భవితకు భరోసా ఏదీ?

ABN , First Publish Date - 2022-05-07T05:30:00+05:30 IST

ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలలో బోధన ముందుకు సాగడం లేదు. సొంత భవనాలు, సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్యకు తగినంత బోధనా సిబ్బంది లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. దివ్యాంగ విద్యార్థులకు విద్యనందించడం కోసం కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్‌ పథకంలో నిధులను విడుదల చేస్తున్నది.

భవితకు భరోసా ఏదీ?
మాసాయిపేటలోని కేంద్రంలో విద్యార్థులకు బోధిస్తున్న ఐఈఆర్‌సీ

భవిత కేంద్రాల్లో సిబ్బంది, సౌకర్యాలు కరువు   

నాలుగు మండలాల్లో కేంద్రాలే లేవు 

జల్లా మొత్తానికి ముగ్గురే ఫిజియోథెరపిస్టులు   

నాలుగు కేంద్రాలకే సొంత భవనాలు 


మెదక్‌, మే 7 : ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలలో బోధన ముందుకు సాగడం లేదు. సొంత భవనాలు, సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్యకు తగినంత బోధనా సిబ్బంది లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. దివ్యాంగ విద్యార్థులకు విద్యనందించడం కోసం కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్‌ పథకంలో నిధులను విడుదల చేస్తున్నది. ఈ నిధులతో మండలాల్లో భవిత కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించడానికి అవసరమైన పరికరాలను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. వీరికి 19 సంవత్సరాల వయస్సు వరకు భవిత కేంద్రాల్లో విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో కేంద్రంలో ఇద్దరు సమ్మిళిత విద్యా బోధకులు (ఐఈఆర్‌సీ), ఒక సహాయకురాలిని నియమించాలని నిర్ణయించారు. కేంద్రాలకు రాలేని ప్రతీ నలుగురు పిల్లలకు ఐఈఆర్‌సీలు ఇంటి వద్దనే బోధించాల్సి ఉంటుంది. వైకల్యం కలిగిన పిల్లలకు ఫిజియోథెరపీ సేవలను కూడా అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెదక్‌ జిల్లాలో 18 భవిత కేంద్రాలు కొనసాగుతున్నాయి. 1,416 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 


లక్ష్యం బహుదూరం

జిల్లాలో భవిత కేంద్రాలు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి బోధన ముందుకు సాగడం లేదు. సౌకర్యాలలేమి ఐఈఆర్‌సీల కొరత కారణంగా లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో వెల్దుర్తి, కౌడిపల్లి, చిల్‌పచెడ్‌, శివ్వంపేట మండలాల్లో బోధకులు లేకపోవడంతో భవిత కేంద్రాలను అసలే తెరవలేదు. మిగిలిన మండలాల్లోనూ స్బిబంది కొరత వేధిస్తున్నది. పలుచోట్ల పోస్టులు భర్తీ కాకపోవడంతో ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు.  దీంతో సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. దివ్యాంగ విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడేలా చేయడంలో కీలకమైన ఫిజియోథెరఫి్‌స్టలు పూర్తిస్థాయిలో లేరు. జిల్లామొత్తంలో ముగ్గురు మాత్రమే సేవలందిస్తున్నారు. దీంతో విద్యార్థులకు మూడునాలుగు రోజులకోసారి ఫిజియోథెరపీ సేవలు అందుతున్నాయి. ఈ ప్రత్యేక పాఠశాలలకు భవనాలు కరువయ్యాయి. జిల్లావ్యాప్తంగా మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, పెద్దశంకరంపేటలో భవిత కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగిస్తున్నారు.


దివ్యాంగ విద్యార్థుల గుర్తింపునకు సర్వే :

డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు, భవిత కేంద్రాలు-జిల్లా విలీన విద్య కోఆర్డినేటర్‌ 

జిల్లాలో దివ్యాంగ విద్యార్థుల గుర్తింపునకు ఈ నెల 5 నుంచి 20 వరకు సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 56 నివాస ప్రాంతాల్లో  సర్వే పూర్తిచేశాం. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన విద్యనందించే ఉద్ధేశంతో భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో బోధకుల సంఖ్య తక్కువగా ఉన్నది. ఈ విషయం ప్రభుత్వానికి నివేదించాం. ప్రస్తుతానికి ఉన్నవారితో కొనసాగిస్తున్నాం.

Read more