భరోసా కాదు.. మొండిచెయ్యి..!

ABN , First Publish Date - 2021-06-20T05:43:07+05:30 IST

వృద్ధులకు భరోసానందిస్తామని పదేపదే ఆర్భాట ప్రచారాలు చేసిన వైసీపీ పాలకులు చివరకు మొండిచెయ్యి చూపిస్తున్నారని పండుటాకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు సక్రమంగా అందడం లేదని పలువురు మండిపడుతున్నారు. దరఖాస్తు పెట్టుకున్న వెంటనే పింఛన్‌ ఇస్తామని చెప్తున్న మాటలు అబద్ధాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భరోసా కాదు.. మొండిచెయ్యి..!
బేస్తవారపేట కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వృద్ధులు

  పింఛన్‌ అందక పస్తులుంటున్న పండుటాకులు

కంప్యూటర్‌లో అర్హులుగా పేర్లు

అయినా అందని పెన్షన్‌ సాయం

సచివాలయాల చుట్టూ 

కాళ్లరిగేలా తిరుగుతున్న వృద్ధులు

బేస్తవారపేట, జూన్‌ 19 : వృద్ధులకు భరోసానందిస్తామని పదేపదే ఆర్భాట ప్రచారాలు చేసిన వైసీపీ పాలకులు చివరకు మొండిచెయ్యి చూపిస్తున్నారని పండుటాకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు సక్రమంగా అందడం లేదని పలువురు మండిపడుతున్నారు. దరఖాస్తు పెట్టుకున్న వెంటనే పింఛన్‌ ఇస్తామని చెప్తున్న మాటలు అబద్ధాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారే తప్ప అక్కడ ప్రజలకు సక్రమంగా సేవలందడం లేదని అంటున్నారు. గతంలో పింఛన్‌ అందుకొన్న 200లకుపైగా అర్హులైన వృద్ధులకు నేడు డబ్బులు అందడం లేదు. దీంతో సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ దరఖాస్తులు ఇస్తున్నా పింఛన్‌ ఇవ్వడం లేదు. మరోపక్క మండల, జిల్లా అధికారులకు రాతపూర్వకంగా విజ్ఞాపన పత్రాలను అందజేసినా ఫలితం లేదు. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ శుక్రవారం సలకలవీడు గ్రామానికి చెందిన కదిరి గరటయ్య, కదిరి వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బారెడ్డి, కె.వెంకటేశ్వర్లు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.  65 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయస్సు ఉన్న అనేకమంది వృద్ధులు పెన్షన్‌కు నోచుకోవడం లేదని వారు తెలిపారు.

  

మంజూరైనా డబ్బులివ్వడం లేదు

గతేడాది వైఎస్సార్‌ పింఛన్‌ కానుక అంటూ వృద్ధులందరితో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అర్హులందరికీ పెన్షన్‌ కార్డులను అందజేశారు. అనంతరం రెండు నెలలపాటు పింఛన్‌ కూడా ఇచ్చారు. తర్వాత నెల నుంచి వారందరికీ పింఛన్‌ను నిలిపివేశారు. దీంతో వారంతా పస్తులతో రోజులు వెళ్లదీస్తున్నారు. ఎందుకు పింఛన్‌ రావడం లేదో తెలియని వృద్ధులు కాళ్లరిగేలా రోజూ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. కంప్యూటర్‌లో మీకు పింఛన్‌ వస్తున్నట్లు చూపిస్తోందని, కానీ డబ్బులు రావడం లేదని సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. జిల్లా అధికారులను సంప్రదించాలని చెప్పడంతో వృద్ధులు అనేకసార్లు ఎంపీడీవో, జిల్లా అధికారులకు సైతం వినతిపత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేకపోయిందని వారు విలపిస్తున్నారు. 


గతేడాది ఎంపీడీఓ తొలగించారు

మండంలోని సలకలవీడు, గలిజేరుగుళ్ల, పూసలపాడు, మోక్షగుండం, బసినేనిపల్లె గ్రామ పంచాయతీలలో పింఛన్‌ కార్డులు పొంది నేడు డబ్బులు అందని వృద్ధులు 200మందికి పైనే ఉన్నారు. ఈ విషయమై సలకలవీడు సచివాలయ కార్యదర్శి సురే్‌షను ఆంధ్రజ్యోతి వివరణ కోరింది. సలకలవీడు గ్రామ పంచాయతీలో ఎనిమిది మంది వృద్ధులకు పింఛన్‌ రావడం లేదని, గతేడాది వయస్సు తక్కువగా ఉన్న వారి పేర్లను గత ఎంపీడీవో తొలగించారని తెలిపారు. ప్రస్తుతం వారందరూ అర్హులైనప్పటికీ పింఛన్‌ రావడం లేదని, కంప్యూటర్‌లో పింఛన్‌ మంజూరైనట్లు చూపిస్తుందని కార్యదర్శి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కాగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీఓ చెన్నకేశవరెడ్డి తెలిపారు.


Updated Date - 2021-06-20T05:43:07+05:30 IST