భక్తజనసంద్రం.. యాదగిరి క్షేత్రం

ABN , First Publish Date - 2022-05-22T06:05:47+05:30 IST

ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవురోజుకావడంతో క్షేత్ర సందర్శనకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

భక్తజనసంద్రం.. యాదగిరి క్షేత్రం
నిత్యపూజలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, మే 21: ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవురోజుకావడంతో క్షేత్ర సందర్శనకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దర్శనానంతరం ఆలయ ఘాట్‌రోడ్‌, పెద్దగుట్టపై రాయిగిరి చెరువు ప్రాంతాల్లోని గార్డెన్లలో భక్తులు పిల్లాపాపలతో సేదతీరారు.  వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.25,09,595 ఆదాయం సమకూరింది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శనాలకు వస్తున్న భక్తులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం కుటుంబసభ్యులతో సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని దోర్నాల గ్రామానికి శంకరమ్మ అనే వృద్ధురాలు యాదగిరికొండకు దర్శనం కోసం వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. అనంతరం కుటుంబ సభ్యులు తాగునీటిని ఇచ్చి సేదతీర్చారు. కొంతసేపటి పోలీసులు అనంతరం ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పించారు. 


స్వామికి వైభవంగా నిత్యారాధనలు

యాదాద్రీశుడికి నిత్యారాధనలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో ఆరంభమైన నిత్యవిధి కైంకర్యాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు, అష్టభుజి ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. అనుబంధ రామలింగేశ్వరుడికి, స్పటిక మూర్తులకు నిత్యపూజలు శైవ సంప్రదాయరీతిలో నిర్వహించారు. లక్ష్మీనర్సింహస్వామికి హైదారాబాద్‌కు చెందిన భక్తుడు సీహెచ్‌ శ్రీధర్‌ నాలుగు వెండి కలశాలను బహూకరించారు. నృసింహుడిని ఇండస్ట్రియ ల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణ, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.  


భూతల స్వర్గంలా యాదగిరిక్షేత్రం : మంత్రి సత్యవతి రాథోడ్‌

ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదగిరిక్షేత్రం కృష్ణరాతి శిలలు, స్వ ర్ణమయ తాపడం పనులతో భూతలస్వర్గంలా వెలుగొందుతోందని మ హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్‌ అభివర్ణించారు. ఆమె శనివారం కుటుంబసమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పట్టుదల, దీక్ష, కృషికి ఆలయ పునర్నిర్మాణం నిదర్శనమన్నారు. 

Updated Date - 2022-05-22T06:05:47+05:30 IST