నేడు భారత్ బంద్.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-05-25T17:39:43+05:30 IST

కుల ఆధారిత జనగణనకు డిమాండ్ చేస్తూ బీఏఎంసీఈఎఫ్(ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్) నేడు(బుధవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

నేడు భారత్ బంద్.. కారణం ఇదే..

న్యూఢిల్లీ: కుల ఆధారిత జనగణనకు డిమాండ్ చేస్తూ బీఏఎంసీఈఎఫ్(ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్) నేడు(బుధవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఓబీసీల అభివృద్ధికి అవసరమైన కుల ఆధారిత జనాభా లెక్కలకు మొగ్గుచూపని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ బంద్  చేపడుతున్నట్టు ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రైవేటు రంగంలో కూడా ఎస్ సీ, ఎస్ టీ, ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని బీఏఎంసీఈఎఫ్ స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, ఎన్ ఆర్ సీ(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్), సీఏఏ(సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్), ఎన్ పీఆర్(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్)లను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో జరిగే పంచాయత్ ఎన్నికల్లో ఓబీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని, వృద్ధాప్య పెన్షన్ స్కీమ్, కార్మికుల హక్కుల రక్షణ, గిరిజనులు వలస వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మరోవైపు రైతులకు కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 


కాగా దేశంలో కుల ఆధారిత జనగణన జరగాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. బీజేపీ మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్ పార్టీ కూడా ఈ జాబితాలో ఉంది. సమాజంలో వేర్వేరు వర్గాల అభివృద్ధికి కుల ఆధారిత జనగణన దోహదపడుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెబుతున్నారు. ఈ విధానాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని, సరైన విధానంలో అమలు చేస్తామని ఇటివలే ఆయన వాగ్దానం చేసిన చేశారు. కాగా ఎస్ సీ, ఎస్టీలు మినహా జనాభా లెక్కల్లో ఇతర కులాల జనగణన చేపట్టకూడదని విధానపరంగా నిర్ణయించినట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఇటివలే స్పష్టం చేశారు. లోక్ సభ ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Updated Date - 2022-05-25T17:39:43+05:30 IST