భక్తజన సింగోటం

ABN , First Publish Date - 2022-01-19T05:08:50+05:30 IST

లక్ష్మీనరసింహ స్వామి గోవింద నామ స్మరణతో సింగవట్నం మార్మోగింది. భారీ జనసంద్రం మధ్య స్వామి రథోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది.

భక్తజన సింగోటం
చెరుకు గడలు కొంటున్న భక్తులు

కనుల పండువగా లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం

భారీగా తరలొచ్చిన భక్తులు


 కొల్లాపూర్‌ రూరల్‌, జనవరి 18: లక్ష్మీనరసింహ స్వామి గోవింద నామ స్మరణతో సింగవట్నం మార్మోగింది. భారీ జనసంద్రం మధ్య స్వామి రథోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటంలో వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఊరేగింపు జనసందోహం మధ్య నిర్వహించారు. రథాన్ని పూలమాలలతో అలంకరించి, మంగళవారం తెల్లవారు జాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. దీక్ష హవనము, రథాంగ హవనము, లక్ష్మీ నృసింహ హవనము, గాయత్రీ హవనము, రుద్ర హవనము కార్యక్రమాలను నిర్వహిం చారు. పట్టు వస్త్రాలతో అలంకరించిన ఉత్సవ మూర్తులను వేద పండితులు మంగళవాయిద్యాల మధ్య రథంపైకి తీసుకొచ్చారు. అంతకు ముందు చెంచులు రథోత్సవం వద్ద తమ ఆచార వ్యవహారాలతో పూజలు చేశారు. రథంపై కొలువుదీరిన స్వామి వారికి సురభి వంశీయులైన ఎస్వీకేకేబీ ఆదిత్య లక్ష్మారావు మొదట పూజలు చేపట్టారు. అనంతరం సుదర్శన సేవలో భాగంగా రథం నుంచి భక్తులకు స్వామి వారు దర్శనం ఇచ్చారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి రథోత్సవంలో ఉన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత రథాన్ని లాగి ఊరేగింపును ప్రారంభించారు. భారీ జన సందోహం మధ్య గోవింద నామ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు. ప్రధాన ఆలయం నుంచి గుట్టపై కొలువు దీరిన లక్ష్మీదేవమ్మ ఆలయం వరకు రథాన్ని లాగారు. కృష్ణానదిపై బోట్లను నిషేధించడంతో రాయలసీమ నుంచి వచ్చే భక్తులు వాహానాల్లో తరలొచ్చారు. దాంతో సింగోటం వెళ్లే ప్రధాన రహదారి వెంట భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పరిసర ప్రాంతాలు కూడా వాహనాలతో కిక్కిరిసి పోయాయి. అయితే బోట్లను నిషేధించడంతో ఇంకా చాలా మంది భక్తులు రథోత్సవానికి రాలేక పోయారు.  


కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘన

కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కులు ధరించ డంతో పాటు, భౌతిక దూరం పాటించాలన్న కొవిడ్‌ నిబంధనలను భక్తులు పాటించ లేదు. ఆలయ పరిసర ప్రాంతంలో వైద్యాధికారులు చేసిన సూచనలను కూడా పట్టించుకో లేదు. స్వామి వారిని దర్శించుకో వడంతో పాటు రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. 


సౌకర్యాలు నిల్‌..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అతి పెద్ద జాతర అయిన సింగోటం లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాల్లో భక్తులు తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రహోత్మ వాలకు నెల రోజుల ముందే ఎమ్మెల్యే హర్షవర్దన్‌ రెడ్డి, దేవాదాయశాఖ రాష్ట్ర సంయుక్త కమిషనర్‌ రాధకృష్ణ ఏర్పాట్లపై సమీక్షించినా, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు  కనిపించింది.











Updated Date - 2022-01-19T05:08:50+05:30 IST