భక్తే మోక్ష మార్గం

ABN , First Publish Date - 2022-04-15T05:30:00+05:30 IST

ఆత్మ శాశ్వతమే అయినా బద్ధ జీవన స్థితిలో అది నాలుగు క్లేశాలను అనుభవిస్తూ ఉంటుంది.

భక్తే మోక్ష మార్గం

ఆత్మ శాశ్వతమే అయినా బద్ధ జీవన స్థితిలో అది నాలుగు క్లేశాలను అనుభవిస్తూ ఉంటుంది. అవి:  పుట్టుక, మరణం, వృద్ధాప్యం, అనారోగ్యం. ‘నేను భగవంతుడి అంశను’ అనే సంగతి మరచిన జీవుడు తన మనసు వల్ల, ఇంద్రియాల వల్ల నిత్యం సతమతమవుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.


‘భక్తి ఒక కల్పితమైన భావ ప్రకటన మార్గం’ అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అది విజ్ఞానవంతులు ఆచరించే మార్గం కాదనీ, భక్తులకు వేదాంతం మీద సరైన అవగాహన ఉండదని కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. ఇక, భక్తి మార్గం కేవలం ప్రాథమిక స్థాయి సాధకులకు మాత్రమేనని మరికొందరు అనుకుంటారు. మానవ జీవిత అంతిమ లక్ష్యాన్ని చేర్చే పలు మార్గాల్లో అదొకటని ఇంకొందరు వాదిస్తూ ఉంటారు. చివరగా, భక్తి కేవలం ఒక మార్గమే తప్ప లక్ష్యం (మోక్షం) కాదని అనేవారూ ఉన్నారు. కానీ భగవద్గీతను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే... సకల జీవుల అంతిమ లక్ష్యం భక్తేనని తక్షణమే అవగతం అవుతుంది. ఇంతకీ భక్తి అంటే ఏమిటి? పరమ భక్తుడిగా పేరుపొందిన శ్రీ నారద ముని ‘నారద పాంచరాత్రము’ అనే గ్రంథంలో భక్తిని ఈ విధంగా నిర్వచించారు:


సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలమ్‌ హృషీకేన హృషీకేశ సేవనం భక్తిరుచ్యతే

‘భక్తి’ అంటే ఇంద్రియాలకు అధినేత అయిన ఆ దేవాదిదేవుడి సేవకు మన ఇంద్రియాలన్నిటినీ వినియోగించడం. పరమాత్మను జీవాత్మ సేవించినప్పుడు... రెండు అనుషంగికమైన ప్రభావాలు కలుగుతాయి. మొదటిది... భౌతికమైన పదవులన్నిటి నుంచి విముక్తి పొందడం, రెండవది ఇంద్రియాలన్నీ పరిశుద్ధం కావడం. పై శ్లోకంలో ‘భక్తి’ని ‘భక్తియుత సేవ’ అని నిర్వచించారు. భక్తి అంటే జడమైన, అచేతనమైన భావన కాదు. చైతన్య స్థితిలో భగవంతుణ్ణి సేవించడమే భక్తి. 


నాలుగు క్లేశాలు...

మనం ఈ భౌతికమైన శరీరాలం కామనీ, ఆత్మ స్వరూపులమనీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మనమందరం ఆత్మస్వరూపులమే అయినా... ప్రస్తుతం ఈ భౌతిక జగత్తుకు బద్ధులమై ఉన్నాం. భౌతిక దేహం అనే వస్త్రాన్ని ధరించి, ప్రకృతిని శాసించే పనిలో పోటీ పడుతూ, ప్రకృతి మీద పైచేయి సాధించడానికి... తీరిక లేకుండా నిత్యం పరుగెడుతున్నాం. ఆత్మ శాశ్వతమే అయినా బద్ధ జీవన స్థితిలో అది నాలుగు క్లేశాలను అనుభవిస్తూ ఉంటుంది. అవి: జన్మ, మృత్యు, జరా, వ్యాధి... అంటే పుట్టుక, మరణం, వృద్ధాప్యం, అనారోగ్యం. ‘నేను భగవంతుడి అంశను’ అనే సంగతి మరచిన జీవుడు తన మనసు వల్ల, ఇంద్రియాల వల్ల నిత్యం సతమతమవుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. 


మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి 

‘‘భౌతిక జగత్తులోఉన్న జీవాత్మలు నా  సనాతనమైన అంశలే. కానీ, వారు భౌతిక శక్తి వల్ల బంధితులై, మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియాలతో ప్రయాసపడుతున్నారు’’ అన్నాడు ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు  ఈ ప్రపంచంలో ఎవరికీ తమ నిజమైన స్వరూప స్థితి గురించి అవగాహన లేదు. ‘నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను ఆఫ్రికన్‌ని, నేను భారతీయుణ్ణి’... ఇలా వివిధ గుర్తింపులను ఆపాదించుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఉపాధుల కారణంగా జీవాత్మ నిర్విరామంగా దుఃఖాలను అనుభవిస్తూనే ఉంది. ఎప్పుడైతే ‘నేను దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడి అంశను’ అని మనిషి గ్రహిస్తాడో, అప్పుడే జీవాత్మ తన నిజ స్థితిని పొందగలదు. 


ముక్తి లేదా మోక్షం...

నిరోధోస్యానుశయనమాత్మనః సహ శక్తిభిఃముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః

‘తాను భగవంతుని అంశననీ లేదా సేవకుడననీ గ్రహించడమే ముక్తి’ అని ‘శ్రీమద్భాగవతం’లోని ఈ శ్లోకం వివరిస్తోంది. తాత్కాలికమైన ఉపాధులన్నిటినీ విడిచిపెట్టి, తాను శ్రీకృష్ణుని సేవకుడినన్న నిజమైన స్వరూప స్థితిని పొందడమే ముక్తి.


సేవను ఎలా ఆచరించాలి?

జీవుడు తన నిజ స్వరూప స్థితిలో సేవకుడు. కాబట్టే, మనం నిత్యం ఏదో ఒక సేవలో నిమగ్నమై ఉంటున్నాం. మాయామోహితమైన ప్రస్తుత బద్ధ స్థితిలో సైతం ఏదో ఒక ఉపాధిని చేపట్టి సేవ చేస్తూనే ఉన్నాం. మనిషి తాను భారతీయుడినని భావిస్తే, దేశ పురోగతి కోసం సేవ చేస్తాడు. తాను ఏదైనా సమాజానికి చెందినట్టు భావిస్తే, ఆ సమాజానికి సేవలు చేస్తాడు. అలా ప్రతిఒక్కరూ ఏదో ఒక విధమైన సేవ చేస్తున్నవారే. ఎందుకంటే, ఆ సేవలో తాము ఏదో ఒక రసాన్ని ఆస్వాదిస్తారు గనుక. అయితే, తాత్కాలికమైన ఈ రసాస్వాదనలన్నీ ఆత్మకు సంతృప్తిని ఇవ్వలేవు. భగవంతుని సేవకుడైన జీవాత్మ... తాను ప్రత్యక్షంగా శ్రీకృష్ణుణ్ణి సేవించినపుడే నిజమైన ఆనందాన్ని పొందగలదు. భగవంతుడు, భక్తుని మధ్య జరిగే ఈ పరస్పర సేవ్య, సేవక భావనే భక్తి. బ్రహ్మ-మధ్వ-గౌడీయ పరంపరకు ఆద్యుడైన శ్రీల రూపగోస్వామి విశుద్ధమైన భక్తితత్త్వాన్ని వివరిస్తూ ‘‘అనుకూల పద్దతిలో స్వామిని సేవిస్తూ, సంపూర్ణంగా కృష్ణచైతన్యంలో నిమగ్నమైన ప్రవృత్తి ద్వారానే... ఒక వ్యక్తి ప్రథమశ్రేణి భక్తుడవుతాడు’’ అని తెలిపారు. ఈ పరంపరలో ప్రస్తుత ఆచార్యుడు, హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకుడు శ్రీల ప్రభుపాద ‘‘ప్రతిఒక్కరూ భగవంతుణ్ణి ఏ విధమైన స్వప్రయోజనాలను ఆశించకుండా, కల్పిత తాత్విక చింతనలు లేకుండా సేవించాలి’’ అని అంటారు. ఇదే విశుద్ధమైన భక్తి.

భగవన్నామ శ్రవణ, సంకీర్తనలే ప్రస్తుత యుగంలో భగవంతుణ్ణి సేవించే అత్యంత సరళమైన మార్గాలు.


హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

ఈ మహామంత్రాన్ని జపించడమంటే, శబ్దరూపంలో భగవంతుని సాంగత్యాన్ని పొందడమే. శ్రీల ప్రభుపాదుల లాంటి ప్రామాణిక ఆచార్యుల ఆశ్రయంలో ఎట్టి స్వలాభాపేక్ష లేకుండా చేసే భగవన్నామ జప, సంకీర్తనాదులు భగవంతుడి ప్రసన్నతను కలిగించగలవు. తద్వారా విశుద్ధ భక్తిని మనం పెంపొందించుకోగలం. కాబట్టి భక్తే భగవంతుణ్ణి చేరే మార్గం, అదే అంతిమ లక్ష్యం. జపిద్దాం. ఆనందంగా జీవిద్దాం.


సత్యగౌర చంద్రదాస ప్రభూజీ అధ్యక్షుడు

హరే కృష్ణ మూవ్‌మెంట్‌, హైదరాబాద్‌

9396956984  

Updated Date - 2022-04-15T05:30:00+05:30 IST