భీకరోనా

ABN , First Publish Date - 2020-07-14T06:29:19+05:30 IST

ఇప్పుడు మృతదేహమే మారణాస్త్రం! ఊపిరి ఆగిన కట్టె ప్రాణవాయువును హరించే కుట్రలో పాత్రధారి! మొన్నటి వరకూ మమతలు పంచుకున్న మనిషే...

భీకరోనా

ఇప్పుడు

మృతదేహమే మారణాస్త్రం!

ఊపిరి ఆగిన కట్టె ప్రాణవాయువును హరించే కుట్రలో పాత్రధారి!

మొన్నటి వరకూ మమతలు పంచుకున్న మనిషే 

శవంగా మారువేషం వేసిన యమదూత!

వైరస్ బలిగొందనే ప్రతి పీనుగా ఒంటరిగా కాక

వెంట పేరోలగాన్ని పట్టుకుపోయే 

క్రూర సామ్రాట్టు!

ప్రేతంలో పురుగులు పుట్టడానికి 

గంటలు పడుతుంది!

బతికున్న మెదళ్లను భయం దెయ్యం

నానో సెకన్లోనే పట్టుకుంటుంది!

కులకులలాడేంతమంది 

సుతులూ, జ్ఞాతులూ, సన్నిహితులూ ఉన్నా

వాళ్ళ భుజాలు పర్వతాల్ని మోసేంత 

దృఢంగా ఉన్నా

‘ఆ నలుగురికీ’ నోచని కట్టె..

వీధి కుక్క కళేబరంలా 

పొక్లెయిన్ కోరల్లో చిక్కుకుని

కాటికి పయనమవుతుంది!

జ్ఞానం, విజ్ఞానం, ఇంగితజ్ఞానాలే కాదు..

తరతరాల పరలోకగత 

పరమ పావన విశ్వాసాలూ

చిరుత తరుముతుంటే ఏనుగులా

భీతి ముందు పలాయనం చిత్తగిస్తాయి!

(‘‘పోనీ..పోనీ. పోతే పోనీ.. సతుల్, పతుల్, సుతుల్, భ్రాతల్, హితుల్, ఇరుగూ, పొరుగు, ఊరూ, వాడా పోతే పోనీ! నేను మాత్రం బతికుండాలి. లోకం సాంతం గాయపడితే నాకేం.. నా చర్మం మాత్రం సురక్షితంగా ఉండాలి. అదే జన్మ పరమార్థం’’ అనుకునే స్థాయికి ఆరుఖండాల్లోని మానవులనూ దిగజార్చింది కరోనా భీతి. మానవీయతకు ఇంతటి సంక్షోభం చరిత్రలో ఎన్నడూ ఎదురై ఉండదు. కులం, మతం, జాతి, సంస్కృతి, దేశం ఏవైనా.. యావన్మానవాళీ ఇంతగా ‘డీ హ్యూమనైజ్’ అయిన సందర్భం ఉండి ఉండదు. ‘‘ఈ కష్ట కాలంలోనూ ‘పరోపకారార్థం ఇదం జీవితం’ అని క్రియాత్మకంగా చెప్పిన వారు మిగిలే ఉన్నారన్నది నిజమే. కానీ వారి సంఖ్య జనసంద్రంలో నీటి బొట్టంత కూడా కాదన్నది కూడా నిజమే.)

విరాగి

99593 65373

Updated Date - 2020-07-14T06:29:19+05:30 IST