Tokyo Paralympics: చరిత్ర సృష్టించిన భావినాబెన్ పటేల్.. పతకానికి అడుగు దూరంలో!

ABN , First Publish Date - 2021-08-27T23:02:17+05:30 IST

భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినాబెన్ పటేల్ టోక్యో పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. సెమీస్‌లోకి

Tokyo Paralympics: చరిత్ర సృష్టించిన భావినాబెన్ పటేల్.. పతకానికి అడుగు దూరంలో!

టోక్యో: భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినాబెన్ పటేల్ టోక్యో పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. సెమీస్‌లోకి దూసుకెళ్లి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. నేడు (శుక్రవారం) బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్‌లో 3-0తో తిరుగులేని విజయం సాధించిన భావినాబెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించింది. రౌండ్ ఆఫ్ 16లో ఒలివీరాను 12-10 13-11, 11-6తో ఓడించేందుకు భావినాబెన్‌కు 23 నిమిషాలు అవసరమయ్యాయి.  


ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. ప్రత్యర్థి రాంకోవిక్‌ను 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడించింది. ఫలితంగా భారత్‌కు తొలి పతకం అందించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. భావినాబెన్ తన తర్వాతి పోరులో చైనాకు చెందిన మియావో ఝాంగ్‌తో తలపడనుంది. మియావోను ఓడిస్తే భారత్‌కు పతకం ఖాయమైనట్టే.  

Updated Date - 2021-08-27T23:02:17+05:30 IST