Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 13 Jun 2022 00:17:21 IST

భావ ప్రధాన ప్రక్రియ ‘ఠుమ్రీ’

twitter-iconwatsapp-iconfb-icon
భావ ప్రధాన ప్రక్రియ ఠుమ్రీ

ఠుమ్రీ గాన శైలిలో ‘భావప్రదర్శన’ అతి ముఖ్యాంశం. అందుకే అది అభినయ ప్రధానమైన అష్టపదిలో ప్రధానంగా కనిపిస్తుంది. ఠుమ్రీల అభినయంలో ‘రాగవిస్తారం’ ఎక్కువగా కనిపించదు. రాగంలో నగిషీలకూ ప్రయత్నించదు. సాహిత్యంలోని భావానికే ప్రాధాన్యమిస్తుంది. ఠుమ్రీల అభినయంలో రాగతాళాల విన్యాసాల కంటే భావానికే ప్రాధాన్యం. నిజానికి నృత్యంలో భావాభినయానికి వాహకమే ఠుమ్రీ. అయితే క్రమంగా అది నృత్యపరిధిలో తగ్గి సంగీత పరిధిలో స్వతంత్రత పొందింది.


శృంగార నాయికా నాయకుల మధ్య ఎన్ని అనుభవాలను, భావాలను, మానసిక స్థితులను చిత్రించడానికి ఆస్కారం ఉన్నదో అన్నింటినీ జయదేవుడు గీత గోవిందంలో ్ఛ్ఠజ్చిఠట్ట చేసేశాడు. ఆ తర్వాత అభినయ ప్రధానమైన రచనా ప్రక్రియలను ఎవరు చేపట్టినా గీత గోవిందం ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. నాయక లక్షణాలు, నాయికా లక్షణాలు, రససిద్ధాంతం మొదలైన వాటన్నింటికీ లక్ష్యప్రబంధంగా జయ దేవుడు గీతగోవిందాన్ని సృష్టించాడు. సంగీతం, సాహిత్యం, అభినయం అనే మూడు కళల సంగమ ప్రక్రియగా ఆయన అష్టపదిని సృష్టించాడు. దక్షిణాన క్షేత్రయ్య పదాలకి, అనేక ఇతర వాగ్గేయకారుల పదాలకి మాదిరిగానే ఉత్తరాన ఠుమ్రీలకి కూడా ముడి పదార్థమంతా గీతగోవిందం నుంచే లభించింది. కొన్ని ఠుమ్రీలు రాధాకృష్ణుల ప్రేమను, శృంగారాన్ని వస్తువుగా గ్రహిస్తే మరికొన్ని రాధాకృష్ణుల పేర్లు లేకుండా సాధారణ నాయికా నాయకుల లౌకిక శృంగారాన్నే స్వీకరించాయి.


ఖ్యాల్‌లో విలంబితలయకు, ద్రుతలయకు వేర్వేరు రచనలు (బందిష్‌లు) -బడా ఖ్యాల్‌, ఛోటా ఖ్యాల్‌లు- ఉన్నట్లు ఠుమ్రీకి రెండు బందిష్‌లు ఉండవు. కాని, ప్రతి ఠుమ్రీలోనూ చివర నడక వేగవంతమవుతుంది. మధ్య లయ నుంచి ద్రుతలయకు మారుతుంది. ఠుమ్రీకి విలంబిత గతి ఉండదు. ఠుమ్రీలో స్వర విన్యాసాలకు సంబంధించిన స్వేచ్ఛ చాలా ఉంటుంది. అటువంటి విన్యాసాలకు అవకాశమిచ్చే రాగాలను మాత్రమే ఠుమ్రీ లకు స్వీకరిస్తారు. పీలూ, కాఫీ, ఖమాజ్‌, పహాడీ, తిలంగ్‌, దేశ్‌, జింఝాటీ, శివరంజని, భైరవి వంటి శృంగార రసప్రధాన రాగాలనే స్వీకరిస్తారు. వీటిని ఠుమ్రీఅంగ్‌ రాగా లంటారు. ఈ రాగాలను శాస్త్రోక్తంగా పాడకుండా సందర్భోచితంగా, భావానుగుణంగా అన్యస్వ రాలను కూడా ఉపయోగిస్తూ పాడతారు. అప్పుడు అవి మిశ్రపీలూ, మిశ్రకాఫీ, మిశ్రఖమాజ్‌ అవుతాయి.  


ఠుమ్రీకి స్వీకరించిన రాగాన్ని పూర్తిగా మధించిన తర్వాత చివరలో దానిని రాగమాలికగా కూడా మార్చుకోవచ్చు. అలా మార్చినప్పుడు గాయకుని, గాయకురాలి, లేదా నర్తకి ప్రతిభనిబట్టి ్ఛ్ఠ్ట్ఛఝఞౌట్ఛగా దాని పరిధిని ఎంతగానైనా విస్తరించుకోవచ్చు. అందుకే ఠుమ్రీకి అవధులు లేవు. ఠుమ్రీలో సద్యః స్ఫుర ణతో అన్యరాగ స్వరాలతో విన్యాసాలు చేసినా మళ్ళీ వెనక్కి ౌటజీజజీుఽ్చజూ రాగంలోకి తిరిగి వస్తారు. అన్యరాగాలను స్పృశించినప్పుడు ఠుమ్రీకి కొత్త అందాలు వస్తాయి. 


హిందూస్థానీ సంగీత రచనల్లో ఖ్యాల్‌కు సమానమైన స్థానం ఠుమ్రీకి ఉన్నది. ధ్రుపద్‌, ఖ్యాల్‌నుంచి సుగమ సంగీత రచనల వరకు అన్నింటి లక్షణాలను ఠుమ్రీ మేళవించు కున్నది. ధ్రుపద్‌తో దానికి గల చుట్టరికం వల్ల ‘హోరీ’ ఏర్పడింది. ధ్రుపద్‌-ధమ్మార్‌ సంప్ర దాయంలో ‘హోరీ’ని (హోలీగీతం) 14మాత్రల ధమ్మార్‌ తాళంలో పఖావజ్‌ పక్క వాద్యంతో ఘనంగా గానం చేస్తే, దాన్ని ఠుమ్రీలో 14 మాత్రల దీప్‌ చాందీ తాళంలో తబ్లా పక్క వాద్యంతో లలితంగా గానం చేస్తారు. దీన్ని ‘హోరీ ఠుమ్రీ’ అంటారు.


ఖ్యాల్‌తో చుట్టరికంవల్ల కొన్ని ఠుమ్రీలని శుద్ధరాగాలలో (అన్యరాగ స్వరాలను స్పృశిం చకుండా) గానం చేస్తారు. అప్పుడది ఇంచుమించు ఖ్యాల్‌లాగానే ఉంటుంది. వీటికి- ఖ్యాల్‌ బందిష్‌లకు ఉపయోగించే-ఏక్‌ తాల్‌, ఠుంప్‌ తాల్‌ ఉపయోగిస్తారు. ఖ్యాల్‌లో మాదిరిగా మధ్య మధ్య చిన్న చిన్న తానాలు కూడా గానం చేస్తారు. ఇవి కాక, ఉత్తర ప్రదేశ్‌ లలిత సంగీత రచనలైన చైతీ, సావన్‌, కజరీ, హోలీ, ఝూలన్‌ వంటి వాటి లక్షణాలను కూడా ఠుమ్రీ మేళవించుకుంటుంది. ఇన్ని లక్షణాలతో ఠుమ్రీ రూపుదిద్దుకు న్నది 19వ శతాబ్దంలోనే. 17వ శతాబ్ది ద్వితీయార్ధం నాటికే ఠుమ్రీ అనేది ఉన్నప్పటికీ దాని స్వరూపం ఎలా ఉండేదో మనకు తెలియదు.


ఠుమ్రీకి ఉండే వైవిధ్యం, గానంలో దానికి ఉండే స్వేచ్ఛ ఎలాంటిదంటే-ఖ్యాల్‌ గాయ కులు దాన్ని శాస్త్రీయంగా పాడతారు. కరీంఖాన్‌, హీరాబాయ్‌ బరోడేకర్‌, ఫయ్యాజ్‌ ఖాన్‌, బడే గులాం అలీఖాన్‌, భీమ్‌సేన్‌ జోషీ, నజాకత్‌ అలీ, సలామత్‌ అలీ సోదరులు అలా పాడేవారు. బడే గులాం అలీ తమ్ముడు బర్కత్‌ అలీఖాన్‌-ఖ్యాల్‌ శైలిలో కాకుండా పూర్తి ఠుమ్రీశైలిలోనే సాహిత్యం అర్థమయ్యేట్లు పాడేవాడు.


ఖ్యాల్‌ ఉస్తాదుల ప్రవేశానికి ముందు- బహిరంగ వేదికలపై కాకుండా వృత్తి రీత్యా ‘కోఠా’లలో రసికులను రంజింపజేసే స్త్రీలు ఠుమ్రీలను గానం చేసేవారు. తర్వాత క్రమంగా వారు కూడా గానసభా మందిరాల్లో ఠుమ్రీ కచేరీలు చేయడం మొదలుపెట్టారు. ఇటు వంటి వారిలో గొప్పపేరు తెచ్చుకొని పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డులు పొందిన వారు సిద్ధేశ్వరీదేవి, బేగం అఖ్తర్‌, రసూలన్‌ బాయ్‌, బడీమోతీబాయ్‌, గిరిజాదేవి. 


అసలు ఠుమ్రీ అనేది నృత్యానికి ఉద్దేశించిన ప్రక్రియ అంటూ రాజాస్థానాలలో ప్రదర్శనలు ఇచ్చిన వారు బిందాదీన్‌ మహరాజ్‌, కాల్కామహరాజ్‌, అచ్చన్‌ మహారాజ్‌, లచ్చూ మహారాజ్‌, శంభూ మహరాజ్‌ సోదరులు.


ఠుమ్రీ-వైష్ణవ భక్తి తత్వం

వైష్ణవ భక్తి సంప్రదాయం, రాధాకృష్ణ ప్రేమతత్వం, మధుర భక్తి-ఇవి ఠుమ్రీకి మూలాలు. హరిదాస్‌, సూరదాస్‌, మీరాబాయ్‌, వల్లభాచార్య, చైతన్య మహాప్రభు, విద్యాపతి మొద లైనవారి భక్తితత్వం నుంచి, వారి భజన్‌, కీర్తన్‌ రచనల నుంచి, వారి గాన శైలి నుంచి, నర్తనం నుంచి ఠుమ్రీ పుట్టిందనుకోవచ్చు. బెంగాల్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాలలో వైష్ణవం ప్రచారమయింది 17, 18 శతాబ్దాలలో. కాని, ఇప్పుడు మనం వింటున్న ఠుమ్రీకి ఒక స్పష్టమైన ఆకృతి లభించింది 19వ శతాబ్దంలోనే. ముఖ్యంగా అవధ్‌ (అయోధ్య)ను పాలించిన నవాబ్‌ వజీద్‌ అలీషా దీనికి రూపకల్పన చేశాడు, ప్రోత్సహించాడు.


రాజాస్థానాల్లో గానం చేసే ఉస్తాద్‌లు గానం కోసం, కథక్‌ గురువులు నృత్యం కోసం ఠుమ్రీలు సృష్టించారు. ‘కదర్‌ పియా’, ‘లలన్‌ పియా’, ‘దరస్‌ పియా’, ‘సనత్‌’ వంటి కలం పేర్లతో ఉస్తాదులు ఠుమ్రీలు సృష్టించారు. ఆగ్రా ఘరానా మహాగాయకుడు ఫయ్యాజ్‌ ఖాన్‌ ‘ప్రేమ్‌ పియా’ ముద్రతో, పటియాలా ఘరానా మహాగాయకుడు బడే గులాం అలీఖాన్‌ ‘సబ్‌ రంగ్‌’ ముద్రతో ఠుమ్రీలు రచించి తమ కచేరీలలో గానం చేశారు. ప్రత్యేకంగా కథక్‌ నృత్యంకోసం ఠుమ్రీలు రచించి, అభినయించిన గొప్ప నాట్యాచార్యులు బిందా దీన్‌ మహారాజ్‌, కాల్కా మహారాజ్‌. కథక్‌ ఠుమ్రీలు ఎక్కువగా రాధాకృష్ణ శృంగా రానికి సంబంధించినవి. ముస్లిమ్‌ ఉస్తాదుల ఠుమ్రీలు ఎక్కువగా లౌకిక శృంగారానికి సంబంధించినవి. వారిలో కొందరు రాధాకృష్ణ శృంగారపరంగా కూడా రచించారు. వైష్ణవ భక్తి ఆకర్షణ నుంచి వారు కూడా తప్పించుకోలేకపోయారు. వజీద్‌ అలీషా వసంతోత్సవం, హోలీ వేడుకలు, రాసలీల వైభవంగా జరిపించేవాడు. ఇంకా పూర్వం అక్బర్‌ కూడా తన అంతఃపురంలో అటువంటి ఉత్సవాలు జరిపించేవాడు. ఆయన రాణి జోధాబాయ్‌ రాజ పుత్రస్త్రీ కదా! ఆ సంప్రదాయాన్ని మొగల్‌ చక్రవర్తులందరూ సామ్రాజ్యం అంతరించేవరకు కొనసాగిస్తూనే వచ్చారు (బహుశా ఔరంగజేబ్‌ తప్ప). షాజహాన్‌, మహమ్మద్‌ షా రంగీలా, బహదూర్‌ షా గొప్ప సంగీత ప్రియులు, పోషకులు. అసలు చాలామంది ఉస్తాదులు ఇస్లాంలోకి మారిన హిందువులు. సంగీత సమ్రాట్‌ తాన్‌సేన్‌ కూడా అలా మారినవాడే.


ముస్లిం ప్రభువులు హిందూ రాజ్యాలపై దండయాత్రలు జరిపినప్పుడు ధనకనక వస్తువాహనాలతోపాటు గొప్ప అందగత్తెలైన స్త్రీలను, నర్తకీ నర్తకులను, గాయనీ గాయ కులను కూడా పట్టుకుపోయేవారు. అలావెళ్ళిన కళాకారులు ముస్లిములుగా మారిపో యారు. అయినా పూర్వ సంప్రదాయాల పట్ల వారి మమకారం, అభిమానం పోదు. అందుకే వారి బందిష్‌లలో రాధాకృష్ణ ప్రేమతత్వం కనిపిస్తుంది.

నండూరి పార్థసారథి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.