అదే గ్రహస్థితి!

ABN , First Publish Date - 2020-06-19T05:30:00+05:30 IST

‘దైవం’, ‘విధి’ అనే వాటికి మన సంస్కృతిలో ప్రాధాన్యం ఎక్కువే ఉంది. మన చేసిన ప్రయత్నం బెడిసికొడితే అవతలి శక్తులు, అదృశ్య శక్తులూ ఎవో పనిచేశాయని అనుకోవాలి...

అదే గ్రహస్థితి!

‘దైవం’, ‘విధి’ అనే వాటికి మన సంస్కృతిలో ప్రాధాన్యం ఎక్కువే ఉంది. మన చేసిన ప్రయత్నం బెడిసికొడితే అవతలి శక్తులు, అదృశ్య శక్తులూ ఎవో పనిచేశాయని అనుకోవాలి. ఎందుకంటే అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని అగవు కొన్ని! దానికి ఉదాహరణను భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణ కవి పద్యం ద్వారా తెలుసుకుందాం. 


  • రాతిరి మూషికంబు వివరం బొనరించి కరండ బద్ధమై
  • భీతిలి చిక్కి యాసచెడి పెద్దయు డస్సిన పామువాత సం
  • పాతము జెందె దాని దిని పాము దొలంగె బిలంబుత్రోవనే 
  • యేతరి హాని వృద్ధులకు నెక్కటి దైవమ కారణంబగున్‌


ఒక ఇంట్లో ఎలుక ఓ పెట్టెకు కన్నం పెట్టింది. అందులో ఏదో ఉందని ఆశతో కన్నం చేసింది. తీరా లోపలికి వెళ్లాక ఏ రకమైన ధాన్యాలు లేకపోగా పెద్ద పాము ఉంది. ఆ పాము పరిస్థితి ఎలా ఉందంటే... ఆహారం లేక బాగా నీరసించిపోయి ఉంది. ఇక చావు తప్పదనే నిరాశతో పాము ఉంది. కన్నం చేసి లోపలకి వెళితే తినడానికి ఏదైనా దొరుకుతుందనే ఆశతో ఎలుక వెళ్లింది. ఎలుక లోపలికి వెళ్లగానే పాము తినేసింది. పైగా పాముకు ఇంకో అవకాశం దొరికింది. ఎలుక చేసిన కన్నం గుండా బయటకు వచ్చేసింది. ఇలా ఎందుకు జరిగిందో ఆలోచించండి?


పురుష ప్రయత్నానికి, కర్మకు ఉండే సంబంధం అర్థమవుతుంది. ఎక్కడ పురుష ప్రయత్నం ప్రధానం? ఎక్కడ గ్రహస్థితికి వదిలేయాలి? గ్రహస్థితి అనేది ఫలించే వరకూ మనకు తెలియదు కాబట్టి చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం ప్రయత్నం చేసినా ఫలించకపోవచ్చు. ఫలించకపోగా ఎలుకకు జరిగినట్టుగా వికటించనూ వచ్చు. అప్పుడు దైవానికి వదిలేయాలి. గ్రహస్థితి అనుకోవాలి. దీనికి భారతంలో మంచి ఉదాహరణ ఉంది.

సాత్యకికీ, భూరిశ్రవసుడికీ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఒక దశలో సాత్యకిని భూరిశ్రవసుడు కింద పడేసి, అతని గుండెలపై కాలుపెట్టి, కత్తి తీసి నరికేయబోయాడు. క్షణంలో సాత్యకి పని అయిపోయేది. కానీ అది చూసిన కృష్ణుడు ‘భూరిశ్రవసుడిని హతమార్చు’ అని అర్జునుడికి చెప్పాడు. అర్జునుడి బాణం దెబ్బకు భూరిశ్రవసుడి చేయి భుజం వరకు తెగి కిందపడిపోయింది. అప్పుడు భూరిశ్రవసుడు ‘‘అర్జునా! నువ్వు అధర్మ యుద్ధం చేస్తున్నావు’’ అన్నాడు. అప్పుడు అర్జునుడు తనది ఏరకంగా ధర్మ యుద్ధమో చెబుతున్నాడు. ఈ వాదన జరుగుతున్న సమయంలోనే కిందపడిన సాత్యకి లేచి భూరిశ్రవసుడిని నరికేశాడు. ఏం జరిగిందో గమనించండి. ఎవరి చేతుల్లో ఎవరు పోవాలి? కానీ ఎవరు పోయారు? దీన్ని ‘గ్రహస్థితి’ అంటారు. వీళ్ల మధ్య యుద్ధానికి గ్రహస్థితి కారణంగా ఉంది. సాత్యకి తాత శని. భూరిశ్రవసుడి తండ్రి సోమదత్తుడు.  దేవకీ స్వయంవరానికి శని, సోమదత్తుడు వెళ్లారు. కృష్ణుడి తల్లి, వసుదేవుడి భార్య దేవకి. ఆమెను తీసుకు వెళ్లి వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేయాలని శని ప్రయత్నం చేశాడు. కానీ సోమదత్తుడు తాను చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు శని బలవంతంగా దేవకిని రథం ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అడ్డొచ్చిన సోమదత్తుడిని ఓడించాడు. శని చేతుల్లో ఓడిపోయిన సోమదత్తుడు శివుడి వరం కోసం భయంకరమైన తపస్సు చేశాడు. ఎలాగైనా సరే శనిని చంపాలని! కానీ సోమదత్తుడికి తెలియదు తపస్సులోనే యాభై ఏళ్లు గడిచిపోయాయని. అప్పటికే శని చనిపోయాడు. ఆ విషయాన్ని శివుడు చెప్పాడు. అయితే శని కొడుకునైనా చంపే వరమైనా ఇవ్వమని అడిగాడు. ‘‘ఆయన కొడుకును చంపడం నీవల్ల కాదు గానీ, నీకొక్క వరం ఇస్తాను. నీ కుమారుడు, ఆయన మనవడిని ఒక్క క్షణం ఓడించగలుగుతాడు. ఆ వరం నేనిస్తున్నా’’ అన్నాడు శివుడు. ఎప్పుడో సోమదత్తుడికి శివుడిచ్చిన వరం కారణంగా  భూరిశ్రవసుడికి సాత్యకి చిక్కాడు. అంతే తప్ప ఆయన చేతుల్లో చనిపోలేదు. పైగా సాత్యకి చేతుల్లోనే భూరిశ్రవసుడు చనిపోయాడు. ఇది ‘గ్రహస్థితి’. 

-గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-06-19T05:30:00+05:30 IST