రూ.1627.83 కోట్లతో భారత్‌నెట్‌ పథకం

ABN , First Publish Date - 2022-06-10T13:19:54+05:30 IST

రాష్ట్రంలో రూ.1627.83 కోట్ల వ్యయంతో భారత్‌నెట్‌ పథకం అమలుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ గురువారం శ్రీకారం చుట్టారు. ఈ పథకం అమల్లో భాగంగా

రూ.1627.83 కోట్లతో భారత్‌నెట్‌ పథకం

- ప్రారంభించిన సీఎం స్టాలిన్‌ 

- 12,525 పంచాయతీల్లో హైస్పీడ్‌ నెట్‌


చెన్నై, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.1627.83 కోట్ల వ్యయంతో భారత్‌నెట్‌ పథకం అమలుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ గురువారం శ్రీకారం చుట్టారు. ఈ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కన్నియాకుమారి జిల్లా ముత్తలకురిచ్చి గ్రామపంచాయతీలో ఫైబర్‌నెట్‌ కేబుళ్ళను ఏర్పాటు చేసే పనులను సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. భారత్‌నెట్‌ పథకం ద్వారా రాష్ట్రంలోని 12525 గ్రామపంచాయతీలను ఫైబర్‌నెట్‌ కేబుళ్ల ద్వారా అనుసంధానం చేసి, అత్యంత వేగంగా పనిచేసే ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ గ్రామపంచాయతీల్లో భారత్‌నెట్‌ పథకం ప్రకారం 1జీబీపీఎస్‌ పరిమాణంతో ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని అందజేస్తారు. ఏబీసీడీ అనే నాలుగు కేటగిరీలుగా విభజించి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఆ మేరకు ఏ కేటగిరీలో కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు, కృష్ణగిరి, చెంగల్పట్టు, చెన్నై, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాలకు, బీ కేటగిరిలో కడలూరు, అరియలూరు, పెరంబలూరు, ధర్మపురి, కళ్లకుర్చి, సేలం, ఈరోడ్‌, నీలగిరి, విల్లుపురం జిల్లాలకు, సీ కేటగిరీలో నాగపట్టినం, తంజావూరు, తిరువారూరు, పుదుకోట, నామక్కల్‌, కరూరు, కోయంబత్తూరు, తిరుప్పూరు, తిరుచ్చి, మైలాడుదురై జిల్లాలకు డీ కేటగిరీలో కన్నియాకుమారి, మదురై, రామనాఽథపురం తేని, తూత్తుకుడి, తిరునల్వేలి, విరుదనగర్‌, తెన్‌కాశి, దిండుగల్‌, శివగంగ జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరింపజేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రజలకు తక్కువ ఛార్జీలతో డిజిటల్‌ సేవలు, ఈ ఎడ్యుకేషన్‌, టెలీ మెడిసిన్‌ సేవలు లభిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, పారిశ్రామిక సంస్థలు హైస్పీడ్‌ నెట్‌ సదుపాయం పొందనుండటంతో ప్రభుత్వ పథకాల ఫలాలు లబ్ధిదారులకు వీలైనంత త్వరగా అందుతాయి. ఈ కార్యక్రమంలో సమాచార సాంకేతిక శాఖ మంత్రి డి.మనోతంగరాజ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీ ఇరై అన్బు, సమాచార సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌, రాష్ట్ర ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏకే కమల్‌ కిశోర్‌, ప్రధాన సాంకేతిక విభాగం అధికారి ఏ రాబర్ట్‌ జెరాల్డ్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-10T13:19:54+05:30 IST