Abn logo
Aug 29 2021 @ 03:17AM

పసిడి పట్టెయ్‌

నాకు అంగవైకల్యం ఉందని ఎప్పుడూ బాధపడలేదు. ఏదైనా సాధించవచ్చని ఆత్మవిశ్వాసం నాలో ఎప్పుడూ ఉండేది. ఈరోజు నేను అందుకున్న విజయంతో మేం ఎవ్వరికీ తీసిపోమని నిరూపించాం. చైనాపై గెలవడం కష్టమని అంతా అన్నారు. కానీ నేను ఆ దేశ క్రీడాకారిణిపై విజయం సాధించా.    

- భవినాబెన్‌ పటేల్‌

తిండి, నిద్ర లేకుండా..

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): భవినాబెన్‌కు టీటీ అంటే ప్రాణం. అది ఎంతగా అంటే ఆటకోసం ఒక్కోసారి కడుపునిండా తినేదికాదు..కంటి నిండా నిద్రపోయేదీ కాదు. ఏడాది వయస్సులోనే పోలియో సోకడం, ఆపై డాక్టర్లకు చూపినా వారి సూచనలు పాటించకపోవడం దరిమిలా ఆమె నడుము భాగం వరకు చచ్చుబడిపోయింది. అయితే తన వైకల్యానికి ఆమె బాధపడుతూ కూర్చోలేదు. ఏదో ఒకటి సాధించి దివ్యాంగులు కూడా సాధారణ వ్యక్తులకు ఏమాత్రం తీసిపోరని నిరూపించాలని దృఢంగా నిర్ణయించుకుంది. ఆ క్రమంలో అహ్మదాబాద్‌లోని ‘బ్లైండ్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌’కు రావడం, అక్కడ దివ్యాంగ బాలలు టీటీ ఆడడం చూసి ఆమె ఆ క్రీడపట్ల మొగ్గుచూపింది. ఆపై దానినే కెరీర్‌గా ఎంచుకుంది. ఎంతో సాధన చేసి ఢిల్లీలో జరిగిన క్లబ్‌ స్థాయి టోర్నీలో కాంస్య పతకం గెలవడంతో భవినా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇంకా కష్టపడితే టీటీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని గుర్తించింది. ఆ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఆమె తీవ్రంగా శ్రమించింది. ఆ క్రమంలో కొన్నిసార్లు తిండి, నిద్రను కూడా పక్కనపెట్టింది. ఆ ఫలితమే నేడు ఆమె పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే స్థాయికి చేరడం. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని సుంధియా గ్రామం భవినా స్వస్థలం. ఆమె తండ్రి హస్‌ముఖ్‌భాయ్‌ పటేల్‌ చిన్న వ్యాపారి. స్వస్థలం నుంచి అహ్మదాబాద్‌ చేరడం తన జీవితంలో ఊహించని మలుపుగా భవినా చెబుతుంది. ఆమె భర్త నికుల్‌ పటేల్‌ జూనియర్‌ స్థాయిలో క్రికెట్‌ ఆడడం విశేషం. 


పారాలింపిక్స్‌ టీటీ ఫైనల్లో భవినాబెన్‌

సెమీస్‌లో వరల్డ్‌ నెం.3పై గెలుపు 

 టాప్‌సీడ్‌తో తుదిపోరు నేడు 


టోక్యో: పారాలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినాబెన్‌ పటేల్‌ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరడం ద్వారా పతకం ఖాయం చేసి చరిత్ర సృష్టించిన 34 ఏళ్ల భవినా దానిని మరింత సమున్నతం చేసే దిశగా అడుగేసింది. ఫైనల్‌కు చేరడంద్వారా స్వర్ణ పతకానికి ఒక్క మ్యాచ్‌ దూరంలో నిలిచింది. ఇక.. ఆర్చరీలో రాకేశ్‌ కుమార్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించి పతక ఆశలు రేపాడు. 

భవినా..హోరాహోరీ..

శనివారం హోరాహోరీగా జరిగిన టీటీ మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 విభాగం సెమీ్‌సలో భవినాబెన్‌ 7-11, 11-7, 11-4, 9-11, 11-8 స్కోరుతో చైనాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్‌ జాంగ్‌ మియావోకు షాకిచ్చింది. తుదిపోరుకు చేరడంతో భవినాకు రజత పతకం ఖరారైంది. ఫైనల్లోనూ ఇదే స్థాయిలో సత్తా చాటితే ఆమెకు పసిడి పతకం దక్కడ ఖాయం. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాకే చెందిన వరల్డ్‌ నెం. 1, ఐదుసార్లు పారాలింపిక్స్‌ చాంపియన్‌ యింగ్‌ ఝౌతో భవినా తలపడనుంది. అద్భుత విజయం అందుకున్న భవినాబెన్‌ను దేశ ప్రధాని మోదీ సహా ప్రముఖులు అభినందించారు. 

రాకేశ్‌ పతకం దిశగా..:

వెటరన్‌ ఆర్చర్‌ రాకేశ్‌ కుమార్‌ పురుషుల కాంపౌండ్‌ ఓపెన్‌ కేటగిరి ఎలిమినేషన్‌ మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఐదురౌండ్ల పోరులో ఆది నుంచే ఆధిక్యం కనబరిచిన 36ఏళ్ల రాకేశ్‌ 144-131తో చున్‌ కా ఎన్‌గాయ్‌ (హాంకాంగ్‌)పై నెగ్గి ప్రీక్వార్టర్స్‌కు చేరాడు. మంగళవారం జరిగే తదుపరి రౌండ్‌లో 14వ సీడ్‌, స్లోవేకియా ఆర్చర్‌ మరియన్‌ మరెకాక్‌తో రాకేశ్‌ తలపడతాడు. ఇక పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌ పోటాపోటీ రౌండ్‌ 16లో 21వ సీడ్‌ శ్యామ్‌సుందర్‌ 139-142 స్కోరుతో లండన్‌ పారాలింపిక్స్‌ రజత పతక విజేత మ్యాట్‌ స్టుట్‌మన్‌ (అమెరికా) చేతిలో కొద్ది తేడాతో ఓడాడు. 

ప్చ్‌..భాటీ:

పురుషుల జావెలిన్‌ త్రోలో రంజీత్‌ భాటీ తీవ్రంగా నిరాశపరిచాడు. పురుషుల ఎఫ్‌-7 విభాగం ఫైనల్లో 24 ఏళ్ల భాటీ మొత్తం ఆరు ప్రయత్నాల్లోనూ విఫలమై పోటీలనుంచి వైదొలిగాడు. 

టోక్యోలో  భారత్‌ షెడ్యూల్‌ నేడు 

ఆర్చరీ (ఉ. 6.55 నుంచి) 

మహిళల కాంపౌండ్‌ ప్రీక్వార్టర్స్‌

జ్యోతి గీ కెర్రీ లూయిస్‌ (ఐర్లాండ్‌)

టీటీ సింగిల్స్‌ క్లాస్‌4 ఫైనల్‌ (ఉ. 7.15) 

భవినా పటేల్‌ గీ యింగ్‌ ఝౌ (చైనా)

పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌52 (మ. 3.50) వినోద్‌ కుమార్‌ 

పురుషుల హైజంప్‌ టీ47 (మ. 3.55) నిషద్‌ కుమార్‌, రామ్‌పాల్‌