- రాష్ట్రంలో మండుతున్న సూరీడు..
- ఆదిలాబాద్ జిల్లా కరిమెరిలో అత్యధికంగా 43.9 డిగ్రీలు
- రాబోయే నాలుగు రోజులు ఇదే పరిస్థితి
- కలెక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు
- పాఠశాలల వేళలు తగ్గించాలని సూచన
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, ఆదిలాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికమవుతున్నా యి. బుధవారం సూర్యుడు ప్రతాపం చూపెట్టగా.. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఏప్రిల్ ఒకటి, రెండు తేదీల్లో రాష్ట్రంలోని ఉత్తర, వా యువ్య జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదముందని పేర్కొంది. కాగా, రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరిమెరిలో బుధవారం అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవ్వగా చప్రాలా, జైనఽథ్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. హైదరాబాద్‌లో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వగా సాధారణంతో పోలిస్తే ఇది 3.5 డిగ్రీలు ఎక్కువ కావటం గమనార్హం. నిజామాబాద్‌లో 41.4, రామగుండంలో 41.2, నల్లగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉప్పల్‌లో 40.8 డిగ్రీలు...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతల ప్రజలు ఎండల దెబ్బకు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో పరిస్థితి మ రింత తీవ్రంగా ఉంటుంది. ఉప్పల్‌లో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గండిపేట్, మౌలాలిలో 40.7, మియాపూర్‌లో 40.6, న్యూ నాగోల్‌లో 40.3, గుడిమల్కాపూర్‌లో 40.2, రెడ్‌హిల్స్, బండ్లగూడ, రాక్‌టౌన్, తిరుమలగిరి, సీతాఫల్మండిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అప్రమత్తమైన ప్రభుత్వం...
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లోని ప్రస్తుత ఉష్ణోగ్రతలు, తాగునీటి సౌకర్యాలు, ఆరోగ్యశాఖ ద్వారా అందుబాటులో ఉన్న ఔషధాలు, సప్లిమెంటరీ ట్యాబ్లెట్లు, సిర్‌పలు, ఓరల్ రీ-హైడ్రేషన్ సొల్యూషన్(ఓఆర్ఎస్) ప్యాకెట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాగా, వడదెబ్బ బాధితులకు వీలైనంత త్వరగా చికిత్స అందించేందుకు జిల్లాల్లో ర్యాపిడ్ రెన్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు జిల్లా మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా సాయంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వడదెబ్బ కేసుల వివరాలు రాష్ట్ర కార్యాలయానికి నివేదికలు అందజేయాలన్నారు.