యువశక్తిదే భారత్‌

ABN , First Publish Date - 2022-01-29T08:31:17+05:30 IST

యువశక్తిదే భారత్‌

యువశక్తిదే భారత్‌

 ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జనవరి 28: జాతి ప్రయోజనాలే లక్ష్యంగా యువత పని చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ స్ఫూర్తితో పని చేసే యువత ఉన్న దేశాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. స్టార్ట్‌పల నుంచి క్రీడల దాకా భారత యువత అద్భుతంగా రాణిస్తోందని ప్రశంసించారు. శుక్రవారం ఢిల్లీలోని కరియప్ప మైదానంలో నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సీసీ) నిర్వహించిన గణతంత్ర దినోత్సవ క్యాంపు ముగింపు ర్యాలీకి ప్రధాని హాజరై మాట్లాడారు. తాను కూడా ఎన్‌సీసీ శిక్షణ పొందానని, తన బాధ్యతల నిర్వహణలో అవసరమైన సామర్థ్యం ఈ శిక్షణ ద్వారా లభించిందని మోదీ తెలిపారు. ఇటీవలే ఎన్‌సీసీ పూర్వ విద్యార్థి కార్డు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. గత రెండేళ్లలో లక్ష మందికి పైగా ఎన్‌సీసీ క్యాడెట్లను దేశ సరిహద్దు ప్రాంతాల్లో నియమించామని తెలిపారు. బలగాల్లో మహిళలకు పలు బాధ్యతలు అప్పగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్‌సీసీ క్యాడెట్లు తమ క్యాంప్‌సల దరిదాపుల్లోకి కూడా డ్రగ్స్‌ రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. బయట కూడా డ్రగ్స్‌ బానిసలను దాని నుంచి బయటపడేందుకు సహాయపడాలని సూచించారు. ఇక ఆధునిక సాంకేతిక యుగంలో దుష్ప్రచారాలు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదాలు ఉంటాయని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్‌సీసీ సభ్యులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని అన్నారు. దీంతోపాటు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ‘లోకల్‌ ఫర్‌ వోకల్‌’ కార్యక్రమంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. స్థానికంగా ఉత్పత్తులు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎన్‌సీసీ ర్యాలీకి హాజరైన ప్రధాని మోదీ.. సిక్కు తలపాగాతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముదురు ఆకుపచ్చ తలపాగాకు ఎరుపు రంగు పక్షి ఈకను ధరించారు.

Updated Date - 2022-01-29T08:31:17+05:30 IST