి అర్పించిన త్యాగధనుడు. వాల్మీకీ రామాయణాన్ని 108 సార్లు ఆమూలాగ్రం పఠించి తెలుగులో రచించిన గొప్ప పండితుడు. అటువంటి మహనీయుని మనమందరం గుర్తుంచుకోవాల్సి ఉంది. ఆలయానికి పక్కన ఓ గుట్టపై ఓ చిన్నపాటి మందిరంలో వావిలకొలను సుబ్బారావు విగ్రహం ఉంది. గతంలో ఇక్కడ ఘనంగా ఆయన వేడుకలు నిర్వహించేవారు. బ్రహ్మోత్సవాల్లో ఆయనను కీర్తించేవారు. అయితే నేడు టీటీడీ ఆ విషయాన్నే మరిచింది. ప్రస్తుతం వావిలకొలను సుబ్బారావు మందిరాన్ని గానీ, ఆయన విగ్రహాన్ని గానీ పట్టించుకునే నాథుడే లేడు. అటువైపు వెళ్లేవారు కూడా లేరు. నేడు ఆంద్రా భద్రాద్రిగా గుర్తింపు పొందిన ఈ ఆలయం కోసం సర్వస్వం ధారపోసిన ఆ మహనీయుడి గురించి టీటీడీ పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కడప జిల్లా జమ్మలమడుగులో వావిలకొలను రామచంద్రరావు, కనకమ్మ దంపతులకు జన్మించారు వావిల కొలను సుబ్బారావు. ఎఫ్‌.ఏ వరకు చదివిన ఆయన ఆంగ్ల ఉపాధ్యాయుడిగా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఒకనాడు స్వప్నంలో ఇద్దరు భైరాగులు కనబడి ‘ఒంటిమిట్టకు రారాదా..’ అని వావిలకొలను సుబ్బారావును పిలిచారు. దీనిని రామాజ్ఞగా భావించిన ఆయన ఒంటిమిట్టకు పయనమయ్యారు. ముందు తనకున్న ఆస్తిని అమ్మి కోదండరాముడికి సమర్పించాడు. అనంతరం కోదండరామాలయ జీర్ణోద్ధరణ కోసం గోచీ ధరించి, టెంకాయ చిప్ప చేతపట్టి కాలినడకన ఊరూరా తిరిగాడు. భిక్షం రూపంలో వచ్చిన ధనాన్ని, తన శిష్యులు గురుదక్షిణగా సమర్పించిన వస్తు సామాగ్రిని, తన రచనల అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా ఆలయం కోసమే వినియోగించారు. శిథిలావస్థలో ఉన్న తూర్పు గాలిగోపురాన్ని ఆయన జీర్ణోద్ధరణ చేశారు. గోపురాలకు తలుపులు, గర్భాలయం, అంతరాలయంలో నేలను బాగు చేశారు. కోదండరామాలయానికి ఎదురుగా ఉన్న సంజీవరాయస్వామి దేవస్థానాన్ని పునరుద్ధరించారు. శ్రీరామ సేవా కుటీరం, రథశాల, శృంగిశైలం మీద వాల్మీకి ఆశ్రమాన్ని నిర్మించారు. ఇమామ్‌బేగ్‌ బావి, శ్రీరామతీర్థాన్ని పునరుద్ధరించారు. ఉత్సవమూర్తులకు వజ్రకిరీటాలు, వెండి పూజాసామాగ్రి, పలు బంగారు ఆభరణాలను చేయించారు. ఆ రోజుల్లోనే సుమారు 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. తమిళనాడు నుంచి పుష్పాలను, సరుకులను తెప్పించి శ్రీరామరాజ్య పట్టాభిషేకాన్ని 1934లోనే కనీవిని ఎరుగని రీతిలో నభుతో నభవిష్యతే అన్న రీతిలో నిర్వహించారు. ఈయన 1863 నుంచి 1936 వరకు జీవించారు.

ఆంధ్రా వాల్మీకిగా సేవలు 

వాల్మీకి రచించిన రామాయణాన్ని 108 సార్లు ఆమూలాగ్రం పఠించి దానిని తెలుగులో 1900వ సంవత్సరంలో రచించి ఆంధ్రావాల్మీకి బిరుదును పొందారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో 1908లో గ్రంధాంకిత సభలు నిర్వహించారు. ఆయన 25 సంవత్సరాల వయసులోనే మన్మద జన్మ వృత్తాంతాన్ని తెలిపే శ్రీకుమారాభ్యుదయ గ్రంథాన్ని రచించారు. కేవలం ఒక్క పూటలోనే శ్రీతల్పగిరి రంగనాయక శతకాన్ని చెప్పారు. ఆర్యనీతి, ఆర్యచరిత్ర రత్నావళి, హితచర్య మాళిక, సులభ వ్యాకరణం, సుభద్ర విజయం, విపదభగవద్గీత, తదితర గ్రంథాలను రచించారు. ఆంధ్రా వాల్మీకి రామాయణానికి మందరం అనే పేరుతో వ్యాఖ్యానాన్ని రచించి 1934లో బంగారు కలంతో పాటు కోదండరాముడికి అర్పించారు. వావిలకొలను సుబ్బారావు ఒంటిమిట్టలోనే వాసుదాస స్వామిగా మారారు. తన జీవితం మొత్తాన్నే జగదభిరాముడికి అర్పించిన మహనీయుడి గురించి టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 



Updated Date - 2022-04-17T05:10:39+05:30 IST